చిత్రం చెప్పే విశేషాలు

(11-11-2023/1)

గ్యాస్‌ సిలిండర్‌ రూ.500కే ఇస్తామంటూ కాంగ్రెస్, రూ.400లకే ఇస్తామంటూ భారాస ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించాయి. అంతేనా నేనైతే ఏడాదికి రూపాయికే నాలుగు సిలిండర్లు ఇస్తానంటున్నారు సనత్‌నగర్‌ నుంచి పోటీ చేస్తున్న ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థి కుమ్మరి వెంకటేష్‌ యాదవ్‌. 

పాకిస్థాన్‌కు చెందిన హజీ బలోచ్‌ అనే వ్యక్తి సోమవారం రాత్రి మత్స్యకారులతో కలిసి అరేబియా మహాసముద్రంలోకి వేటకి వెళ్లగా.. అరుదైన గోల్డ్‌ఫిష్‌ (సోవా)లు అతడి వలకు చిక్కాయి. శుక్రవారం కరాచీ హార్బర్‌లో వేలం వేయగా 7 కోట్ల పాకిస్థాన్‌ రూపాయలకు అమ్ముడుపోయాయి.

దిల్లీలో శుక్రవారం వర్షం కురవడంతో కాలుష్యం తగ్గింది. అందుకు సాక్ష్యమే ఈ చిత్రాలు. మొదటి చిత్రం దిల్లీ-గురుగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ నెల ఏడో తేదీన తీసింది కాగా, రెండో చిత్రం శుక్రవారం తీసింది.

హైదరాబాద్‌లోని ఓఆర్‌ఆర్‌ చెంతన అందమైన ఎకో పార్కు రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ ఎకో పార్కు తాజా చిత్రాలను ఎక్స్‌ ఖాతాలో శుక్రవారం పంచుకున్నారు.

ఏలూరు నగర సమీపంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న సంకురాత్రి ఉత్తమరావు జొన్న గింజల్లో కొన్నింటిని పెరట్లో వేశారు. అవి కాస్తా మొక్కలుగా పెరిగి.. ఏకంగా 20 అడుగుల ఎత్తుకు ఎదిగాయి. సాధారణంగా జొన్న మొక్క 6 నుంచి 8 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది.

ప్లాస్టిక్‌ను నిషేధించాలని.. కాలుష్యాన్ని తగ్గించాలని.. ఓటు వినియోగించుకోవాలంటూ దీపావళి పండుగ సందర్భంగా కరీంనగర్‌ నగర పాలక కార్యాలయంలో స్వచ్ఛ దీపావళి, గ్రీన్‌ దివాలీ, స్వీప్‌ దీపావళి కార్యక్రమాన్ని నిర్వహించారు.

అమెరికా వైమానిక దళానికి చెందిన అణ్వాయుధ సామర్థ్య బీ-21 దీర్ఘశ్రేణి స్టెల్త్‌ బాంబర్‌ ఇది. కాలిఫోర్నియాలోని పామ్‌డేల్‌లో తొలిసారిగా శుక్రవారం ఇలా గాల్లో చక్కర్లు కొట్టింది. 

 వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో చివరి రోజు నామినేషన్ల స్వీకరణ ర్యాలీలో పాల్గొనేందుకు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చారు. అందరినీ కట్టడి చేసేందుకు..పోలీసులు ద్విచక్ర వాహనాలకు ఇలా తాళ్లు కట్టి ఏర్పాట్లు చేశారు.

కుత్బుల్లాపూర్‌ భాజపా అభ్యర్థి శ్రీశైలంగౌడ్‌ నామినేషన్‌ పర్వంలో ఓ కార్యకర్త ఆయన మాస్క్‌ను ధరించి అందరిని ఆకట్టుకున్నారు.

భీమవరం పట్టణ పరిధిలో చిన్న వంతెన దిగువన చెత్త కుప్పలకు నిప్పంటుకోవడంతో పరిసర ప్రాంతాల్లో ఇలా దట్టమైన పొగ కమ్మేసింది. నిత్యం రద్దీగా ఉండే ఈ వంతెనపై రాకపోకలు సాగించేవారు అవస్థలు ఎదుర్కొన్నారు. 

విజయవాడలో సినీనటుడు కమల్‌హాసన్‌ సందడి చేశారు. శుక్రవారం ఉదయం గురునానక్‌నగర్‌ రోడ్డు కనకదుర్గ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ కాలనీ పార్కులో సూపర్‌ స్టార్‌ కృష్ణ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం గాంధీనగర్‌ ఐలాపురం కూడలిలో భారతీయుడు-2 సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు.

చిత్రంలో వరుసలో నిల్చున్నవారు సినిమా టికెట్లకో.. రాజకీయ నాయకుడి ప్రదర్శన  కోసమో వచ్చిన వారు అనుకుంటే పొరపడినట్లే. ఉస్మాన్‌గంజ్‌లోని బాణసంచా హోల్‌సేల్‌ దుకాణాల వద్ద రద్దీ ఇది. శుక్రవారం పటాసుల కొనుగోలుకు తరలివచ్చి నిలబడ్డారు. 

చిత్రం చెప్పే వార్తలు (21-10-2024)

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

Eenadu.net Home