చిత్రం చెప్పే విశేషాలు

(17-01-2024/1)

మూడురోజులపాటు సంక్రాంతి శోభతో నగరం కళకళలాడింది. పండుగ సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన కైట్స్‌ అండ్‌ స్వీట్స్‌ ఫెస్టివల్‌ సోమవారం ముగిసింది. విదేశాల నుంచి తరలివచ్చిన కైట్‌ ఫ్లయర్లతోపాటు కళాకారులకు అవార్డులను అందజేసి సత్కరించారు. 

విశాఖ బీచ్‌రోడ్డులోని సబ్‌మెరైన్‌ ఎదురుగా పోలీస్‌ మెస్‌ వెనుక ఉన్న ఏయూ మైదానంలో మంగళవారం నుంచి మెరైన్‌ పార్క్‌ ఎగ్జిబిషన్‌ అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు రాజారెడ్డి, జంతుప్రేమికులు సురేష్‌ తెలిపారు.

కాంచీపురంలో 3 టన్నుల చెరుకుగడలతో తయారు చేసిన పీఎం ఆవాస్‌ యోజన నమూనా ఇంటి వద్దభాజపా నాయకుడు, బీఎస్‌ఎన్‌ఎల్‌ చెన్నై టెలిఫోన్స్‌ సలహా మండలి కమిటీ సభ్యుడు సెంథిల్‌కుమార్‌ మొదలియార్‌ కుటుంబీకులు పొంగలి వండారు.

ఒడిశా గంజాం జిల్లా హింజిలికాటు సమీపంలోని కొంటెయికొళి గ్రామానికి చెందిన అరుణ్‌ కుమార్‌ సాహు అనే కళాకారుడు అద్భుత కళాకృతిని తీర్చిదిద్దాడు. 5.7 అడుగల ఎత్తున, 30 ఇంచీల వెడల్పున టేకు చెక్క బల్లపై హిందీ భాషలో చెక్కిన అక్షరాలను అతికించి హనుమాన్‌ చాలీసా రూపొందించాడు.

 చిక్కబళ్లాపుర సమీపంలోని ఈషా ఫౌండేషన్‌లో ప్రతిష్ఠాపించిన 21 అడుగుల ఎతైన నంది, 54 అడుగుల పొడవైన మహాశూలాన్ని సద్గురు జగ్గీవాసుదేవ్‌ ప్రారంభించారు. ఆదియోగి విగ్రహం- నాగమండపానికి మధ్య వీటిని తీర్చిదిద్దారు. 

జిల్లాలో సంక్రాంతి పండుగ సంబురాలు మూడు రోజులపాటు ఘనంగా జరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఇళ్ల ముందు మహిళలు, యువతులు రంగవల్లలు తీర్చిదిద్దారు. తాండూరులో భోగి, సంక్రాంతి, కనుమ పంటలను ప్రతిబింబించే ముగ్గులతో పాటు, సీతారాముల ఆకారంలో వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి.  

అనకాపల్లికి చెందిన సాయిగోపాల్‌ దంపతులు.. డిసెంబర్‌ 15న తమ కుమార్తె రిషితను విశాఖపట్నంలోని మహారాణిపేటకు చెందిన దేవేంద్రనాథ్‌కు ఇచ్చి వివాహం చేశారు. సంక్రాంతి సందర్భంగా ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి 300 రకాల వంటకాలు ఏర్పాటు చేశారు.

మన్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో దట్టంగా పొగమంచు కురుస్తోంది. ఉదయం పది గంటల వరకు భానుడు కనిపించడం లేదు.ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు లైట్ల వెలుగులో రాకపోకలు సాగించారు. కొంతమంది ప్రకృతి ప్రేమికులు ఈ దృశ్యాలను చరవాణిల్లో బంధించారు. 

అయోధ్య శ్రీరాముడికి హైదరాబాద్‌లో తయారు చేసిన భారీ లడ్డూ తరలనుంది. కంటోన్మెంట్‌ పికెట్‌ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యా టరింగ్‌ సర్వీసెస్‌ యజమాని నాగభూషణంరెడ్డి, కృష్ణకుమారి దంపతులు ప్రత్యేకంగా 1,265 కిలోల భారీ లడ్డూ తయారు చేయించారు. 

సంక్రాంతి సందర్భంగా ఇంటి ముంగిళ్లలో వేసిన ముగ్గుల్లో అయోధ్య రాములోరి ప్రాణప్రతిష్ఠ ఆవిష్కరించారు. యువత ఆనందోత్సహాలతో గాలిపటాలు ఎగురవేశారు. మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకొన్నారు. జిల్లావ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

 గుడ్లవానిపాలెం ప్రాంత సముద్ర తీరానికి.. సోమవారం మృతి చెందిన పెద్ద తాబేలు కళేబరం చేరింది. సాగర జలాల్లో చాలా లోపల సంచరించే ఈ జీవులు పడవల ఇంజిన్ల చక్రాలకు తగిలి లేదా వలలో చిక్కుకున్న సందర్భాల్లో ఇలా మృత్యువాత పడే అవకాశాలు ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.

చిత్రం చెప్పే విశేషాలు(24-02-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు (24-02-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు(23-02-2024/2)

Eenadu.net Home