చిత్రం చెప్పే విశేషాలు

(20-01-2024/1)

లోహ విహంగాల విన్యాసాలు, అరుదైన విమానాల ప్రదర్శనతో వింగ్స్‌ ఇండియా-2024 ఏవియేషన్‌ శుక్రవారం సందడిగా మారింది. భారత వాయుసేనకు చెందిన సారంగ్‌ బృందం ఆధ్వర్యంలో అయిదు హెలికాప్టర్లతో నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 

బల్కంపేట ఎల్లమ్మ శుక్రవారం బంగారు రంగులో మెరిసిపోయింది. రంగురంగుల పూలు, తులసిమాలలతో అమ్మవారి మూలవిరాట్‌ను అలంకరించారు. శుక్రవారం కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

 మైదాన ప్రాంతాలు మన్యాన్ని తలపిస్తున్నాయి. భీమునిపట్నం - నర్సీపట్నం (బీఎన్‌) రహదారిపై శుక్రవారం పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం 8 గంటల వరకు వాహన చోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వచ్చింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండల కేంద్రానికి చెందిన యువ స్వర్ణకారుడు కపిలవాయి గోపిచారి 21 రోజులు శ్రమించి 2.730 మిల్లీగ్రాముల బంగారంతో అయోధ్య రామాలయాన్ని తయారు చేశారు. 1.5 సెంటీమీటర్ల ఎత్తు, 1.75 సెంటీమీటర్ల వెడల్పుతో స్తంభాలు, 3 అంతస్తులుగా రూపొందించాడు.

అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఓవైపు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతుండగా.. అత్యవసర సమయాల్లో వైద్యసేవలు అందించేందుకు విపత్తుల చిరు ఆస్పత్రి ‘భీష్మ్‌’ను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. 

గతంలో ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’ ర్యాంకుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఆదర్శంగా నిలిచింది పాల్వంచ పురపాలిక. పట్టణంలో రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన స్వచ్ఛ వాహనాలను మూలకు పడేస్తున్న వైనంపై పురవాసులు పెదవి విరుస్తున్నారు.

బ్రహ్మపురకు చెందిన దిలీప్‌ కుమార్‌ మహరణా కలపపై 14 ఇంచీల ఎత్తు, 11 ఇంచీల వెడల్పు శ్రీరామ, లక్ష్మణ, సీత సమేత హనుమాన్‌ రూపాలను చెక్కాడు. మరో కళాకారుడు సత్యనారాయణ మహరణా రాయి, కలప, సుద్ద ముక్కలతో అయోధ్య రామ మందిరం సూక్ష్మ నమూనా, శ్రీరాముడి ఆకృతుల్ని తీర్చిదిద్దాడు.

ఉద్యాననగరి.. బెంగళూరును రోజీ ట్రంపెట్గా వ్యవహరించే టాబ్యుయా రోసియా చెట్ల పూలు ముంచెత్తుతున్నాయి. ఈ చలికాల సందర్శనకు బెంగళూరు చేరుకునే పర్యాటకులకు ఇదొక అపూర్వ ఆస్వాదన. రోజీ ట్రంపెట్‌ పూల చెట్లు విప్పారిన వీధుల్లో నడిచే వారికి మధురానుభూతి సొంతమవుతుంది. 

ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్‌ తప్పనిసరి. దీంతో చిన్నా, పెద్ద తేడా లేకుండా దేవరకొండలో ఆధార్‌సెంటర్‌ వద్ద బారులు తీరుతున్నారు. దేవరకొండ తపాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్‌ సెంటర్‌ వద్దకు తెల్లవారుజాము నుంచే శుక్రవారం బారులు తీరారు.

గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన ప్రో కబడ్డీ సీజన్‌-10లో సినీనటుడు బాలకృష్ణ సందడి చేశారు. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. 

చిత్రం చెప్పే విశేషాలు(25-02-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు(24-02-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు (24-02-2024/1)

Eenadu.net Home