చిత్రం చెప్పే విశేషాలు (26-10-2023/1)

గుణుపురం పట్టణంలో దేవీ నవరాత్రులు ముగిసినా సందడి తగ్గలేదు. మంగళవారం రాత్రి గ్రామదేవత పాలపోలమ్మ ఆలయంలో అమ్మవారిని మిఠాయిలతో అలంకరించారు. భక్తజనం తరలివచ్చి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అమ్మవారి ప్రసాదంగా మిఠాయిని భక్తులను పంచిపెట్టారు. 

ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. ఏటా చేతికొచ్చిన పంటలను అడవి పందులు ధ్వంసం చేస్తుండటంతో వాటి నుంచి కాపాడుకునేందుకు ఆదిలాబాద్‌ జిల్లా రైతులు పలు రకాలుగా ఆలోచనలు చేస్తూ పంట రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పిరమిడ్‌ ఆర్మూర్‌లోని సిద్దులగుట్ట మీద నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు రూ.50 లక్షలు ఖర్చు చేసినట్లు, 80 శాతం పనులు పూర్తయ్యాయి. 

శివకేశవ్‌ మందిర్‌ వద్ద ఓ ఇంట్లో కోతి చొరబడటంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వివేకానందచౌక్‌లోని మరో ఇంట్లో వంటగదిలో చేరి పది నిమిషాల పాటు హడలెత్తించింది. చివరకు శనగల డబ్బా తీసుకెళ్లింది.

పుల్లకు ఈ కాళ్లేమిటో అనుకుంటున్నారా... అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు. విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని ఓ కార్యాలయంలో బుధవారం కనిపించిన ‘గొల్లభామ’ ఇది. అచ్చం ఎండు పుల్లలా ఉన్నా...అలా అలా దగ్గరకు రావడంతో అక్కడి వారు గుర్తించి సెల్‌ కెమెరాలో క్లిక్‌మనిపించారు. 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ నియోజకవర్గానికి భాజపా అభ్యర్థిగా రాఠోడ్‌ రమేష్‌ పేరును ప్రకటించడంతో ముత్నూరు ఎంపీటీసీ సభ్యుడు ఎన్నికల ప్రచారానికి బుధవారం శ్రీకారం చుట్టారు. ఎడ్లబండికి ఇరువైపులా ప్రధాని మోదీ, రాఠోడ్‌ రమేష్‌ల చిత్రాలను ఏర్పాటుచేసి, ప్రచారం చేస్తున్నారు. 

తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఆ ప్రమాదాల్లో ఎందరో గాయపడుతున్న, మరణిస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం.. అయినా ప్రమాదకర ప్రయాణాలు మాత్రం ఆగట్లేదు. పులివెందులలో బుధవారం సరకులను తరలించే వాహనంలో సుమారు 15 మంది ప్రయాణించారు. 

రేషన్‌ బియ్యం అందించేందుకు ఉపయోగించే వాహనాలను ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. జాతీయ రహదారిపై టెక్కలి నుంచి నరసన్నపేట వైపు వెళ్లే మార్గంలో బుధవారం పోలాకి మండలం జడూరు కూడలి సమీపంలో రేషన్‌ బియ్యం అందించే బండి ప్రయాణికులతో వెళ్తూ కనిపించింది. 

అక్కడి పరిసరాలన్నీ స్వర్ణకాంతులతో మెరుస్తున్నట్లు కనిపిస్తోంది. హనుమకొండలోని పద్మాక్షమ్మ గుండంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఇలా ఒక్కచోట చేరడంతో బంగారు వర్ణంతో కనిపిస్తోంది. సిబ్బంది థర్మాకోల్‌ షీట్‌తో చేసిన పడవలో వెళ్లి గుండంలోని పూలను తొలగిస్తున్నారు. 

అనంతపురం జిల్లా బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిలో వంతెనలు, గోడలపై పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. ఈ మొక్కలను అలాగే వదిలేయటంతో అవి పెద్ద చెట్లుగా మారే ఆస్కారం ఉంది. ఇలా గోడలపై మొక్కలు పెరిగితే వంతెనలు, గోడలు పటిష్టత దెబ్బతింటాయి. 

అందంలో ఇదే తారస్థాయి

చిత్రం చెప్పే విశేషాలు (18-07-2024)

చిత్రం చెప్పే విశేషాలు (17-07-2024)

Eenadu.net Home