చిత్రం చెప్పే విశేషాలు

(18-01-2024/1)

శ్రీజగన్నాథ్‌ కారిడార్, శ్రీసేతు, ఒబడా నిర్మాణాలతో పూరీ పురుషోత్తమ సన్నిధి వైభవం సంతరించుకుంది. దీన్ని ప్రముఖ శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ తీరంలో సైకత శిల్పం ద్వారా ఆవిష్కరించారు. ఇది భక్తులందర్నీ విశేషంగా ఆకర్షిస్తోంది. 

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన ఉపాధ్యాయురాలు అనూరాధ.. రాగి ఆకుపై శ్రీరామచంద్రుడి చిత్రాన్ని మలిచి భక్తిని చాటుకున్నారు. దానిని అయోధ్యకు తపాలా ద్వారా పంపించారు. మునిపల్లి మండలం పెద్దగోపులారం పాఠశాలలో ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

మెదక్‌ జిల్లా కౌడిపల్లికి చెందిన ఆర్‌ఎంపీ రవి అట్టముక్కలతో రామమందిరం ఆకృతి చేశారు. గ్లూకోజ్‌ బాటిళ్ల ప్యాకింగ్‌తో వచ్చిన అట్టలను మందిరం నమూనాలో ముక్కలుగా కత్తిరించారు. జిగురుతో అతికించి అయోధ్య రామాలయం ఆకృతి తెచ్చారు. రెండు రోజుల్లోనే పూర్తి చేశారు.

అచ్చంగా ఆకును పోలిన మిడత ఏలూరులో కనువిందు చేసింది. ఇది పచ్చని చెట్లపై వాలి ఆకుల్లో కలిసిపోయి ఉంటూ ఇతర కీటకాలను గుటుక్కుమనిపిస్తోంది. పక్కనున్న గోడపై వాలినప్పుడు ఇలా అబ్బురపరిచింది.  

చోడవరం పట్టణంలో స్వయంభూ విఘ్నేశ్వరుడిని బుధవారం కుంకుమ పూతతో అలంకరణ చేశారు. ముక్కనుమ సందర్భంగా భక్తులు వినాయకుడిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు స్వామి దర్శనం వినూత్నంగా ఉండాలన్న భావనతో కుంకుమ అద్దినట్లు ఆలయ సహాయక అర్చకులు మహేష్‌ తెలిపారు.

విశాఖ జిల్లా రుషికొండ తీరంలో మత్స్యకారుల వలకు బుధవారం విభిన్న ఆకృతిలో ఉన్న చేపలు చిక్కాయి. కటిల్‌ ఫిష్, టేకు చేపలు లభ్యమయ్యాయి. సాధారణంగా కటిల్‌ ఫిష్‌ను జాలర్లు కోవిటి సంచులుగా పిలుస్తారు. టేకు చేపలకు పొడవాటి తోక ఉంటుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని అక్కాచెల్లెళ్ల చెరువు కింద రైతులు వరి సాగు చేశారు. సమృద్ధిగా పంటలకు నీరందడంతో ఆ ప్రాంతమంతా పచ్చని రంగేసినట్లు ఆహ్లాదకరంగా కనువిందు చేస్తున్న దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది.  

చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానంలో వివిధ రకాల పూలు కనువిందు చేస్తున్నాయి. అగ్రి టూరిజంలో భాగంగా పర్యటకులను ఆకర్షించడం కోసం చింతపల్లి శాస్త్రవేత్తలు వివిధ రకాల పూలసాగు చేపట్టారు. గ్లాడియోలస్, లిల్లియం, జర్బెరా, తులిప్, బంతి, గులాబీ, చైనాఆస్టర్‌ మొక్కలను పెంచుతున్నారు.

సంక్రాంతి సందర్భంగా కశింకోట కనకమహాలక్ష్మీవీధికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యులు దాడి నాగరాజు కుటుంబ సభ్యులంతా పండగకు హాజరయ్యారు. వృత్తి, వ్యాపారాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ముక్కనుమ రోజున బుధవారం ఒకే ఆకులో కలిసి భోజనం చేశారు. 

చార్మినార్‌ సమీపంలోని గుల్జార్‌హౌజ్‌ ఫౌంటెయిన్‌ వద్ద ఇటీవల సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు చేశారు. సందర్శకులు వెళ్లకుండా ఆటోలు నిలుపుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. 

అలవాటుగా మారిందేదీ కష్టంగా అనిపించదు

చిత్రం చెప్పే వార్తలు (21-10-2024)

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

Eenadu.net Home