చిత్రం చెప్పే విశేషాలు
(07-02-2024/2)
సెంట్రల్ చైనాలోని హుబే ప్రావిన్స్‌లోని వుహాన్‌లో మంచు తుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను కారణంగా ఇళ్లు, రహదారులు మంచు పేరుకుపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తుపాను కారణంగా కుంభవృష్టి కురిసింది. అదే సమయంలో కొన్ని ప్రదేశాలను హిమపాతం ముంచెత్తింది. బలమైన గాలులకు తోడు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘భారత రంగస్థల మహోత్సవ్’ మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా మహిళా సమస్యలపై ప్రదర్శించిన నాటకం ఆకట్టుకుంది.
కరీంనగర్ నగరబొడ్డున్న ఉన్న టవర్‌సర్కిల్ వ్యాపార, వాణిజ్య కేంద్రానికి కేంద్ర బిందువుగా ఉంటుంది. టవర్‌సర్కిల్‌కు ఉన్న గడియారాలను పరిశీలిస్తే మాత్రం సమయం తప్పుగా ఉంటుంది. నాలుగు వైపులా ఉన్న గడియారాలు పని చేయడంలేదు.
ఎల్లిగడ్డ(వెల్లుల్లి) ధర రోజురోజుకూ పెరుగుతోంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని వారపు అంగడిలో మంగళవారం కిలో ఎల్లిగడ్డల ధర రూ.400 పలికింది. దీంతో రేటు ఇంతగా పెరిగిందా? అని విస్తుపోతూ కిలో కొనుగోలు చేద్దామని వచ్చిన వారు పావుకిలో మాత్రమే తీసుకుంటున్నారు.
ఆరోగ్యానికి వ్యాయామం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఇదే బాటలో నడుస్తున్నారు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని శ్రీవైకుంఠపురం వేద పాఠశాల విద్యార్థులు. వేదం నేర్చుకునేందుకు ఈ పాఠశాలలో చేరిన వారికోసం ప్రత్యేకంగా బహిరంగ వ్యాయామశాలను నెలకొల్పారు.
తన కుమార్తె వివాహానికి హాజరైన అతిథులకు శిరస్త్రాణాలను బహుమతిగా పంపిణీ చేసి ఆశ్చర్యపరిచాడో తండ్రి. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నగరంలో ముదాపర్ ప్రాంతానికి చెందిన సెడ్ యాదవ్ కుమార్తె నీలిమ వివాహం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా అతిథులకు యాదవ్ హెల్మెట్లు పంపిణీ చేశారు.
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన యతి జెఠ్వా అనే ఆరేళ్ల బాలుడు 80 కిలోల బరువును సులభంగా ఎత్తుతూ వెయిట్ లిఫ్టింగులో ఔరా అనిపిస్తున్నాడు. ఒకటో తరగతి చదువుతున్న యతి ఇప్పటికే వెయిట్ లిఫ్టింగులో 17కు పైగా పతకాలు సాధించాడు.
కోడేరు మండల కేంద్రంలో ఓ రైతు ఇంటి ఆవరణలో కంది చెట్టు భారీగా పెరిగింది. కోడేరుకు చెందిన రైతు కృష్ణయ్య తన పొలంలో పండిన కందులను మిద్దెపై ఆరబోశారు. అందులో ఒక విత్తనం ఇంటి ఆవరణలోని మట్టిలో పడి మొలకెత్తి 18 అడుగులు పెరిగింది. ప్రస్తుతం పూత దశలో ఉంది.