చిత్రం చెప్పే విశేషాలు

(15-02-2024/2)

అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని తీవ్ర మంచు తుపాను తాకింది. దీంతో చాలా చోట్ల భారీగా హిమపాతం నమోదైంది. కొన్ని పట్టణాల్లో దాదాపు అడుగు మందాన మంచు కురిసింది. పాఠశాలలు మూతపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. న్యూయార్క్‌లో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

యూఏఈ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ అబుధాబీ నగర సమీపంలో నిర్మించిన హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున భారత పౌరులు తరలివచ్చారు. 27 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆలయం గల్ఫ్‌ ప్రాంతంలో కెల్లా అతిపెద్దది.

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాకు చెందిన యువ పెన్సిల్‌ కళాకారుడు జీవన్‌ జాదవ్‌ అయోధ్యలోని బాలరాముడి విగ్రహాన్ని పెన్సిలు కొనపై అద్భుతంగా చెక్కాడు. మైక్రోస్కోపు సాయంతో 1.5 సెంటీమీటర్ల పరిమాణంలో దీన్ని రూపొందించాడు.

మేడారం మహాజాతర పూజల తొలిఘట్టం బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయింది. జాతరకు సరిగ్గా వారం ముందు నిర్వహించే మండమెలిగే పండగను మేడారంలోని సమ్మక్క దేవత, కన్నెపల్లిలోని సారలమ్మ తల్లి పూజారులు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచీ వేలమంది భక్తులు తరలివచ్చారు. 

 కన్నడ పోరాట నాయకుడు వాటాళ్‌ నాగరాజ్‌ బుధవారం ఇక్కడ ప్రేమికుల దినోత్సవాన్ని విభిన్నంగా ఆచరించారు. పాత మైసూరు బ్యాంకు కూడలిలో రెండు గాడిదలకు వివాహం చేయించారు. ఉద్యానవనాలు, ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్న ప్రేమికులను బెదిరించే వారిని బంధించేందుకు పలు చోట్ల పోలీసులు నిఘా పెట్టారు. 

నందిగామలోని కన్హాశాంతి వనానికి నిత్యం వేలాది మంది దేశం నలుమూలల నుంచి వస్తుంటారు. ఇక్కడి క్యాంటీన్‌లో సందర్శకుల కోసం మహిళలు ఇలా జొన్నరొట్టెలు చేస్తూ కనిపించారు. ఆరోగ్యపరంగానూ మంచిది కావడంతో చాలామంది వీటిని తినడానికి ఇష్టపడుతుంటారని అక్కడి వారు చెప్పారు. 

హైదరాబాద్‌ నగర శివారులోని అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ప్రాంగణంలో చిన్నపాటి గుట్టను అలంకారప్రాయంగా తొలగించకుండా వదిలేశారు. అటువైపు మాత్రం రాళ్లను తొలగించి భవనాలు నిర్మించి కాంక్రీట్‌ జంగిల్‌గా మార్చేశారు. 

పలు ప్రాంతాల్లో వసంత పంచమి వేడుకలను బుధవారం నిర్వహించారు. చిన్నారులే కాకుండా ప్రజాప్రతినిధులు అమ్మవారి కటాక్షం పొందేందుకు ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.

మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఓ చెట్టుకింద సొర విత్తనం వేసి వదిలేశారు. సొరతీగ చెట్టంతా వ్యాపించి కొమ్మల్లో కాయలు కాసాయి. ఈ చెట్టు ఎక్కడం కుదరకపోవడంతో ఎవరూ కోయలేదు. దీంతో చెట్టంతా సొరకాయలు వేలాడుతున్న ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది.

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home