చిత్రం చెప్పే విశేషాలు
(30-10-2023/1)
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ట్రాక్‌పై ఉన్న రైలును వెనకనుంచి మరో రైలు ఢీకొన్న దుర్ఘటనలో మూడు బోగీలు నుజ్జయి 14 మంది దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు.
వానరం ఆహారం కోసం పరితపించి పొట్టనింపుకుంటాయి. పచ్చని చెట్లు కనిపిస్తే కొమ్మలు పట్టుకొని వేలాడుతూ గంతులు వేస్తాయి. నక్కలగుట్టలోని వరంగల్ సంతోష్‌నగర్ కాలనీకి వెళ్లే దారిలో ప్రహరిపై కోతులు సెదతీరుతూ కనిపించిన చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్ మనిపించింది.
ఎన్నికలొచ్చే సరికి వాతావరణం మారిపోతుంది. తాజాగా ఆ పార్టీ రంగులతో పాటు గుర్తులు, అధినేత చిత్రాలు ముద్రించిన దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఈ రకం టీషర్టులు దుకాణాల్లో దర్శమిస్తున్నాయి. అభ్యర్థులు, అభిమానులు కొనుగోలు చేస్తున్నారు.
తిరునగరిలో శనివారం అర్ధరాత్రి తర్వాత 1:03 గంటలకు పాక్షిక చంద్రగ్రహణం మొదలై 2:24 గంటలకు వీడింది. నగరవాసులు గ్రహణ దృశ్యాలు వీక్షించి ఆనందించారు.
కొన్ని జీవులు శత్రువుల బారి నుంచి తప్పించుకునేందుకు వాటంతటే అవి అనేక రకాలుగా శరీరాకృతితోపాటు రంగులనూ మార్చుకుంటుంటాయి. ఈ చిత్రంలో ఒక మిడత ఇదిగో ఇలా ఎండుటాకులు, కొమ్మల మధ్య కలిసిపోయింది. అంతర్ల వద్ద ‘న్యూస్‌టుడే’ ఈ చిత్రాన్ని క్లిక్‌మనిపించింది.
కాకినాడ సముద్ర తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు పలు రకాల భారీ చేపలు చిక్కాయి. వీటిలో కొమ్ముకోనెం, నెమలికోనెం, తెల్లకోనెంతో పాటు సట్టలమారి చేపలు ఉన్నాయి. ఆదివారం స్థానిక కుంభాభిషేకం రేవులో వేలం వేయగా సుమారు 300 కేజీల బరువున్న కొమ్ముకోనెం రూ.18 వేలు పలికింది.
పరిస్థితుల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని కామనదొడ్డి గ్రామం, కౌతాళం మండలం తిప్పలదొడ్డి నుంచి ఆదివారం దాదాపు 150 కుటుంబాలు తెలంగాణకు పనుల నిమిత్తం బయలుదేరి వెళ్లాయి.
సాధారణంగా కాలీఫ్లవర్ ఒక కాండంపై ఒక పువ్వు మాత్రమే వస్తుంది. కానీ ఈ కాలీఫ్లవర్ కాండానికి నాలుగు పూలు కాశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటకు చెందిన వ్యాపారి శనివారం వారపు సంతలో కాలీఫ్లవర్ గంపలు కొనుగోలు చేశారు.
కోటవురట్ల మండలంలో పొగ మంచు వర్షంలా కురిసింది. ఆదివారం వేకువజామున నుంచి ఉదయం 8.30 నిముషాల వరకు విపరీతంగా మంచు కురిసింది. ప్రధాన రహదారి సక్రమంగా కన్పించకపోవడంతో, వాహనాలను నడపడానికి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారాస నుంచి పోటీ చేస్తున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి తరఫున దుబ్బాక పట్టణంలో కార్యకర్తలు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. భారాస పార్టీ గుర్తు కారును పోలిన బెలూన్ లోపల కార్యకర్త నిలబడి ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేశారు.