చిత్రం చెప్పే విశేషాలు

(24-01-2024/1)

కంప్లికోటె శివారులోని ఉద్భవ గణపతి ఆలయం వద్ద రైతు రేణుకప్పకు చెందిన అరటి తోటలో రెండు అరటి గెలలు దాదాపు అయిదు అడుగుల ఎత్తు పెరిగి ఒకటి 40, మరొకటి 50 కిలోల బరువు ఉన్నాయి. సాధారణంగా చక్కెర రకం అరటి గెలలు రెండు నుంచి రెండున్నర అడుగుల ఎత్తు ఉండి 16 - 25 కిలోల బరువు ఉంటాయి.

ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నా..  కొందరు ప్రాణాలు పణంగా పెట్టి ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌ వద్ద ఓ ట్రక్కులో మహిళలు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారిలా..

 మైసూరు జిల్లా పరిధిలోని హెగ్గడదేవనకోట తాలూకా దమ్మనకట్టి సమీపంలో ఓ వన్యజీవిని వేటాడిన పులి ఆరగిస్తోంది. మంగళవారం ఈ దృశ్యాన్ని నాగరహొళె అభయారణ్యంలో సాహస పర్యాటకులు చూసి హడలిపోయారు.

మిరప కోతలకు వివిధ రాష్ట్రాల నుంచి వలస కూలీలు తల్లాడ మండలానికి అధిక సంఖ్యలో వచ్చారు. చంటి పిల్లలతో సహా వచ్చి పంటపొలాల్లోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఓ తల్లి తన బిడ్డను వీపునకు వస్త్రంతో కట్టుకుని నిత్యావసరాల కొనుగోలుకు వెళుతుండగా ‘న్యూస్‌టుడే’ మంగళవారం క్లిక్‌మనిపించింది.  

నూతనకల్‌ మండలం చిల్పకుంట్ల గ్రామ శివారులో కొంతమంది బాలురు కలిసి పెట్టుకున్న సైక్లింగ్‌ పోటీ ఇది. కొన్ని నీళ్లసీసాలను మట్టితో నింపి మూడడుగుల దూరానికి ఒకటి చొప్పున యూ ఆకారంలో నిలబెట్టారు. సైకిల్‌ తొక్కుతూ ముందు చక్రం ఒక బాటిల్‌కు తగలకుండా ఒకవైపు నుంచి వెళ్లాలి. 

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో ఓ వానరం విద్యార్థులతో కరచాలనం చేస్తూ సందడి చేసింది. వారితో కలిసి భోజనం చేసి, ఆటలాడింది. పక్కనే నిలిపి ఉన్న లారీ అద్దంలో తన అందాన్ని చూసుకొని మురిసిపోయింది. 

ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన కడమంచి శ్రీనివాస్‌ మంగళవారం సమీప మానేరు వాగులో చేపల వేటకు వెళ్లాడు. ఇతని వలకు డెవిల్‌ ఫిష్‌ (దెయ్యం చేప) చిక్కింది. ఇలాంటి చేప గ్రామంలో ఇప్పటి వరకు చూడకపోవడంతో స్థానికులు ఆసక్తిగా చూశారు. 

వానరాలు సారంగాపూర్‌ మండల కేంద్రంలోని మిషన్‌ భగీరథ ఎయిర్‌వాల్వ్‌ వద్ద జాలువారుతున్న నీటి చుక్కలను నోటిలో వేసుకోవడానికి విశ్వప్రయత్నం చేశాయి. చివరకు వాల్వ్‌ పైన ఉన్న పాలిథిన్‌ కవర్‌ను తొలగించి అందులో నుంచి పడుతున్న నీటి చుక్కలను తాగి దాహం తీర్చుకున్నాయి.

భారీ పైపులను నెత్తిన ఉంచుకొని ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఈ వ్యక్తుల ప్రయత్నం వీరికే కాకుండా ఈ మార్గంలో వెళ్లే ఇతరులకూ ప్రమాదకరమే. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై కనిపించిందీ దృశ్యం.

కుక్కల దాడిలో చనిపోయిన కోడిని కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయం ద్వారానికి కట్టి వినూత్న నిరసన తెలిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శునకాల బారి నుంచి కాపాడాలంటూ గతంలో అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని బాధితుడు అజీజోద్దీన్‌ తెలిపారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు

Eenadu.net Home