చిత్రం చెప్పే విశేషాలు
(17-02-2024/1)
ఒడిశా రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) బృందం రాక నేపథ్యంలో పూరీకి చెందిన ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ భువనేశ్వర్ విమానాశ్రయం ఆవరణలో ఓటరు చైతన్యం దిశగా సైకత శిల్పం శుక్రవారం తీర్చిదిద్దారు. సీఈసీ రాజీవ్ కుమార్ తిలకించి శిల్పిని అభినందించారు.
కామారెడ్డి జిల్లా మహ్మద్‌నగర్ మండలం హాసన్‌పల్లి గ్రామానికి చెందిన బెస్త లక్ష్మణ్ రోజు మాదిరిగానే శుక్రవారం నిజాంసాగర్ జలాశయంలో చేపలు వేటకు వెళ్లాడు. వలకు ఎప్పటిలా ఓ మోస్తరు బరువున్న చేపలు పడతాయనుకుంటే ఏకంగా 21 కిలోల భారీ బొచ్చ రకం చేప చిక్కింది.
సాధారణంగా బైక్‌పై వెళ్తుంటే చిన్న పిల్లలకు నిద్రపట్టేస్తుంది. ఇలాంటి సమయంలో పెద్దలే అప్రమత్తంగా ఉండాలి. రిజర్వుబ్యాంక్ రోడ్డులో ఓ తండ్రి బాబును ఇలా పెట్రోలు ట్యాంకుపై పడుకోపెట్టుకొని తీసుకెళ్తూ కనిపించాడు.
జంగారెడ్డిగూడెంలోని అటవీ శాఖ కార్యాలయం ఆవరణలోని చెట్లపై వేలాడుతున్న గబ్బిలాలు కాయలను తలపిస్తున్నాయి. ఈ మార్గంలో వెళ్లే వారు వాటిని ఆసక్తిగా చూస్తున్నారు.
గగనం నుదుటిపై సింధూర తిలకాన్ని వీక్షించి ప్రశాంత గోదారి గలగలమంటూ ఉత్సాహ పరవళ్లు తొక్కింది. చారిత్రక నగరి కొత్త కాంతులతో వెలిగింది. రథసప్తమి వేళ అరుణవర్ణంతో సప్తాశ్వరథామారూఢుడు చెక్కిన ప్రకృతి చిత్రాన్ని చూసి ప్రతి మనసు పులకించింది.
చింతపల్లిలో శీతల వాతావరణం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఎం.సురేష్‌కుమార్ తెలిపారు. చలి తీవ్రత ఐదు రోజుల నుంచి బాగా పెరిగింది.
ప్రముఖ పర్యాటక ప్రాంతం సోమశిలలోని రెండు గుట్టల నడుమ నిండుగా నీటితో పరవళ్లు తొక్కుతూ కళకళలాడే కృష్ణానదిలో తాజా పరిస్థితి ఇది. పుష్కరఘాట్ నుంచి కిలోమీటరు దూరానికి నీరు చేరింది. వచ్చే నెలలో మహాశివరాత్రికి లలితాంబిక సోమేశ్వరాలయానికి వచ్చే భక్తులకు నదీ స్నానం కష్టంగా మారనుంది.
మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు అన్నారం మీదుగా సూర్యాపేట వెళ్లేందుకు శుక్రవారం బస్టాండ్ నుంచి బయలుదేరింది. కండక్టర్ ఎక్కకుండానే డ్రైవర్.. బస్సును స్టార్ట్ చేసుకొని వెళ్లాడు. కండక్టర్ లబోదిబోమంటూ ఓ ద్విచక్రవాహన దారుడి సాయంతో బస్సు వెనుక పరుగులు తీశాడు.
మార్కెట్లో నాణ్యమైన వెల్లుల్లి కిలో ధర రూ.500 పలుకుతుండటంతో ఈ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్ ప్రాంతంలోని అయిదారు గ్రామాల పొలాల్లో కొన్ని వెల్లుల్లి చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో రైతులు సీసీ కెమెరాలు అమర్చుకొన్నారు.
రథసప్తమి సందర్బంగా శుక్రవారం ఉదయం సిద్దిపేట కోమటి చెరువు నెక్లెస్ రోడ్డులో పలువురు సూర్య నమస్కారాలతో సూర్యుడికి ప్రణతి సమర్పించారు. వ్యాసమహర్షి యోగా సొసైటీ, జిల్లా యోగాసన స్పోర్ట్స్ అకాడమీ సంయుక్తాధ్వర్యంలో కార్యక్రమం సాగింది.