చిత్రం చెప్పే విశేషాలు (21-10-2023/1)
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సాహిబాబాద్‌లో శుక్రవారం నమో భారత్ రైలును ప్రారంభించిన అనంతరం మహిళా సిబ్బందితో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
బతుకుదెరువు కోసం సంచార జాతికి చెందిన ఓ కుటుంబం ద్విచక్ర వాహనంపై కుటుంబ సభ్యులతో పాటు పెంపుడు కుక్క, సామగ్రితో చౌటుప్పల్ నుంచి సంస్థాన్ నారాయణపురం మీదుగా జనగాం వెళ్తుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్ మనిపించింది.
రంగారెడ్డి జిల్లా మణికొండ పురపాలక సంఘం పరిధిలోని పుప్పాలగూడలో ఉన్న శ్మశాన వాటికనూ ఆధునికీకరించారు. దాని లోపల దారి పొడవునా రాళ్లను వరుస క్రమంలో పేర్చి.. రంగులు వేశారు. వాటిపై మానవ జీవనచక్రాన్ని తెలిపే చిత్రాలు వేయడంతో పాటు ఆలోచింపజేసేలా జీవన సూత్రాలు రాశారు.
ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. ఇలాంటి వాటిలో కొన్ని విభిన్నంగా ఉంటాయి. అలాంటిదే ఇది. విశాఖ నగరంలోని ఓ యువకుడు శుక్రవారం తన శిరస్త్రాణానికి పైన మంకీక్యాప్ ధరించి వెళుతుండగా పలువురు ఆసక్తిగా తిలకించారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన 12 మంది మహిళలు ఎకరం పొలంలోని పూలను కొని కరీంనగర్ మార్కెట్‌లో విక్రయానికి బయలుదేరారు. 15 వేల పెట్టుబడి పెట్టిన వీరు.. ఎంతోకొంత లాభం రాబట్టుకోవాలని కరీంనగర్ మార్కెట్‌కు చేరుకున్నారు.
అస్సాంలోని నాంగావ్ జిల్లాలో దుర్గా మండపాన్ని రూ.11 లక్షల విలువైన నాణేలతో వినూత్నంగా ఏర్పాటు చేశారు. రూపాయి, రూ.2, రూ.5 నాణేలు ఉపయోగించి అలంకరించిన ఈ దుర్గా మండపం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బ్యాంకు నుంచి రూ.10 లక్షల విలువైన నాణేలు, భక్తుల నుంచి విరాళాలు సేకరించారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అక్కిరెడ్డిపాలెం దుర్గాదేవి మండపం వద్ద భక్తులు అమ్మవారి ఆకారంలో దీపారాధన చేశారు. ఉదయం అమ్మవారిని సరస్వతిదేవిగా అలంకరించారు.
దసరా సందర్భంగా హుస్సేన్‌సాగర్, ట్యాంకుబండ్ ప్రాంతాలను రంగురంగుల విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. సాగర్ మధ్యలో మెరిసిపోతున్న తథాగతుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
పండగలకు ఊరెళ్లే నగరవాసులకు పాట్లు తప్పడం లేదు. సరిపడా బస్సులు లేక గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. శుక్రవారం జూబ్లి బస్టాండ్‌లో వందలాది మంది ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షిస్తూ కనిపించారు.
తిరుపతిలో శుక్రవారం ప్రముఖ సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. ఓ వస్త్ర దుకాణం వార్షికోత్సవానికి రాగా.. ఆమెను చూసేందుకు యువత పోటీ పడ్డారు. సెల్ఫీలు దిగారు.
విశాఖ సాగర తీరంలో పెదజాలారిపేట వద్ద పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఈ చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ నేరుగా కడలిలోకి మురుగు వెళుతోంది. దీంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రతతో నిండిపోయింది.