చిత్రం చెప్పే విశేషాలు (22-10-2023/2)
వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి లావణ్య త్రిపాఠి బ్యాచులరేట్ పార్టీ జరిగింది. ఆమె స్నేహితులు నీరజ, నితిన్ సతీమణి షాలినీ, నిహారిక, రీతూవర్మ తదితరులు పాల్గొన్నారు. కాబోయే వధువుకు అభినందనలు తెలిపారు.
ఇటీవల జాతీయ అవార్డులు అందుకున్న వారి కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శక నిర్మాతలు సందడి చేశారు.
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి విశేష సమర్పణ చేసిన అనంతరం స్వర్ణరథంలో ఊరేగించారు. గరుడ సేవ తర్వాత రథోత్సవానికే అంతటి ప్రాముఖ్యత ఉంది.
మహబూబ్‌నగర్ పట్టణం షాసాబ్‌గుట్టలోని ఓ ఫొటో స్టూడియోలో బల్లి అక్కడ కనిపించిన గొల్లభామను తినడానికి దాని కాలు నోట పట్టేసింది. అప్రమత్తమైన గొల్లభామ బల్లిపై ప్రతిదాడి చేసింది.
మహబూబ్‌నగర్ జిల్లా ప్రతీకగా నిలిచే పిల్లలమర్రి ప్రాశస్త్యాన్ని తెలిపేలా పురపాలిక అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులతో పాటు బైపాస్ రోడ్డులోని బటర్‌ఫ్లై వీధిదీపాల స్తంభాలపై పిల్లలమర్రి చిహ్నాలు ఏర్పాటు చేశారు. ఆ చిత్రాలివి.
తెలంగాణలో ఆడపడుచులు ప్రత్యేకంగా జరుపుకునేది బతుకమ్మ పండుగ. ఆదివారం సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్‌కు చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్ రావి ఆకులు, రంగురంగుల గాజు ముక్కలతో వివిధ రూపాల్లో, తీరొక్క రీతిలో బతుకమ్మలను తయారు చేశారు.
సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని సిద్దిపేటకు చెందిన చిత్రకారులు తమ ప్రత్యేకతను చాటారు. చిత్రకారుడు కిన్నెర అంజయ్య.. సిద్దిపేట కోమటిచెరువు, బతుకమ్మ నిమజ్జనానికి సిద్ధంగా ఉన్న మహిళ, పరిసరాలు ప్రతిబింబించేలా చిత్రం గీశారు.
బాపట్ల కన్యకాపరమేశ్వరి ఆలయంలో కూచిపూడి నృత్యం ఏర్పాటు చేసిన సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో బాలికలు.
సద్దుల బతుకమ్మ, దసరా పండగలతో జూబ్లీ బస్టాండ్ శనివారం ప్రయాణికులతో కిటకిటలాడింది. సాధారణ రోజుల్లో 1426 సర్వీసులు నడుపుతుండగా.. ఇప్పుడు రద్దీకి అనుగుణంగా అదనంగా 517 బస్సులు నడపాలని నిర్ణయించారు.