చిత్రం చెప్పే విశేషాలు

(22-01-2024/1)

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌కు చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్‌ అశ్వత్థ, రావి, బాదం, మర్రి ఆకులపై రామమందిరం, శ్రీరాముడి వివిధ దివ్యమంగళ స్వరూపాలను చూపరులు అబ్బురపడేలా మలచి ప్రదర్శించారు.

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో విశాఖ నగరానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్‌కుమార్‌ చిరుధాన్యాలతో రామ మందిరం, శ్రీరామచంద్రుడి చిత్రాన్ని తీర్చిదిద్దారు. వారం రోజుల పాటు శ్రమించి సహజత్వం ఉట్టిపడేలా కళాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. 

పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన పుట్టంరాజు రమేష్‌ మారుతీ కుమార్‌శర్మ ఫోంబోర్డుతో రూపొందించిన అయోధ్య రామమందిరం నమూనా విశేషంగా ఆకట్టుకుంటోంది. దీని తయారీకి వారం రోజుల సమయం పట్టిందని, శ్రీరాముడిపై ఉన్న భక్తితో ఈ నమూనా తయారు చేసినట్లు శర్మ వివరించారు. 

అయోధ్యలోని రామ మందిరానికి బంగారుపూత కలశాన్ని అందించినట్లు చెన్నైకి చెందిన స్మార్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అల్లావుద్దీన్‌ అనే కళాకారుడు 45 రోజులపాటు కష్టపడి దీన్ని తయారుచేశారని సంస్థ పేర్కొంది. 13.5 అడుగుల ఎత్తు ఉండే ఈ కలశం 120 కిలోల బరువుందని వివరించింది.

రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వరంగల్‌ నగరం కరీమాబాద్‌లోని కివి పాఠశాల విద్యార్థులు రంగవల్ల్లులతో అయోధ్య రాముడిపై భక్తిని చాటుకున్నారు. ప్రిన్సిపల్‌ దాసి సతీష్‌మూర్తి, వైస్‌ ప్రిన్సిపల్‌ ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్‌ రజని వారిని అభినందించారు. 

అయోధ్యలో సోమవారం బాలరాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన ఓలేటి వీనస్‌బాబు అరిటాకుపై రూపాలు చిత్రీకరించి భక్తి చాటుకున్నారు. రెండు గంటలపాటు శ్రమించి బాలరాముడి రూపం, సూర్యుడు, గరుడ్మంతుడు, హనుమంతుడి చిత్రాలను గీశారు. 

అయోధ్యలో శ్రీరాముని ఆలయ కుంభాభిషేకాన్ని పురస్కరించుకుని కోవై కునియమత్తూరుకు చెందిన స్వర్ణకారుడు రాజా.. బూంది, కేసరి, ఇతర ప్రసాదాలతో రాముడి బొమ్మ తయారు చేశారు. ఇందుకోసం 24 గంటలు వెచ్చించినట్లు ఆయన వెల్లడించారు.

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వరంగల్‌ నగరానికి చెందిన స్వర్ణకారుడు పెందోట వేణు రామ మందిరం, రాముడి రూపాన్ని తన గోరుతో గీసి భక్తిని చాటుకున్నారు. దళసరి డ్రాయింగ్‌ షీట్‌పై అయోధ్య రాముడి సుందర రూపం, మందిరాన్ని గోరుతో ఆకర్షణీయంగా గీశారు.

 అయోధ్య రామమందిరం బాలరామ ప్రతిష్ఠాపన సంబరాల నేపథ్యంలో బెంగళూరు విశ్వవిద్యాలయ విద్యార్థిని రోష్నిజ్ఞానదేవ్‌ ముగ్గుపిండితో రామాయణం చిత్రాన్ని రచించి శ్రీరాముడికి తన భక్తిని ఇలా చాటుకుంది. ఇరవై ఏళ్ల రోష్ని నాలుగు రోజుల పాటు శ్రమించి నేలపై సంపూర్ణ రామాయణాన్ని రచించింది.

 అయోధ్య రామమందిరం వేడుకల సందర్భంగా కార్వార కుముటాలోని కొంకణ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌కు చెందిన సరస్వతి విద్యాకేంద్రానికి చెందిన మూడు వందల విద్యార్థులు స్వయంగా వారే సమవస్త్రాలతో సంస్కృత భాషలో జై శ్రీరామ అని, కోదండరాముడి విల్లుగా పాల్గొన్నారు.

చిత్రం చెప్పే విశేషాలు(25-02-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు(24-02-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు (24-02-2024/1)

Eenadu.net Home