చిత్రం చెప్పే విశేషాలు
(16-02-2024/1)
తిరుమలలో రథసప్తమి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శ్రీవారికి సూర్యప్రభ వాహనసేవ, చిన్నశేష వాహనం నిర్వహించారు. రాత్రి వరకు వాహనసేవలు కొనసాగనున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్‌లోని నాగోలు వద్ద మూసీలో పెరిగిన భారీ మర్రి వృక్షాన్ని ఎవరో మొదలు కాల్చేశారు. కొన్ని ఊడలు అలాగే ఉండిపోగా.. అవి తిరిగి మొలిచి ఇలా నీడనిస్తున్నాయి.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల పంచాయతీ పరిధి కోమండ్లపల్లి గ్రామ సమీపంలో ఓ రైతు పొలంలో మామిడి చెట్టు ఆకులు రెండు రంగుల్లో ఉండటం దారి వెంట వెళ్లే వారిని ఆకట్టుకుంటోంది. జన్యుపరమైన లోపాలతో ఇలా చెట్టు ఆకులు వివిధ రంగుల్లో కనిపిస్తాయని ఉద్యాన శాఖలు తెలిపారు.
దిల్‌సుఖ్‌నగర్‌లో నడక వంతెన నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యింది. దీన్ని అందుబాటులోకి తీసుకురాకపోవడంతో పాదచారులు ప్రమాదకరంగా రోడ్డు దాటాల్సి వస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
వైరా, న్యూస్‌టుడే: వేసవి నేపథ్యంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్న దానికి ఈ చిత్రమే నిదర్శనం. ఓ పంపు నుంచి వస్తున్న నీటిధారతో నోటిని తడుపుకొనేందుకు శునకం పడుతున్న అవస్థ ఇది. వైరాలో గురువారం కనిపించిన చిత్రమిది.
పక్షుల నుంచి పంటను కాపాడుకోవడానికి ఓ రైతు ఏకంగా కంకికో ప్లాస్టిక్ కవరు కట్టి పంటను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చోడ మండలం హీరాపూర్ వెళ్లే మార్గంలో దాబా(బి) గ్రామానికి చెందిన రైతు బోస్లె వైజోబా ఎకరం విస్తీర్ణంలో వేసిన జొన్న పంటకు ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తున్నాయి.
రోజంతా ఆకలి పోరాటం చేస్తూ కనిపించే కొంగలు, ఆకులు రాలిన చెట్టు కొమ్మలపై వాలి సేద తీరుతున్న దృశ్యం అటువైపు పంటపొలాలకు వెళ్లే రైతులను ఆకట్టుకుంది. మున్యాల్ గ్రామ శివారులో పంట పొలాల్లో కనిపించిన ఈ చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ తన కార్యాలయం ఎదుట ‘ఇది నూతన భారత్’ పేరుతో చిత్రాలు ఏర్పాటు చేయించారు. మోదీ అధికార పగ్గాలు చేపట్టాక గ్రామాల్లో విద్యుత్తు లభ్యత 12 గంటల నుంచి 21 గంటలకు పెరిగిందనే విధంగా మోదీ చిత్రపటాన్ని రూపొందించారు.
వేసవి రాకముందే కల్లూరు పట్టణం 36వ వార్డు పరిధి పెద్దపాడులో తాగునీటి సమస్య ప్రారంభమైంది. వారం రోజులైనా నీరు సరిగా సరఫరా కాకపోవడంతో జనం అల్లాడుతున్నారు. అరకొరగా వచ్చే నీటి ట్యాంకర్ల వద్ద పట్టుకుంటున్నారు. పలువురు పనులన్నీ వదులుకుని బిందెడు నీటి కోసం ఎదురుచూస్తున్నారు.
స్థానిక రాంభగీచా పాదరక్షల కేంద్రం కౌంటర్‌లో పాదరక్షలకు తాళంవేసిన దృశ్యం ఇది. ఓ భక్తుడు శ్రీవారి దర్శనానికి వెళ్లే క్రమంలో పాదరక్షల కేంద్రంలో వాటికి తాళం వేయడం చూసి ఆశ్చర్యపోవడం ఇతరుల వంతైంది.
ఈ చిత్రం పట్టణం నుంచి తుమ్మలపెంట గ్రామానికి వెళ్లే దారిలో రియల్ వ్యాపారుల అక్రమాలకు నిదర్శనం. సాగునీటిని తరలించే కాలువను ఇలా ఆక్రమించి లేఅవుట్లు వేస్తున్నారు. ఈ విషయమై రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా అధికారులకు పట్టడం లేదు.