చిత్రం చెప్పే విశేషాలు
(16-09-2023/1)
వ్యర్థాలతో అద్భుతమైన కళాకృతులను తీర్చిదిద్ది తమ ప్రతిభను చాటుతున్నారు బ్రహ్మపుర ప్రభుత్వ పరిశ్రమల శిక్షణా కేంద్రం(ఐటీఐ) విద్యార్థులు. వాహనాల విడి భాగాలతో దశావతారాల కళాకృతులు రూపొందించింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల గిరులు మిరుమిట్లు గొలుపుతున్నాయి. తిరుపతిలోనూ పలుచోట్ల విద్యుదీపాలంకరణలు కనువిందు చేస్తున్నాయి. తిరుమలలో శ్రీహరి గజేంద్రమోక్షం సైకతశిల్పం, తదితర సెట్టింగ్‌లు ఆకట్టుకుంటున్నాయి.
ఎలాగైనా ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలన్న ఆకాంక్షతో సిద్దిపేట బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన కేంద్రంలో ఓ దివ్యాంగురాలు టెట్ పరీక్షకు హాజరయ్యారు.
చిత్రంలో దివ్యాంగుడు రామయ్య ‘డబుల్’ ఇంటి కోసం సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ కలెక్టరేట్‌కు శుక్రవారం వచ్చారు. దరఖాస్తు చేసి చాలా రోజులైందన్నారు. పరిశీలన పూర్తయినా.. ఇల్లు రాలేదని వాపోయారు. ఇప్పటికే ఏడు సార్లు కలెక్టరేట్‌కు వచ్చినట్లు చెప్పారు.
ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకొని మహారాష్ట్రలోని పుణెలో కాళికామాత మందిర్‌వద్ద ఆహారధాన్యాలతో తీర్చిదిద్దిన మోదీ చిత్రమిది.
దివంగత బ్రిటన్ యువరాణి డయానా గతంలో ధరించిన ఈ స్వెటర్ లండన్‌లోని సోథిబే సంస్థ తాజాగా నిర్వహించిన వేలంలో రికార్డుస్థాయిలో 1.1 మిలియన్ డాలర్ల (రూ.9.14 కోట్లు) ధర పలికింది.
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోతున్నాయి. శుక్రవారం సచివాలయం మువ్వన్నెల్లో తళుకులీనింది.
ఓజోన్ డే సందర్భంగా విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఆదిలాబాద్ పట్టణంలోని టెట్ పరీక్ష రాసేందుకు రవీంద్రనగర్ పరీక్ష కేంద్రానికి వచ్చిన అభ్యర్థుల హాల్ టికెట్‌పై విద్యార్థి పాఠశాల అని రాసి ఉంది. సెంటర్ వద్దకు వచ్చిన తరువాత విద్యార్థి డిగ్రీ కళాశాల అని ఉండటంతో కాసేపు ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడ్డారు.
‘బాబుతో నేను’ నినాదంతో ఉన్న ఫ్లెక్సీపై సంతకం చేసి మద్దతు తెలియజేస్తున్న ఈ వృద్ధురాలి పేరు సూర్యవతి. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెదేపా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరం వద్ద.. సత్తువ కూడదీసుకొని ఆమె చేసిన సంతకం.. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకానికి నిదర్శనం.
సిద్దిపేట నుంచి దుద్దెడ వరకు శుక్రవారం రైలు ట్రయల్‌రన్ చేపట్టారు. ఈ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసేందుకు పలువురు ఆసక్తి చూపారు. ఇదే క్రమంలో పొలాల మధ్య వేగంగా దూసుకెళ్లిన రైలు చూపరులకు ఆనందాన్ని కలిగించింది.
కర్నూలు నగర శివారు గుత్తి మార్గంలో జాతీయ రహదారిపై ఓ లారీ పడవను తీసుకెళ్తూ కనిపించింది. విజయవాడ నుంచి సుంకేసులకు పడవను తరలిస్తున్నట్లు ప్రతినిధి తెలిపారు. రహదారిపై కొద్దిసేపు లారీ ఆగడంతో స్థానికులు ఆసక్తిగా చూస్తూ ఉండిపోయారు.
వరంగల్‌కు చెందిన బాలావత్ వీరు, కొర్ర రాము కొబ్బరి పువ్వులను రాజమహేంద్రవరం నుంచి తీసుకొచ్చి ఖమ్మంలోని కోర్టు దారి వెంట విక్రయిస్తున్నారు. వీటితో తయారుచేసిన వంటకాలు రోగనిరోధక శక్తి పెంచేందుకు, మధుమేహం, ఇతర వ్యాధులను నియంత్రించేందుకు దోహదపడతాయన్నారు.