చిత్రం చెప్పే విశేషాలు

(29-10-2023/2)

కుమార పౌర్ణమి (పర్వదినం) పురస్కరించుకుని శనివారం రాత్రి రాహుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో పాక్షిక చంద్రగ్రహణం సమయంలో తీసిన పలు చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. 

 నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన భగవంత్‌ కేసరి చిత్ర బృందం ఒంగోలు నగరంలో సందడి చేసింది. విజయోత్సవంలో భాగంగా దర్శకుడు అనిల్‌ రావిపూడి, సినీ కథానాయిక శ్రీలీల, ఇతర నటులు కృష్ణ థియేటర్‌కి వచ్చారు. ఈ సందర్భంగా యాజమాన్యం వారికి ఘనంగా స్వాగతం పలికింది

యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం వేకువజామున ప్రాయశ్చిత్త పూజ చేసి, సంప్రోక్షణ నిర్వహించారు. ఆలయంతో పాటు మాడ వీధులను శుద్ధి చేసి నిత్యారాధనలు చేపట్టారు. 

గాజా నెత్తిన నిప్పుల వాన కురుస్తోంది. ఇజ్రాయెల్‌ భీకర దాడులతో నగరం అగ్నిగోళంలా మండుతోంది. ఉత్తర గాజా వైపు దూసుకెళ్తున్న ఇజ్రాయెల్‌ క్షిపణులు.. ఆ కారణంగా పొగ అలుముకుంది. 

ఖమ్మం నగరం వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన గృహిణి కర్నె దుర్గకు ఓ ప్రత్యేక నేస్తం ఉంది. ఆ నేస్తం ఎవరో కాదు రామచిలుక. ఆమెతో రామచిలుక కొన్ని నెలలుగా ఉంటుంది. పని మీద బయటకు వెళ్లినా.. ఆమెతో పాటు రామచిలుకను తీసుకొని వెళ్తుంది. 

హుకుంపేటలో శనివారం జరిగిన వారపు సంతకు ముద్దబంతి పూలు అధికంగా వచ్చాయి. చీమబంతి గంప రూ.30 నుంచి రూ.50 ధర పలికితే.. ముద్ద బంతి గంప రూ.50 నుంచి రూ.80 వరకు పలికింది. దీంతో గిరి రైతులు హర్షం వ్యక్తంచేశారు. 

నర్సాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి గ్రామాలు, పట్టణాల్లో ప్రచారానికి రథాన్ని సిద్ధం చేసుకున్నారు. తనకు టికెట్‌ ఖారారు కావడంతో శనివారం ప్రచార రథాన్ని బయటకు తీశారు. పార్టీ అగ్రనేతల ఫొటోలతో ప్రచార రథాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్‌ జిల్లా ధుల్కోట్‌ ఎన్నికల ప్రచారంలో శనివారం గిరిజనులతో సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నృత్యం చేశారు.

నిర్మల్‌ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులైన ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీహరిరావు, మహేశ్వర్‌రెడ్డిలకు చెందిన పార్టీల గుర్తులు ఇలా పక్కపక్కనే చాలా గ్రామాల్లో కనిపిస్తున్నాయి. నిర్మల్‌ మండలం అక్కాపూర్‌ సమీపంలో కనిపించిన చిత్రమిది.  

వేర్లు నేలలోకి నలువైపులా చొచ్చుకుపోయి.. మొక్కలు పెరగటం సర్వసాధారణం. అయితే, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట ఆర్వోబీ వంతెన పిల్లర్‌పై నేల ఆధారం లేకుండానే మర్రి మొక్క మొలకెత్తడం విశేషం. ఈ మొక్క వయసు సుమారు నాలుగున్నర సంవత్సరాలు ఉంటుంది. 

తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 50 రోజులు పూర్తయినందుకు నిరసనగా శనివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఆ పార్టీ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో 50 మీటర్ల పొడవైన నలుపు వస్త్రాన్ని ప్రదర్శించారు. 

విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతలగ్రహారంలో భారీ మర్రి వృక్షం ఊడలతో ఆకట్టుకుంటోంది. వృక్షం క్రమంగా విస్తరిస్తుండటంతో గ్రామస్థులు దాని కోసం ప్రత్యేకంగా స్థలం వదిలేశారు. ప్రతి కొమ్మ నుంచి జాలువారిన ఊడలు కనువిందు చేస్తున్నాయి. 

ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో హారన్‌ మోగిస్తూ ర్యాలీ వెనుక వస్తున్న అంబులెన్స్‌ను గమనించిన జోగు రామన్న తను నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని పక్కకు ఆపి.. ఆ అంబులెన్స్‌కు త్వరగా దారి ఇవ్వండంటూ కార్యకర్తలకు చెప్పడంతో.. వారంతా అంబులెన్స్‌కు దారి ఇచ్చారు.

చిత్రం చెప్పే విశేషాలు(05-12-2023/2)

చిత్రం చెప్పే విశేషాలు(05-12-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు.. (05-12-2023/1)

Eenadu.net Home