చిత్రం చెప్పే విశేషాలు

(29-01-2024/1)

కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్‌ స్కూల్‌ మైదానంలో నిత్యం టైర్లు మోస్తూ.. లాగుతూ.. సాధన చేస్తున్న ఈ బాలిక పేరు మైథిలి. 9వ తరగతి చదువుతోంది. అండర్‌ 16 జాతీయ క్రీడల్లో 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనేందుకు ఇలా సన్నద్ధమవుతోంది.

నల్గొండ శివారులోని ఎం.దుప్పలపల్లి గ్రామంలో వృథాగా ఉన్న స్థలాన్ని చదును చేసుకొని ఆకుకూరలు పండించి జీవనోపాధి పొందుతున్నాడు దివ్యాంగుడైన శేఖర్‌. గ్రామంలో వృథాగా ఉన్న స్థలంలో మడులు ఏర్పాటు చేసి ఆకుకూరల సాగుకు సిద్ధం చేసుకున్నాడు. 

సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌కు ఎంతో చరిత్ర ఉంది. దీనికి ఏర్పాటు చేసిన గడియారం కొన్ని నెలలుగా పని చేయడం లేదు. ఎప్పుడు చూసిన 12 గంటలుగానే చూపెడుతోంది. దీన్ని బాగు చేసే సమయం ఎప్పుడొస్తుందోనని ఆ మార్గంలో రాకపోకలు సాగించేవారు అంటున్నారు. 

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని రామకృష్టాపూర్‌ గ్రామం యడ్లకుంటచెరువులో కొంగల కోలాహలమిది. చేపల కోసం అవి చెరువు వద్దకు వచ్చాయి. పొలాల పచ్చదనం పక్కన ఉన్న చెరువులో వేలాది తెల్లని కొంగలు ఎగురుతుంటే అటుగా వెళ్లేవారు ఆసక్తిగా గమనించారు.   

భద్రాచలం పట్టణానికి చెందిన గుడిమడుగుల రమణ మణుగూరు అటవీ శాఖ అధికారి కారు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రకాశవనం రైల్వేగేటు దగ్గర ఒక కోతి ఉంటుంది. ఆయన ఖాళీ సమయంలో కోతి వద్దకు వెళ్లి తినుబండారాలు ఇస్తుంటాడు. ఆయన కారురాగానే వేగంగా కారు మీదకు వస్తుంది. 

వాతావరణంలో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓ రోజు ఎండ, మరో రోజు చలితీవ్రత, మరుసటి రోజు మేఘావృతం పరిస్థితులు నెలకొంటున్నాయి. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల వారు కారం పొడి పట్టించేందుకు అనువుగా మిరపకాయలు ఎండబెట్టేందుకు ఇంటి పైకప్పు రేకులపై ఆరబెడుతున్నారు.

కరీంనగర్‌-జగిత్యాల జాతీయ రహదారిలోని గంగాధర మండలం కురిక్యాల వరదకాలువ వంతెన సమీపంలో ఓ మామిడి చెట్టు కొమ్మలు, ఆకులు కనిపించకుండా విరగబూసింది. వాహనదారులు మామిడి చెట్టు పూతను ఆసక్తిగా చూస్తున్నారు. పూత నిలిస్తే పెద్ద మొత్తంలో కాయలు కాస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మాధవనగర్‌ రైల్వే గేటు మూసివేయడంతో డిచ్‌పల్లి నుంచి నిజామాబాద్‌ వెళ్లే వాహనదారులు అనేక మంది సమీపంలోని రైల్వే అండర్‌ బ్రిడ్జి కింది నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ ఉండే ఊటతో వంతెన కింద నీటిమట్టం అడుగు ఎత్తు పెరిగింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 

 హనుమకొండలోని నక్కలగుట్టలో కొత్తగా ఏర్పాటు చేసిన రెస్టారెంటుకు వెళితే అచ్చం అడవిలో కూర్చుని తిన్న అనుభూతే కలుగుతుంది. ఓరుగల్లులో ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు అనేక అంశాల్లో రెస్టారెంట్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా అడవిని తలపించేలా మరొకటి నగర వాసులను ఆకట్టుకుంటోంది. 

 హైదరాబాద్‌ నగరంలోని ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన లైట్‌ అండ్‌ సౌండ్‌ లేజర్‌ షో సోమవారం నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానుంది. 1917 నుంచి ఇప్పటి వరకు వందేళ్ల కళాశాల చరిత్రను సాంకేతిక సహకారంతో అద్భుతంగా ఆవిష్కరించనున్నారు.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్‌ అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. జింకలు, పురివిప్పి నర్తించే నెమళ్లతో పాటు ఇతర దేశాల నుంచి వలస వచ్చే అరుదైన పక్షులు, కొండలు, గుట్టల మీద పచ్చని చెట్లతో నిండిన అటవీ ప్రాంతం పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. 

చిత్రం చెప్పే విశేషాలు(24-02-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు (24-02-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు(23-02-2024/2)

Eenadu.net Home