చిత్రం చెప్పే విశేషాలు
(27-01-2024/1)
చింతపల్లి మండలంలోని చెరువులవెనంలో శుక్రవారం మంచు అందాలు మైమరిపించాయి. వాతావరణం మబ్బులమయమవడంతో ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. చింతపల్లిలో శుక్రవారం ఉదయం 16.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచు, చలి ప్రభావం కొన్ని చోట్ల తగ్గింది.
వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో కుల వృత్తిదారులు పేదోడి ఫ్రిజ్ అయిన కుండలను తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. చందంపేట మండల పరిధిలో ముడుదండ్ల, చందంపేట, తెల్‌దేవరపల్లి, మూర్పునూతల, తిమ్మాపురం తదితర గ్రామాలలో కుండల తయారీ ముమ్మరమైంది.
ప్రముఖ పుణ్య క్షేత్రం అన్నవరం దేవస్థానం రత్నగిరిపైకి భక్తుల రాకపోకలకు 90 ఏళ్ల క్రితం వినియోగించిన బస్సు ఇది. కాలంచెల్లి.. ఇప్పుడైతే లేదు. కానీ 1934 నాటి ఆ బస్సు ఫొటో లభ్యంగా ఉంది. అప్పట్లో ఈ ఒక్క బస్సే నడిపేవారని దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు.
పీఏపల్లి మండలం ఏఎమ్మార్ ప్రాజెక్టులో భాగమైన అక్కంపల్లి జలాశయంలో మోడు వారిన ఓ పెద్ద వృక్షం పర్యాటకులను అబ్బురపరుస్తోంది. జలాశయం ఏర్పాటుకు ముందు వ్యవసాయ పొలంలో పచ్చగా ఉన్న ఈ పెద్ద వేపచెట్టు జలాశయంలోకి నీరు రావడంతో ఎండిపోయి చుట్టూ కృష్ణాజలాలతో ఇలా సుందరంగా కనిపిస్తోంది..
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం జిన్నెలగూడెంగ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో.. మరో మార్గం లేక ఆ ఆదివాసీలు డోలీ కట్టి నిండు గర్భిణిని నాలుగు కి.మీ. భుజాలపై మోసుకెళ్లారు. అక్కడి నుంచి వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
భీమవరం కలెక్టరేట్ వద్ద జరిగిన గణతంత్ర వేడుకల్లో ఓ గొర్రె, శునకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాడేరు వద్ద కొండ ప్రాంతాల్లో కనిపించే ఈ జాతి గొర్రెలు ఎంత ఎత్తయినా సులువుగా ఎక్కగలవని దాని యజమాని వెల్లడించారు. టిబెటిన్ మాస్టిఫ్ జాతికి చెందిన శునకం కూడా అందరినీ ఆకర్షించింది.
వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం పంచాయతీ సీతంపేట వద్ద ఓ మామిడి తోటలో చెట్టుతో పోటీ పడుతూ పెరుగుతున్న ఓ పుట్ట చూపరులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం 16 అడుగుల ఎత్తులో ఉండటంతో అటుగా వెళ్లే వారు ఆసక్తిగా చూస్తున్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఎగుర వేసిన అనంతరం కలెక్టర్ హరిచందన దాసరి, జిల్లా ఎస్పీ చందనా దీప్తి పలు స్టాళ్లు, సంప్రదాయ పరికరాలను, అడవిలో దొరికే ఆహార ధాన్యాలను పరిశీలించారు. ఇద్దరూ కలిసి రాట్నం తిప్పారు.
కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ నుంచి ఆనంద్ థియేటర్ వెళ్లే మార్గంలో కేసీ కాలువ కింద రహదారిపై మురుగు పెద్దఎత్తున ప్రవహిస్తోంది. ఫలితంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజుల కిందట నగరపాలక అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది
నల్గొండ పట్టణం ఎస్‌ఎల్‌బీసీలోని డాన్‌బాస్కో ఎడ్యుకేషనల్ అకాడమీలో శుక్రవారం స్పోర్ట్స్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా పరుగు పందెంలో పాల్గొని..విజయంపై కన్నేసిన చిన్నారుల చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ కెమెరాలో బంధించింది.
రిపబ్లిక్ డే సందర్భంగా పూరీ తీరంలో సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తీర్చిదిద్దిన సైకత శిల్పం ఆకట్టుకుంది.
వాహనదారుల్లో మార్పు, అవగాహన కోసం పట్టణానికి చెందిన ఎస్‌బీఐ విశ్రాంత ఉద్యోగి ఆంజనేయులు తన ద్విచక్రవాహనం చుట్టూ ట్రాఫిక్ నిబంధనలు రాయించారు. కొంతమందిలో అయినా మార్పు వస్తుందనే ఉద్దేశంతో ఇలా నిబంధనలు రాయించానని ‘న్యూస్‌టుడే’తో తెలిపారు.