చిత్రం చెప్పే విశేషాలు

(27-09-2023/2)

సోషల్‌ మీడియాలో లైకుల కోసం.. వింత పోకడ.. ఎవరూ ధరించని విధంగా వినూత్నంగా ఉండాలని ఆరాటంతో ఓ వ్యక్తి ఈ శిరస్త్రాణం ధరించాడు. రూ.5 వేలు వెచ్చించి ముంబయి నుంచి తెప్పించుకున్నానని ఆ యువకుడు చెప్పాడు. కరీంనగర్‌ ఆర్‌టీసీ బస్టాండ్‌ వద్ద ‘ఈనాడు’ కెమెరాకు ఈ దృశ్యం చిక్కింది.

డోన్‌ పట్టణానికి తాగునీరు సరఫరా చేసే కోటకొండ నుంచి ఉన్న పైపులైన్‌ మంగళవారం మధ్యాహ్నం లీకైంది. దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామ సమీపంలో ఒక్కసారిగా 30 అడుగుల మేర నీరు ఎగిసిపడింది. వంక మీదుగా తాగునీటి పైపులైన్‌ వెళ్లింది. 

వినాయక నవరాత్రుల సందర్భంగా ఒంగోలు నగరం గద్దలగంటపాలెం ఆర్పీరోడ్డులోని ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని రూ.15 లక్షల విలువైన నోట్లతో మంగళవారం రాత్రి ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కనులారా వీక్షించారు. 

 జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా నిర్వహించే శిబిరాల్లో పంపిణీ చేసే మందుల పెట్టెలపైనా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చిత్రాలు అతికించారు. మంగళవారం సంగం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఈ పెట్టెలు కనిపించాయి. 

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రెండు రోజులుగా చిత్రావతి నది ప్రవహిస్తోంది. మైలవరం మండల పరిధిలోని బెడుదూరు-పొట్టిపాడు గ్రామాల మధ్యలోని చిత్రావతి నదిలోని పైపులైన్‌పైన వేసిన రోడ్డు వరద నీరు ఉద్ధృతికి కొట్టుకుపోయింది.

వినాయక ఉత్సవాలు అంటే సంబరాలతో పాటు రూ.వేలు, రూ.లక్షల్లో జరిగే లడ్డూ వేలం పాటలు అంటే అందరికీ ఆసక్తి. ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో మాత్రం స్వామిని ఊరేగించే వాహనం పైనే అందరి ఆసక్తి. ఎందుకంటే ఈ వాహనాన్ని ఈసారి రూ.ఎనిమిది లక్షలతో ప్రత్యేకంగా ఒక వాహనాన్ని తయారు చేశారు. 

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరుతూ దేశ రాజధానిలో భారీ నిరసనకు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే 50 లక్షల లేఖలను కేంద్ర మంత్రికి పంపనున్నట్లు తెలిపింది.

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలంలో ఆందోళనకు హాజరైన ఓ ఆశా కార్యకర్త తన చిన్నారిని పక్కనే ఖాళీగా ఉన్న తోపుడుబండిపై నిద్రపుచ్చారు.. ఇంతలో అక్కడి అలికిడికి నిద్ర లేచి ఏడుస్తున్న చిన్నారి వద్దకు వెళ్లి తల్లి లాలిస్తున్న దృశ్యాన్ని ‘ఈనాడు’ క్లిక్‌ మనిపించింది. 

కరీంనగర్‌ మానేరు వంతెన జిగేల్‌మంటుంది. స్మార్ట్‌సిటీలో భాగంగా 50 స్తంభాలకు 100 వీధిలైట్లను కొత్తగా ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి మంత్రి గంగుల కమలాకర్‌ వీటిని ప్రారంభించారు. 

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ మంగళవారం దోమలగూడలోని పార్టీ నగర కార్యాలయం ముందు దివ్యాంగులు దీక్షచేపట్టారు. ఈ సందర్భంగా ‘నేను సైతం బాబు కోసం’ అంటూ మద్దతుగా సంతకాలు చేశారు.  

చిత్రం చెప్పేవిశేషాలు(09-05-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(09-05-2025)

చిత్రం చెప్పే విశేషాలు(08-05-2025)

Eenadu.net Home