చిత్రం చెప్పే విశేషాలు

(10-01-2024/2)

నల్గొండ శివారులోని రాంనగర్‌ పార్కులో నల్గొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగా ఆసనాలతో ఉన్న ప్రతిమలను ఏర్పాటు చేశారు. పార్కు సందర్శన కోసం వచ్చే వారిని యోగా ముద్ర ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. చెట్టు కింద బుద్దుడి స్తూపం ఏర్పాటు చేసి.. దాని చుట్టూ ఇలా ఏర్పాటు చేశారు.

గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన జైలంగానియా అనే ఆభరణాల వ్యాపారి వెండి ఉంగరంపై అయోధ్య రామాలయ నమూనాను తీర్చిదిద్దారు. 22 రోజుల వ్యవధిలో 24 గ్రాముల వెండిని ఉపయోగించి డిజిటల్‌గా తయారుచేసిన ఈ ఉంగరం ధర మార్కెట్లో రూ.8,600 ఉంది. 

హంగరీలో బలాటన్‌ చెరువు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో చెరువులో నిలిపి ఉంచిన పడవపై మంచు ఇలా పేరుకుపోయింది.

పెద్దపల్లి పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు కట్ట నుంచి నిట్టూరు వెళ్లే మార్గంలో ఓ రైతు పొలంలో వరి నారును కాపాడుకునేందుకు ఇలా తోరణం కట్టారు. అది కాషాయ రంగులో ఉండటం, గాలికి రెపరెపలాడుతుండటంతో పక్షులు రావడం లేదు. రహదారి పక్కనే ఉండటం, ప్రత్యేక రంగులో ఉండటంతో బాటసారులను ఆకర్షిస్తోంది.

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన హృతిక్‌ రాజేంద్ర దారోడే (22) అనే కళాకారుడు అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని 1,001 మందికి ఉచితంగా పచ్చబొట్లు (టాటూలు) వేయాలని సంకల్పించుకున్నాడు. వివిధ రూపాల్లోని రాముడి చిత్రాలను చేతులు, ఛాతీ, భుజాలపై అందంగా డిజైన్‌ చేస్తున్నాడు.

పందెం కోడిని బస్సులో మరిచిపోయిన ఘటన కరీంనగర్‌-2 డిపో పరిధిలో చోటు చేసుకుంది. ఆర్టీసీ అధికారులు దానిని స్వాధీనం చేసుకొని డిపో ముందు కట్టేశారు. కోడి కోసం ఎవరూ రాకపోవడంతో దాణా పెట్టి ఎలా పోషించాలో తెలియక ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

 చంచల్‌గూడ జైలులో ఓ ఖైదీ కడుపు నొప్పితో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అతని కడుపులో మేకులు, టేపు చుట్టలు ఇతర వస్తువులు ఉన్నాయని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. 

బాచుపల్లిలోని సిల్వర్‌ ఓక్స్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థులు గీసిన అందమైన చిత్తరువులను మంగళవారం మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. విద్యార్థులు తమ ఆలోచనలకు అద్దం పడుతూ గీసిన రంగురంగుల బొమ్మలు కనువిందు చేస్తున్నారు. 

సంక్రాంతి పండగ వేళ సంప్రదాయంగా గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీ. చిన్నారులు మొదలు పెద్దల వరకు పోటీపడి ఎగరవేస్తుంటారు. వారం రోజుల నుంచి నగరంలో వివిధ ఆకృతుల పతంగుల అమ్మకాలు జోరందుకున్నాయి. నగరంలోని చార్మినార్‌ సమీప గుల్జార్‌హౌజ్‌ గాలిపటాల విక్రయానికి ప్రసిద్ధి.

ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా జువ్వలపాలెం రోడ్డులో ఉన్న పద్మావతీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం సహస్రనామ కుంకుమపూజలు చేశారు. అమ్మవారిని 108 కిలోల పసుపు కొమ్ములతో నేత్రపర్వంగా అలంకరించారు. 

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home