చిత్రం చెప్పే విశేషాలు
(02-10-2023/1)
ప్రపంచ ప్రసిద్ధి చెందిన డిస్నీ ల్యాండ్, యూనివర్సల్ స్టూడియోస్ తరహాలో చెన్నైకి అధునాతన థీమ్‌పార్కును తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం చెన్నై శివారులో 100 ఎకరాలు కేటాయించేలా చర్చలు నడుస్తున్నాయి.
ఈ చిత్రంలో కనిపిస్తున్నవి పుట్టగొడుగులు కాదు.. అచ్చం అలాగే ఉండే వెదురుకొక్కులు.. మన్యంలో గిరిజనులు వీటిని ఇష్టంగా తింటుంటారు. ఇవి వెదురు పొదల్లో లభ్యమవుతాయి. అత్యంత రుచికరంగా ఉండే ఈ కొక్కులను గిరిజనులు కూరగా వండుకుని ఎంతో ఇష్టపడి ఆరగిస్తుంటారు.
పూజ్య బాపూజీ పరిశుభ్రత కోసం కృషి చేశారని, ఆ మహనీయుని ఆశయ సాధన దిశగా ఆదివారం దేశవ్యాప్తంగా ఒక గంట స్వచ్ఛ సేవకు వినియోగించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో సైకత శిల్పం ద్వారా సందేశమిచ్చారు.
ఇటీవలి కాలంలో హృదయ సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలపై అవగాహన కల్పించే విధంగా చెన్నై మెరీనా తీరంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఒంగోలు నగరం గుంటూరు రోడ్డులోని ఏ-వన్ కన్వెన్షన్ హాల్ ఎదుట ఖాళీ స్థలంలో కొద్ది రోజుల క్రితం ఎగ్జిబిషన్ పెట్టారు. అందులో భాగంగా ఈఫిల్ టవర్ నమూనా ఉంచారు. ప్రస్తుతం ఎగ్జిబిషన్ ఎత్తేసినా.. టవర్ నమూనాను అక్కడే వదిలేశారు.
మాచ్‌ఖండ్ జలవిద్యుత్కేంద్రానికి చెందిన వించ్‌హౌస్ వద్ద ఆదివారం సాయంత్రం ఒకవైపు నల్లని మేఘాలు.. మరోవైపు వడివడిగా సీలేరుకు పరుగులు తీస్తున్న మత్స్యగెడ్డ.. చుట్టూపచ్చని పచ్చని కొండలు.. చూపరులకు కనువిందు చేశాయి.
పాడేరు సమీపంలోని వంజంగి మేఘాల కొండపై మంచు సోయగాలు మదిని దోచుకుంటున్నాయి. ఆదివారం ఉదయం కొండపై మంచు తెరలు చీల్చుకుంటూ సూర్యోదయ సన్నివేశం సందర్శకులను కట్టిపడేసింది. రెండు రోజులు వరుస సెలవులు రావడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు.
పట్టణానికి చెందిన కళాకారుడు అశోక్ సోమవారం గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని ఆదివారం వారిద్దరి చిత్రాలను రావి ఆకుపై చిత్రీకరించారు. అశోక్ 20 ఏళ్లుగా చిత్రకారునిగా పలు చిత్రాలను వేశారు. సూక్ష్మ కళాకృతుల చిత్రకళలో రాణిస్తున్నారు.
సిద్దిపేట ఎన్సాన్‌పల్లి బాలికల గురుకుల పాఠశాలకు కుమార్తెను చూడటానికి తల్లి వచ్చి, బాగోగులు ఆరా తీశారు. వెంట తెచ్చిన అన్నం తినిపించారు.
గాంధీజీ జయంతిని పురస్కరించుకుని నిజాంపేటలోని గ్రీన్ కోర్టు ఆపార్ట్‌మెంట్‌కు చెందిన హనుచరణ్ చిత్రాలు వేయడంతో పావీణ్యం సంపాదించాడు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో బాలుడు రెండు గంటల వ్యవధిలోనే 10 అడుగుల ఎత్తు, 7 అడుగుల వెడల్పుతో కూడిన చిత్రాన్ని గీశాడు.