చిత్రం చెప్పే విశేషాలు
(15-02-2024/1)
వసంత పంచమి సందర్భంగా సరస్వతీ దేవీ పూజలు రాష్ట్రమంతటా భక్తిశ్రద్ధలతో జరిగాయి. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో సరస్వతి సైకత శిల్పం తీర్చిదిద్దగా స్థానికులను, పర్యటకులను ఆకట్టుకుంది.
ఉప్పల్‌లోని చెంగిచెర్లలోని ఓ భవనంపై విమానం ఆగినట్టు ఉంది కదూ..నిజంగా విమానం కాదు..నీటి ట్యాంకును ఇలా అందంగా యజమాని తయారు చేయించుకున్నారు.
ప్రస్తుతం మామిడి చెట్లు పూతదశలో ఉన్నాయి. చెట్టంతా బాగా పూత పూయడం సాధారణమే.. కానీ అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం సమీపంలో.. ఊట్లపల్లి-జమ్మిగూడెం రహదారి పక్కనున్న మామిడితోటలోని ఓ చెట్టు సగభాగం విరగ పూసి, మిగతా భాగం ఎలాంటి పూత లేకుండా పచ్చని ఆకులతో కనిపించింది.
పుల్వామా దాడిలో అమరులైన వీరసైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ జిల్లాకేంద్రం ఆర్మూర్ రోడ్డులో శరత్ అనే యువకుడు బుధవారం తన దుకాణం ఎదుట అమరవీరుల చిత్రాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయించి ముందర పూలతో ప్రేమ గుర్తును తయారు చేసి దేశభక్తిని చాటాలంటూ సందేశం ఇచ్చారు.
వేసవి కాలం ప్రారంభంలోనే నిమ్మకాయల ధరలు మండిపోతున్నాయి. ఎడపల్లి వారసంతలో ఒక్క నిమ్మకాయ రూ.10కి విక్రయించారు. వినియోగదారులు వీటి ధర చూసి అవాక్కయ్యారు. ధరలు ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాకకు చెందిన కొమనేని రఘు ఇంటిలో అరుదైన పెర్షియన్ కార్పెట్ కాక్టస్ పుష్పం వికసించింది. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న దీన్ని శాస్త్రీయ నామం ఎడిత్‌కోలియా గ్రాండిస్ అని, ఈ ఏడాది రెండు పూలు పూసినట్లు ఆయన పేర్కొన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలో పండే మామిడికి రాష్ట్రంలో ప్రత్యేక ఆదరణ ఉంది. గాలి, వానల నుంచి కాయలను కాపాడుకోవచ్చని, పండ్ల రంగు, రుచి, నాణ్యత కూడా బాగుంటుందని రైతులు చెబుతున్నారు. పెద్దకొత్తపల్లి మండలం అమ్మపల్లికు చెందిన రైతు రమేశ్ తోటలో తీసిన చిత్రమిది.
వసంత పంచమిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు పుస్తకం, అక్షరాల ఆకారంలో ప్రదర్శన నిర్వహించారు. సరస్వతిదేవికి పూజలు నిర్వహించారు.
కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని కాలువలకు తరలించడానికి గేట్లు ఏర్పాటు చేసి చిన్న గోడ కట్టి విడదీశారు. ఆ గోడ మీద నిలబడిన ఓ వ్యక్తి దారానికి కొక్కెం ఏర్పాటు చేసి పిండి ముద్దను ఎరగా వేసి చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఆ చిత్రాన్ని ‘ఈనాడు’ క్లిక్‌మనిపించింది.
తిరుపతి గ్రామీణ మండలం పాతకాల్వ పేరూరు బండపై కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి మాతృమూర్తి వకుళమాత కొలువైన ఆలయం ప్రాంగణంలోని రావిచెట్టు ఆకట్టుకుంటోంది. బండరాళ్లను చీల్చుకుంటూ పెరుగుతున్న చెట్టును ఆలయానికి వచ్చే శ్రీవారి భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
గుంటూరు నగరంలో తాగు నీటి కలుషితం కారణంగా జీజీహెచ్‌లో చేరిన రోగులతో పోస్ట్ ఆపరేటివ్, శస్త్రచికిత్సా విభాగాల్లో రోగులు కిక్కిరిసిపోవడంతో వరండాలో పడకలు వేశారు. విద్యుత్తు బోర్డులకు సెలైన్ బాటిళ్లు తగిలించి ఇలా చికిత్స అందిస్తున్నారు.