చిత్రం చెప్పే విశేషాలు

(31-01-2024/2)

తిరుమల శ్రీవారిని సినీ నటుడు ధనుష్‌ ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. పండితులు, అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతోపాటు వేదాశీర్వచనం చేశారు.  

రంగురంగుల పంట చేలను పరిశీలనగా చూస్తే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. సిద్దిపేట జిల్లా మిట్టపల్లి శివారులో రహదారి పక్కన పసుపు రంగులో కళకళలాడుతున్న పొద్దుతిరుగుడు పంట.. దాని పక్కనే ఆకుపచ్చని వర్ణంలో వరి పైరు.. రెండూ కలగలిసి చూపరులను కనువిందు చేస్తున్నాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని వలిసాబు గుట్ట చుట్టూ పంట భూములన్నీ పచ్చని చీర కట్టినట్టుగా.. ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. పచ్చదనంతో కళకళలాడుతున్న వరి పొలాల మధ్యలో వలిసాబు గుట్టతో పాటు, భానుడి ప్రతిబింబం ఆవిష్కృతమై ఆకట్టుకుంటోంది.

గొలుసు మాదిరిగా మంచు బిందువులు ఒదిగి ముత్యాల హారాన్ని తలపిస్తున్న ఈ చిత్రం నూతనకల్‌లో మంగళవారం ఆవిష్కృతమైంది. రెండు మొక్కలను కలుపుతూ సాలీడు అల్లిన గూడు చెదిరిపోగా.. ఉదయం కురిసిన మంచు బిందువులు అందులో ఇలా నిలిచిపోయి హారంలా చూపరులకు కనువిందు చేశాయి. 

నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే రాయదుర్గంలోని టీ వర్క్స్‌ ప్రాంగణంలో  కొలువుతీరిన కళాకృతులివి. పిల్లి నుంచి పులి వరకు వివిధ ఆకృతులను ఇనుముతో రూపొందించి ఏర్పాటు చేయడంతో సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

మామిడి చెట్లన్నీ పూలతో అలంకరించినట్లు ఉంది కదూ.. ఈ ఏడాది పూసిన మామిడి పూత ఇది. హైదరాబాద్‌ శివార్లలో దాదాపుగా తోటలు, చెట్లన్నీ ఇలాగే ఉన్నాయి. ఆకులు కనిపించనంతగా పూతతో నిండిపోయాయి. శంషాబాద్‌ ప్రాంతంలోనిదీ దృశ్యం.

 జోగులాంబ గద్వాల జిల్లా రాజోలికి చెందిన రైతులు తిమ్మరాజు, మద్దిలేటి(లుంగీ కట్టుకున్న వ్యక్తులు) ఒక్కొక్కరు మూడు ఎకరాల్లో ఉల్లి పంట సాగుచేశారు.ఇరువురు ఓ వాహనాన్ని అద్దెకు తీసుకుని, ఊరూరు తిరిగి అమ్ముతూ నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ గ్రామీణ మండలం అల్లీపూర్‌లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయం ఇది. 40 ఇళ్లను నిర్మించిన గత ప్రభుత్వం ఉండడానికి కావలసిన పూర్తి వసతులు ఏర్పాటు చేయకుండానే గత ఏడాది సెప్టెంబరులో హడావుడిగా ప్రారంభించింది. ఇప్పటికీ లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు.

హరిత తెలంగాణ లక్ష్యసాధనకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. మిడ్జిల్‌ మండలంలోని రాణిపేట, అయ్యవారిపల్లి, గంగాపూర్‌ గ్రామాల్లో హరితహారం మొక్కలు నీరందక ఎండిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షలు వ్యయం చేసి నాటిన మొక్కలకు తరుచూ రైతులు నిప్పు పెడుతుండటంతో కాలిపోతున్నాయి. 

అల్లాదుర్గం మండలంలోని నడిమితండా వద్ద మంగళవారం మిషన్‌ భగీరథ ప్రధాన పైపు మార్గం పగిలి నీరంతా వృథాగా పోతోంది. పైపులకు మరమ్మతులు చేయించాల్సిన అధికారులు జేసీబీ ద్వారా కాలువ తీసి పంట పొలాల్లోకి నీరు వెళ్లకుండా చేశారు. 

ఏమిటీ ‘నీట్‌’ వివాదం?

చిత్రం చెప్పే విశేషాలు (19-06-2024)

యమ్మీ.. యమ్మీ.. ఛీజ్‌ కేక్‌

Eenadu.net Home