చిత్రం చెప్పే విశేషాలు
(25-09-2023/2)
గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలతో వినాయకుణ్ని అలంకరించారు. మండపాన్ని వెండితో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ గణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గత కొన్నేళ్లుగా తాము ఇలాగే గణపతి ప్రతిష్ఠ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
నక్కలగుట్టలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు తమ గురువుల చిత్రాలను పచ్చని వృక్షంలో అంటించారు. చెట్టును గీసి ఒక్కో పత్రంపై ఒక్కో గురువు చిత్రాన్ని అంటించి గురుతర భక్తిని చాటారు.
గుజరాత్‌లోని సూరత్ నగరం మినీ హీరా బజార్ ప్రాంతమిది. వజ్రాల కోసం. వజ్రాల వ్యాపారం జరిగే ఈ ప్రాంతంలో ఆదివారం ఉదయం రహదారిపై కొన్ని సీవీడీ వజ్రాలు కనిపించాయి. దీంతో ఆ దారిన వెళుతున్న వారంతా ఆ ప్రాంతాన్ని ఇలా అణువణువూ కళ్లతో స్కాన్ చేసి వజ్రాలను గుర్తించే పనిలో పడ్డారు.
కామారెడ్డి జిల్లాకేంద్రంలో గొల్లవాడలో ఏర్పాటు చేసిన మండపంలో రుద్రాక్షలతో రూపొందించిన వినాయక విగ్రహాన్ని నెలకొల్పారు. లక్ష వరకు రుద్రాక్షలను వినియోగించినట్లు తయారీదారులు వెల్లడించారు. నిత్యం వందలాది మంది భక్తులు మండపాన్ని దర్శించుకుంటున్నారు.
సత్తుపల్లిలోని తపాలాశాఖ కార్యాలయం సమీపంలో మస్తాన్‌బీ పదేళ్లుగా మొక్కజొన్న కంకులు కాలుస్తూ జీవనం సాగిస్తున్నారు. బొగ్గులపై పొత్తులను కాల్చేందుకు చేతులతో పొద్దంతా విసనకర్ర విసురుతూ ఇబ్బంది పడేవారు. ఆ శ్రమ తగ్గించుకునేందుకు చిన్నపాటి ఛార్జింగ్ ఫ్యాన్ ఏర్పాటు చేసుకున్నారు.
ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు పొలాల మధ్య చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. వైరా మండలం సోమవరం గ్రామం వద్ద కొద్ది దూరంపాటు తారురోడ్డును సైతం వేశారు. నిర్మాణ సామగ్రిని వేగంగా తరలించేందుకు అవసరమైన చోట్ల ఇప్పుడే రోడ్డు వేస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని ఓ కూరగాయల దుకాణంలో టమాటా వక్రతుండుని ఆకారంలో దర్శనమిచ్చింది. గణపతి నవరాత్రుల వేళ బొజ్జ గణపయ్య టమాటా ఆకృతిలో కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
గణపతి మండపం వద్ద ఏర్పాటుచేసిన హుండీలో భక్తులు తోచినంత డబ్బు వేసేవారు. నిమజ్జనం తర్వాత డబ్బులు లెక్కపెట్టి ఆదాయాన్ని అంచనా వేసేవారు. ఇప్పుడు హుండీతో పాటు.. లక్కీ డ్రా టిక్కెట్ డ్రాప్ బాక్సులు పెడుతున్నారు.
పాడేరు ఘాట్‌రోడ్డులో మంచు సోయగాలు కనువిందు చేస్తున్నాయి. మోదకొండమ్మ పాదాలు నుంచి కాంతమ్మ వ్యూ పాయింట్ వరకు ఆదివారం మధ్యాహ్నం సమయంలోనే రోడ్డుకు ఇరువైపులా మంచు అవహించింది. వాహన చోదకులు కొంత ఇబ్బందులు పడ్డారు.
స్వాతంత్య్ర సమరయోధులు, దేవతామూర్తులు సామాజిక అంశాలతో పాటు చంద్రయాన్ వేషధారణలో హంటర్‌రోడ్‌లోని వరంగల్ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు. చంద్రుడిని ముద్దాడిన చంద్రయాన్ కళ్ల ముందు కదలాడినట్లుగా ఓ బాలుడు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.
ఈ చిత్రం చూస్తే అచ్చం రైలు బోగీల్లా ఉన్నాయి కదూ.. భూపాలపల్లి మండలంలోని నేరేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులకు రైలు బోగీలా రంగులు వేశారు. విద్యార్థులను ఆకట్టుకునేలా ఉండగా, పాఠశాలలో కొత్త శోభ సంతరించుకుంది.
బోగోలులోని శ్రీవిజయ గణపతి ఆలయ బృందం ఏర్పాటుచేసిన గణేశుడి ప్రతిమకు ఆదివారం నిమజ్జన వేడుకలు వైభవంగా చేశారు. అంతకు ముందు భక్తులు తెచ్చిన 108 రకాల ప్రసాదాలను అర్చకులు నైవేద్యంగా పెట్టారు. లడ్డూకు వేలంపాట నిర్వహించారు.