చిత్రం చెప్పే విశేషాలు
(06-11-2023/1)
కోనసీమ చిత్రకళా పరిషత్తు (అమలాపురం) ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల్లో కంభానికి చెందిన ఉన్నం విజయ్‌కుమార్‌కు పురస్కారం సాధించారు. ‘నీతిమంతుడు సింహంలా రాజసం ప్రదర్శిస్తూ ధైర్యంగా ఉంటాడన్న’ భావం స్ఫురించేలా ఆయన చిత్రరాజాన్ని ఆవిష్కరించారు.
నామినేషన్లు దాఖలు చేస్తున్న అభ్యర్థులు ఇక ప్రచారంపై దృష్టిసారించనున్నారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోని పలు పార్టీల నేతల ప్రచార వాహనాలు సిద్ధమవుతున్నాయి. వివిధ పార్టీల నేతలకు చెందిన వాహనాలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంగణంలో పక్కపక్కనే నిలిపి ఉంచారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ బౌరంపేటలోని కీర్తి హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఆదివారం ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో ఓటు వినియోగంపై అవగాహన సదస్సు జరిగింది. తమ హక్కు వినియోగించుకుంటామని కమ్యూనిటీ వాసులు ప్రతిజ్ఞ చేశారు.
బీఎస్పీ గుర్తైన ఏనుగు బొమ్మలను ప్రచారం కోసం ప్రత్యేకంగా ఇలా వివిధ రకాల వాహనాల్లో అమర్చారు. ఆదివారం పెద్దపల్లి పట్టణంలో బీఎస్పీ అభ్యర్థి తరఫున ఆశీర్వాద ర్యాలీ చేపట్టగా ఈ వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి జన్మదినం పురస్కరించుకుని చిత్రకారుడు చమత్కారం చేశారు. ఆదోని మండలం నారాయణపురం గ్రామానికి చెందిన చిత్రకారుడు సీహెచ్ మల్లికార్జున బలపంపై బ్యాట్, విరాట్ కోహ్లి చిత్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
యజమాని మృతి చెందాడని తెలియని ఓ శునకం.. మార్చురీ ఎదుట అతడి కోసం నిరీక్షిస్తోంది. ఈ ఘటన కేరళలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. నాలుగు నెలలుగా యజమాని వస్తాడనే ఆశతో ఆసుపత్రి పరిసరాల్లోనే తిరుగుతోంది.
ఓవైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు కాలువల ద్వారా సాగునీరందని దుస్థితి.. వెరసి ఈ ఖరీఫ్‌లో అన్నదాతలకు సాగు కష్టాలు తప్పలేదు. మెళియాపుట్టి మండలం చిన్నసున్నాపురం వద్ద తోట నీలయ్యకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో పంట పోవడంతో ఇలా పశువులను మేతకు వదిలేశారు.
జిల్లేడు చెట్లు సాధారణంగా తక్కువ ఎత్తులో ఉంటూ గుబురుగా విస్తరిస్తాయి. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం ఊటుకూరులో కాగిత రాంబాబు ఇంటి ఆవరణలోని తెల్లజిల్లేడు చెట్టు 15 అడుగుల ఎత్తు ఎదగడంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
శ్రీవారి ఆలయం ఎదుట చిరువ్యాపారులు సుండలు, సెనక్కాయలు, మామిడికాయలు అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా తితిదే సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోక పోవడం గమనార్హం. ఇప్పటికైనా భద్రతా సిబ్బంది చిరువ్యాపారులను ఆలయం పరిసరాల నుంచి బయటకు పంపాలని భక్తులు కోరుతున్నారు.
ఇంటింటా తడి-పొడి చెత్తను సేకరించేందుకు తెప్పించిన ప్లాస్టిక్ బుట్టలను చోడవరం పంచాయతీ కార్యాలయంలో ఓ మూల పడేశారు. గ్రామాల్లో వీటిని పంపిణీ చేసేందుకని వీటిని తీసుకొచ్చారు. గదిలో భద్రపరచకుండా వీటిని ఇలా ఆవరణలో వదిలేయడంతో దొంగలపాలయ్యే ప్రమాదముంది.
చోడవరం పట్టణంలో దుర్గా విలాస్ పక్కనున్న ఇరుకు సందులోకి వెళ్లే క్రమంలో ఆదివారం గడ్డిలోడు ట్రాక్టరు ఇరుక్కుపోయింది. వెంటనే కూలీలు, రైతు గడ్డిని కిందపడేయడంతో ట్రాక్టరు ముందుకు కదిలింది. అప్పటివరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.