చిత్రం చెప్పే విశేషాలు

(08-01-2024/2)

కుమ్మరుల జీవనం దుర్భరంగా మారింది. పూర్వంలా మట్టి కుండలు వినియోగం లేకపోవడంతో వారి బతుకులు తలకిందులవుతున్నాయి. వివాహాది శుభకార్యాలు, దహన సంస్కారాల సమయంలో తప్ప వారు తయారుచేసే కుండలు అమ్ముడుపోవడం లేదు. 

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడలోని ఓ ఇంటి ఆవరణలోని మందార చెట్టుకు రెండు రంగుల్లో పుష్పం వికసించింది. గ్రామంలోని భాగ్యమ్మ ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు పూసిన పుష్పాలకు రెండు రంగుల్లో రెమ్మలున్నాయి. దీనిని పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

వెల్లువ రాదనే ధైర్యం కాబోలు.. ఏకంగా తన పొలంలో వెళ్లే పులక కాలువలో కూడా ఓ రైతు వరినాట్లు వేసి అందర్ని ఆశ్చర్యానికి గురిచేశారు. బోగోలు-అల్లూరు మండలాల మధ్య ఉడ్‌హౌస్‌పేట కొత్తూరుకు ఉత్తరం కనిపించిన ఈ దృశ్యాన్ని న్యూస్‌టుడే తన కెమెరాలో బంధించింది.

భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్‌రెడ్డి శివయ్య పేరుతో దరఖాస్తు చేశారు. కుటుంబ సభ్యులుగా భార్య పార్వతీదేవి, కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడిగా నమోదు చేశారు. శివుని వయసు 1200 సంవత్సరాలుగా పేర్కొంటూ చేసిన దరఖాస్తుకు అధికారులు రసీదు ఇచ్చారు. 

చంద్రుగొండ మండలంలోని పలు గ్రామాల్లో వేసంగి వరినాట్లు సాగుతున్నాయి. ఈ ఏడాది వ్యవసాయ బోర్లు, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో సుమారు 2500 ఎకరాల్లో వరి సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. ధాన్యానికి గిరాకీ ఉండటంతో రైతులు ఈ వేసంగిలో వరి సాగుపై మక్కువ చూపుతున్నారు.

దుమ్ముగూడెం మండల పరిధిలోని ఆంధ్రకేసరినగర్‌ కాలనీలో మిషన్‌ భగీరథ పైపులైను లీకేజీల కారణంగా కొద్ది రోజులుగా తాగునీరు వృథా అవుతోంది. స్థానికంగా ఉన్న రక్షిత మంచినీటి పథకం వద్ద ఎయిర్‌వాల్వు లీకేజీ కావడంతో పాటు అక్కడక్కడ పైపులైన్లు సైతం లీకేజీలు ఏర్పడ్డాయి. 

రోలుగుంట మండలంలోని కె.కొత్తూరు ప్రాథమిక పాఠశాలలో కేవలం ఎనిమిది మంది పిల్లలుండగా, వీరికోసం అయిదేళ్ల క్రితం అదనపు భవనాన్ని నిర్మించారు. కొయ్యూరు, మాడుగుల, తదితర ప్రాంతాలకు చెందిన వారిని చేర్పించడంతో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

ప్రతి విద్యార్థి చదువులతోపాటు ఇష్టమైన క్రీడల్లో రాణించాలని జాతీయ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌ శివశ్రీధర్‌ పేర్కొన్నారు. నెల్లూరు రూరల్‌ కనుపర్తిపాడులోని ఓ స్కూల్‌లో ఆదివారం క్రీడా దినోత్సవం ఘనంగా జరిగింది. విజేతలకు బహుమతులు అందజేశారు. 

వరి నాటు కాలం కావడంతో పొలం దున్నకాలు సాగుతున్నాయి. దమ్ము చక్రాలతో భూమి దున్నుతున్నప్పుడు మట్టిలో నుంచి కీటకాలు రావడంతో వాటిని భుజించేందుకు కొంగలు పొలంలో వాలుతున్నాయి. నల్లటి మట్టిలో తెల్లటి కొంగలు గుంపులుగా చూపరులను కనువిందు చేస్తున్నాయి.

 విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలోవ విజ్ఞాన విహార్‌ ఆవాస విద్యాలయం విద్యార్థులు ఆదివారం అబ్బుర పరిచే సాహస విన్యాసాలు ప్రదర్శించి చూపరులను ఆకట్టుకున్నారు.  

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home