చిత్రం చెప్పే విశేషాలు

(07-02-2024/1)

ఇదేంటి.. ఎక్కడో ఏకంగా వీధి రోడ్డుకు టైల్స్‌ వేశారని అనుకుంటున్నారు కదూ..! సికింద్రాబాద్‌ వారాసిగూడ ప్రాంతంలో కొత్తగా వేసిన సీసీరోడ్డు క్యూరింగ్‌ కోసం వీధి మొత్తం గోనె సంచులను పరిచిన చిత్రమిది.  

తెలంగాణ భవన్‌కు మంగళవారం వచ్చిన భారాస అధినేత కేసీఆర్‌కు కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత వందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. చిత్రంలో జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తదితరులు ఉన్నారు.

ముల్లంగి సాధారణంగా తెలుపు రంగులోనే ఉంటుంది. ఈ మధ్య నెల్లూరు మార్కెట్‌లో ఎర్రగా ఉన్న ముల్లంగి దుంపకాయలు కనిపిస్తున్నాయి. ఇవి ఎదిగే సమయంలో వేర్లకు రాళ్లు అడ్డుగా ఉంటే ఇతర రంగులోకి మారతాయని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు.

చౌటుప్పల్‌లో 18వ వార్డులో ఓ కాకి దాహం తీర్చుకునేందుకు పడుతున్న యాతనకు ఈ చిత్రాలు నిదర్శనం. ఇంటి పైపులోంచి కింద పడుతున్న సన్నటి నీటి ధారను ఎక్కడ్నుంచో గమనించి ఎగిరొచ్చి వాలి.. తల వంచి నీటిని తాగేందుకు ప్రయత్నించింది.  

ధర్మపురి మండలం నేరెల్లకు చెందిన ఓ మహిళా రైతు తన భూమిలో కంది పంటను వేసింది. పప్పుగా మార్చే ప్రక్రియలో భాగంగా దాంట్లోని చెత్తను తొలగించేందుకు ఇంటి ఆరు బయట తూర్పార పడుతోంది. గాలి లేకపోవడంతో ఇలా కూలర్‌ను వినియోగించుకుంటోంది. 

నల్గొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. రహదారి నిర్మాణంలో అడ్డుగా ఉన్న భారీ వృక్షాలను నరికి వేయకుండా.. వేళ్లతో పెకిలించి మరొక చోట నాటే పద్ధతిని అవలంబించారు. నాటిన వృక్షాల్లో ఒక్కటీ చిగురించలేదు. పార్కులో నాటిన అన్ని చెట్లూ ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. 

వెల్దుర్తి మండలంలోని మంగళపర్తి పెద్ద చెరువు పరిసరాల్లో పచ్చని పొలాల్లో తాటిచెట్లు తలకోనను తలపిస్తున్నాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం వేళల్లో ఇక్కడి దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. పచ్చని వరి పొలాల మధ్య తాటిచెట్లు, పక్షుల కిలకిలరావాలు మధురానుభూతిని కలిగిస్తున్నాయి.

హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ నియంత్రణపై అవగాహన కల్పించేలా మద్రాసు వర్సిటీ క్రీడా మైదానంలో ఎతిరాజ్‌ కళాశాల రెడ్‌ రిబ్బన్‌ క్లబ్, తమిళనాడు ఎయిడ్స్‌ నియంత్రణ సంఘం, చెన్నై వైఆర్‌జీ సంయుక్తంగా 3,500 మందితో రెడ్‌ రిబ్బన్, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ అనే ఆంగ్ల అక్షరాల ఆకారంలో నిలబడ్డారు.

మల్యాల మండలం నూకపల్లి శివారులోని ఆదర్శ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు సరైన బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మూడు బస్సులు నడిచేవి. ప్రస్తుతం ఒకే బస్సు నడవడంతో దాదాపు 150 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

మండల కేంద్రం నుంచి కొండూర్‌ వెళ్లే దారిలో ఓ చెట్టు ఆకులు పూర్తిగా రాలిపోయి మోడుగా మారింది. అయినా ఆకాశాన్ని అందుకుంటున్నట్లు కనువిందు చేస్తూ అటుగా వెళ్లే చూపరులను ఆకట్టుకుంటుంది. ‘న్యూస్‌టుడే’ తన కెమెరాలో ఆ చిత్రాన్ని బందించింది. 

నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో డాక్టరు రాసిన పరీక్షలు చేయించాలంటే ఆసుపత్రి గేటు వద్ద ఉన్న ల్యాబ్‌కు తీసుకురావాల్సిందే. ఎండను తట్టుకోలేక రోగి ఇలా ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని వెళుతున్న దృశ్యాన్ని ‘ఈనాడు’ క్లిక్‌ మనిపించింది.

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home