చిత్రం చెప్పే విశేషాలు

(25-01-2024/1)

 అయోధ్య శ్రీరామ మందిరాన్ని ఉంగరంగా తయారు చేయించి ధరించారు.. చిత్తూరు నగరానికి చెందిన బంగారు వ్యాపారి మల్లి ఆచారి. 44 గ్రాముల బరువుతో 20 రోజుల కిందట ఆయన ముంబయిలో ఆర్డర్‌ ఇచ్చారు. శ్రీరామ మందిరం ప్రారంభమైన తర్వాత ఉంగరాన్ని చేతికి ధరించారు. 

ఇల్లెందు పట్టణ శివారులోని చెరువుకట్ట సమీపంలో మిషన్‌ భగీరథ పైపులైను పగిలి పెద్దఎత్తున నీరు వృథా అయ్యింది. సుమారు 14 మీటర్ల ఎత్తు నీరు ఎగిసిపడింది. స్థానికులు ఆసక్తిగా తిలకించారు. మిషన్‌ భగీరథ అధికారులు మరమ్మతులు చేపట్టారు.

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ప్రాజెక్టునగర్‌ సమీపంలోని తాటివనంలోని గీత కార్మికులు బొంగు కల్లును విక్రయిస్తున్నారు. తాటి చెట్లకు కట్టే లొట్టి స్థానంలో వీటిని పెడుతున్నారు. సాధారణ కల్లు కంటే దీనికి మంచి గిరాకీ ఉంటోందని గీత కార్మికులు చెబుతున్నారు.

గోల్కొండ ఖిల్లాపై ఆత్యాధునిక హంగులతో సౌండ్‌ అండ్‌ లైట్‌ షో బుధవారం సాయంత్రం ప్రారంభమైంది. లేజర్‌ షో వెలుగుల్లో కోట చరిత్రను సందర్శకులు తిలకించారు.

బిహార్‌.. ఔరంగాబాద్‌ జిల్లా హస్‌పురా గ్రామానికి చెందిన అనీస్‌ కేసరి, ఆరా ప్రాంతానికి చెందిన సిమ్రన్‌ కేసరి ఇటీవలే వివాహం చేసుకున్నారు. పెళ్లి మంటపంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వధూవరులతో పాటు పెళ్లికి హాజరైన వారితో కలిపి 70 మంది రక్తదానం చేశారు. 

ప్రముఖ శిల్పి రామ్‌ సుతార్‌ (99) నొయిడాలోని తన స్టూడియోలో మూడు నెలల సమయం కేటాయించి 3,500 కిలోల బరువు, 20 అడుగుల పొడవు గల జటాయువు శిల్పాన్ని 85 శాతం రాగి, 5 శాతం తగరం (టిన్‌), 5 శాతం తుత్తునాగం (జింకు), 5 శాతం సీసం (లెడ్‌) మిశ్రమంతో రూపొందించామన్నారు. 

రెండు.. నాలుగు కాదు ఏకంగా 104 చక్రాల వాహనం పిట్లం మండలం 161వ జాతీయ రహదారి మీదుగా చిన్నకొడప్‌గల్‌ సమీపంలో వెళ్లడం చూసి గ్రామస్థులుఆశ్చర్యానికి గురయ్యారు. ఎలక్ట్రికల్‌ గ్రిడ్‌కు సంబంధించిన పరికరాన్ని హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌కు ఈ వాహనంలో తరలిస్తున్నారు. 

మధ్యంతర కేంద్ర బడ్జెట్‌-2024 తయారీ ప్రక్రియ చివరి దశను సూచిస్తూ, సంప్రదాయ ‘హల్వా వేడుక’ను బుధవారం సాయంత్రం దిల్లీ నార్త్‌ బ్లాక్‌లోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్, ఉన్నతాధికార్లు పాల్గొన్నారు.  

మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో.. మండలంలోని తాటిపల్లి, వీర్దండి, గుండాయిపేట, మొగడ్‌ధగడ్, గుడ్లబోరి, విజయనగరం గ్రామాల్లో కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంట తడిసి ముద్దయింది. మిర్చి తడిస్తే రంగు మారి గిట్టుబాటు ధర రాదని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని మిర్చి రైతులు కోరుతున్నారు. 

పనికిరాని ఇనుప వ్యర్థాలతో అద్భుత శిల్పాలను రూపొందిస్తున్న.. విజయవాడకు చెందిన కళాకారుడు శ్రీనివాస్‌ పడకండ్లకు దిల్లీలో ఈనెల 26న జరిగే గణతంత్ర దినోత్సవాలకు ప్రత్యేక ఆహ్వానం అందింది. శ్రీనివాస్‌ రూపొందించిన కళాకృతుల గురించి ప్రధాని మోదీ.. తన మన్‌కీబాత్‌ కార్యక్రమంలో ప్రశంసించారు. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home