చిత్రం చెప్పే విశేషాలు

(17-09-2023/1)

వినాయక నవరాత్రులకు ఖైరతాబాద్‌ వినాయకుడి ప్రతిమ ముస్తాబైంది. అడ్డుగా కట్టిన పరదాలను ప్రజల సందర్శనార్థం శనివారం సాయంత్రం తొలగించారు. దీంతో భారీ ఏకదంతుని విగ్రహాన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

వినాయక చవితి కోసం రాజాజీనగర రెండో స్టేజ్‌లోని మిల్క్‌ కాలనీలోని స్వస్తిక్‌ యువకుల సంఘం రూ.12 లక్షల విలువైన విగ్రహాన్ని ప్రత్యేకంగా చేయించింది. సుమారు 60 వేల అమెరిన్‌ డైమండ్లు, నవరత్నాలను పొదిగిన ఈ విగ్రహం 5.7 అడుగుల ఎత్తు, 150 కిలోల తూకం ఉంటుంది.

 వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వీటు సంస్థ చెర్రీస్‌ 101 కిలోల లడ్డూ తయారు చేసింది. దీనిని ఆ సంస్థ యాజమాన్య ప్రతినిధులు తుమ్మల రవికుమార్, రజినీకాంత్‌లు బీసెంట్‌ రోడ్డులోని వినాయక ఉత్సవ కమిటీ వర్తక సంఘం వారికి బహూకరించారు. 

ఎల్బీస్టేడియం రోడ్డులోని రెడ్‌రోజ్‌ ప్యాలెస్‌పై ఉన్న గద్ద విగ్రహం రెక్కపై కూర్చొని.. తనలాగే ఉన్న ఆకారాన్ని తదేకంగా పరికిస్తున్న మరో గద్ద. 

చంద్రయాన్‌-3 విజయం నుంచి పొందిన స్ఫూర్తితో మైసూరుకు చెందిన కళాకారుడు మహేశ్‌ యశ్వంత్‌ వినాయకుని విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహాన్ని ఉంచే పీఠాన్ని చంద్రుని ఉపరితలంలా చేసి, ఒక బండరాతిపై లంబోదరుని విగ్రహాన్ని ఉంచారు. పక్కనే రాకెట్ నమూనాలను, విక్రం ల్యాండర్, రోవర్‌లను ఉంచారు. 

నగరంలోని రాజుపేట శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కాణిపాకం వినాయకుని ఆకృతిలో 15 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు  నిర్వహించనున్నారు. 

నిజామాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు ఎక్కడపడితే అక్కడ కెమెరాలు పట్టుకొని చిన్న చిన్న ఉల్లంఘనలకే ఫొటోలు తీసి జరిమానాలు విధిస్తున్నారు. కానీ.. ఓ వ్యక్తి బండి నంబరు ఉండాల్సిన చోట.. ‘బిగ్‌ బ్రదర్‌’ అని రాసుకొని పోలీసుల ముందే తిరుగుతున్నా ఏమీ అనలేని పరిస్థితి. 

ఆదిలాబాద్‌ జిల్లా తాంసికి చెందిన మేకల కాపరి పిట్ల అనిల్‌కుమార్‌కు చెందిన ఓ మేక రెండు పిల్లలకు జన్మనిచ్చింది. మేక పాలు సరిపోక మేక పిల్లలు ఆకలితో అలమటించాయి. శునకం జాతి వైరాన్ని మరిచి రోజూ మధ్యాహ్నం మేక పిల్లల చెంతకు చేరి పాలిచ్చి ఆకలి తీరుస్తోంది. 

ముంబయిలో చిరుధాన్యాలతో తయారు చేసిన గణేశుడి విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్న ఓ కళాకారుడు.

పర్యావరణంతోపాటు అటవీ సంపదను పరిరక్షించాలనే సందేశాలతో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం సమీపంలో చీతా ఆకారంలో నిర్వహించిన డ్రోన్‌ షో.

అంతర్జాతీయ తీర ప్రాంత శుభ్రత కార్యక్రమాన్ని ఏడబ్ల్యూసీఎస్, హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కొత్తపట్నంలో నిర్వహించారు. తీరంలో పర్యాటకులు ఎక్కడంటే అక్కడ చెత్తాచెదారం, వ్యర్థాలు వేయకుండా తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన డాల్ఫిన్ల ఆకారంలోని చెత్తబుట్టలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.

అచ్చం డైనో ప్రపంచాన్ని పోలినట్లుగా సిద్దిపేటలో తీర్చిదిద్దిన డైనోసారు థీమ్‌ పార్కు ఆదివారం ఆవిష్కృతం కానుంది.

కొత్త విషయాలు తెలుసుకోవచ్చు..

చిత్రం చెప్పే విశేషాలు..!(27-09-2023/2)

చిత్రం చెప్పే విశేషాలు.. (27-09-2023/1)

Eenadu.net Home