చిత్రం చెప్పే విశేషాలు
(12-02-2024/1)
వాసవి కన్యకాపరమేశ్వరీ దేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆదివారం నగరంలోని కొత్తవూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాతకు వజ్రాల చీరతో అలంకరించి అభిషేకాలు నిర్వహించి హోమ పారాయణం గావించారు.
విశాఖ తీరాన కోస్టల్ బ్యాటరీ ప్రాంతంలో రాళ్లపై పరచుకొన్న పచ్చని అందాలు ప్రకృతి ప్రేమికుల్ని ఆకట్టుకుంటున్నాయి. సముద్రం మధ్యలో దీవి ఉన్నట్లుగా కనిపిస్తున్న ఈ ప్రాంతం సందర్శకుల్ని కళ్లార్పకుండా చేస్తోంది. చూసినవారంతా దగ్గరకెళ్లి ప్రకృతి అందాల మధ్య ఫొటోలకు ఫోజిస్తున్నారు.
మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఆదివారం జరిగిన ఫ్యాషన్ షోలో సినీ తారలు శ్రుతిహాసన్, శ్రియా, మంచులక్ష్మి, సుదీర్‌బాబు, సందీప్‌కిషన్, ప్రదీప్‌మాచిరాజు, తదితరులు సందడి చేశారు. రూపదర్శినులతో పాటు ర్యాంప్‌వాక్ చేసి వీక్షకులను కట్టిపడేశారు.
ద్విచక్ర వాహన చోదకుడు తలకు బొమ్మ టోపీ పెట్టుకున్నాడనుకుంటే పొరపడినట్లే. అది శిరస్త్రాణమే మరి! ఏన్కూరు మండలం టీఎల్‌పేట ఇందిరా నగర్ కాలనీకి చెందిన తంబళ్ల ఉదయ్ వినూత్నంగా ధరించిన శిరస్త్రాణాన్ని ఆదివారం ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.
అప్పుడే ఎండలు మొదలయ్యాయి. ఆదివారం నగరంలో పెద్ద సంఖ్యలో వివాహాలు, ఇతర శుభకార్యాలు ఉండటంతో వేల మంది వేడికి అవస్థలు పడుతూ ప్రయాణాలు సాగించారు. మధ్యాహ్నం సచివాలయం ముందున్న రహదారిలో కనిపించిన ఎండమావుల చిత్రమిది.
తూప్రాన్‌లో భవ్యశ్రీ విద్యార్థిని కుక్కర్, ప్లాస్టిక్ పైప్, డబ్బాను వినియోగించి పరికరాన్ని తయారు చేసింది. కుక్కర్‌లో ప్లాస్టిక్ వస్తువులను వేసి వేడి చేయడంతో ప్లాస్టిక్ కరిగి పైపుద్వారా ఆవిరిగా డబ్బాలోకి వస్తుంది. సాంద్రీకరణ జరిగి ద్రవరూపంలో పెట్రోలియంగా బయటికి వస్తుంది.
మెదక్ అర్బన్ జిల్లా స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన క్రికెట్ పోటీలకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాసేపు సరదాగా బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
సాధారణంగా అరటి గెలకు 100-200 కాయలు కాస్తుంటాయి. కానీ నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ గారపాటి మాధవరావు ఇంట్లో చెట్లకు అరటికాయలు విరగకాశాయి. అందులో ఒక చెట్టులోని గెలకు 400, మరో చెట్టుకు 300 అరటి కాయలు కాశాయి.
భారతీయ తీరగస్తీ దళం(ఐసీజీ) వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా ఆదివారం ఐసీజీ విశాఖ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో ‘డే ఎట్ సీ’ వేడుకలు నిర్వహించారు. కోస్టు గార్డు నౌకలు, ఇంటర్ సెప్టర్ బోట్లు, డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్‌లతో చేసిన విన్యాసాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఉపాధి హామీ పథకంలో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో ప్రధాన రహదారి వెంట మొక్కల సంరక్షణ పనులు జరుగుతున్నాయి. పని చేసే వారిలో మొత్తం వృద్ధులే ఉండటం విశేషం. ఉపాధి కూలీలంతా వ్యవసాయ పనులు చేస్తుండగా చిత్రాలను ‘న్యూస్‌టుడే’ క్లిక్ మనిపించింది.