చిత్రం చెప్పే విశేషాలు
(29-09-2023/2)
అనంత చతుర్దశిని పురస్కరించుకుని శిరూరు మఠాధిపతి వేదవర్ధన తీర్థ నేతృత్వంలో అర్చకులు శ్రీకృష్ణుని విగ్రహానికి అనంత పద్మనాభ స్వామిలా అలంకరించారు. పర్యాయ శ్రీకృష్ణాపుర మఠాధిపతి విద్యాసాగర తీర్థ స్వామివారికి మహాపూజను నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ తన పరిసరాలు శుభ్రంగా ఉంచితే స్వచ్ఛతను కాపాడగలమని, సమాజానికి మేలు జరుగుతుందని నాల్కో సీఎండీ శ్రీధర్ పాత్ర్ అన్నారు. స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పూరీ సముద్ర తీరంలో మానస్‌కుమార్ సాహు తీర్చిదిద్దిన కళాఖండాన్ని ఆయన ప్రారంభించారు.
వినాయక విగ్రహాలను తరలించేందుకు వినియోగించిన వాహనాలు, వాటి అలంకరణలు.. నిమజ్జనోత్సవాలకు మరింత శోభను చేకూర్చాయి. హైదరాబాద్ సౌత్ జోన్‌కు చెందిన ఓ కుటుంబం 50వ దశకం నాటికి రోల్స్‌రాయిస్ కారును గుర్రపు బగ్గి తరహాలో అలంకరించి, దానిపై విగ్రహాన్ని ఉంచి నెక్లెస్ రోడ్డుకి తీసుకొచ్చారు.
వివిధ వృత్తుల వారిని కలిసి మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిల్లీలోని అతిపెద్ద ఫర్నీచర్ మార్కెట్ కీర్తినగర్‌లో పర్యటించారు. వడ్రంగి పనివారిని కలిసి ముచ్చటించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
కల్లూరులో హంద్రీ నది ప్రాంతంలో గురువారం పైపులైను నుంచి నీళ్లు పైకి ఎగసిపడ్డాయి. నీరంతా వృథాగా పోయిందని స్థానికులు వాపోయారు. తరచూ పైపులైను లీకేజీల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోందని పలువురు పేర్కొన్నారు.
గణేష్ నిమజ్జనోత్సవం చూడటానికి వేలాది మంది వస్తే.. కొందరు పొట్ట కూటి కోసం విచిత్ర వేషాలు వేస్తూ బిచ్చమెత్తుకోవడం తెలిసిందే. ఓ తల్లి తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద ఒక చిన్న స్టూల్ వేసి భిక్షాటన కోసం డబ్బా ఉంచి, తన చిన్నారి కొడుకు ఒంటికి రంగు పూసి.. భిక్షాటనకు కూర్చోబెట్టింది.
ఖమ్మం నగరంలోని మున్నేరులో విగ్రహాలను బుధవారం నిమజ్జనం చేశారు. నీటిమట్టం తక్కువగా ఉండటంతో ప్రతిమలు పూర్తిస్థాయిలో మునగలేదు. గురువారం తెల్లవారుజాము నుంచే జాలర్లు, వీధి వ్యాపారులు కరిగిన విగ్రహాల నుంచి వెలుగుచూసే ఇనుము కోసం వేట సాగించారు.
నేడు ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేటకు చెందిన యువ చిత్రకారుడు రాము.. రావి ఆకుపై హృదయ నమూనా తీర్చిదిద్దారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని కోరారు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పార్లమెంట్ సమీపంలోని విజయ్‌చౌక్‌లో గురువారం తెదేపా యువ నేత ఆడారి కిశోర్ కుమార్ శీర్షాసనం వేసి నిరసన తెలిపారు. రాష్ట్రంలో పాలన తలకిందులైనందుకే ఇలా నిరసన తెలుపుతున్నానని చెప్పారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గోవెన గ్రామానికి చెందిన ఈ బాలికలు.. మూడు కిలోమీటర్ల దూరంలోని భీమన్‌గొంది ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. పాఠశాలకు వెళ్లాలంటే.. నిత్యం గోవెన పక్కనే ఉన్న ఈ వాగును దాటాలి. దీంతో బాలికల తల్లి దగ్గరుండి ఇలా వాగు దాటిస్తున్నారు.