చిత్రం చెప్పే విశేషాలు

(18-02-2024/1)

చెన్నై నందంబాక్కం ట్రేడ్‌సెంటర్‌లో జరిగిన కామిక్‌ కాన్‌ కార్యక్రమంలో చిన్నారులు పాల్గొని సందడి చేశారు. కామిక్స్‌ వేషధారణలతో ఉన్న వారితో చిన్నారులు ఫొటోలు దిగారు. 

కొల్లాపూర్‌, పెంట్లవెల్లి మండలాల్లోని కృష్ణాతీరం.. అక్కడ నువ్వుల పంటతో కనువిందు చేస్తోంది. నదిలో నీరు అడుగంటి, సారవంతమైన నల్లరేగడి నేలలు పైకి తేలగా రైతులు అక్కడ నువ్వుల పంట సాగు చేస్తున్నారు. నీటి అవసరం ఎక్కువగా ఉండదు. నేలలోని చెమ్మ, ఉదయం కురిసే మంచుతోనే పంట పండుతుంది. 

జడ్చర్ల మండలం గంగాపురంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి జాతరలో యువకులు ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ఓ రాతి స్తూపాన్ని ఇలా పైకెత్తి నేలపై నిలపడానికి ప్రయత్నిస్తూ కనిపించారు. రెండు క్వింటాళ్లకు పైగా బరువుండే ఈ స్తూపాన్ని నేలపై నిలబెడితే కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. 

నవీపేట మండలం ఎల్‌కేఫారం గ్రామంలోని ఓ పొలం వద్ద శనివారం బార్న్‌ గుడ్లగూబ ప్రత్యక్షమైంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ పక్షిని గుర్తించి చరవాణిలో చిత్రీకరించారు. బిహార్‌ రాష్ట్రంలో బార్న్‌ గుడ్లగూబ సంచరిస్తుందని, మన రాష్ట్రంలో చాలా అరుదుగా కనిపిస్తుందని చెప్పారు. 

హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ పద్మవ్యూహం నుంచి బయటపడాలంటే ఓపిక ఉండాల్సిందే. కానీ కొందరు గమ్యానికి త్వరగా వెళ్లాలనే ఆతృతతో ఇలా పాదబాటపై నుంచి వెళ్తున్నారు. నెక్లెస్‌ రోడ్డు ఇందిరాగాంధీ విగ్రహం సర్కిల్‌ నుంచి ఖైరతాబాద్‌ పైవంతెన వద్ద కనిపించిన దృశ్యమిది. 

హైదరాబాద్‌ నగర సుందరీకరణలో భాగంగా జూబ్లిహిల్స్‌ రోడ్‌ నం.70లో పాలపిట్ట బొమ్మను ఏర్పాటు చేశారు. దీని రంగుపోయి, తోక భాగంలో విరిగిపోయి కళావిహీనంగా మారింది. 

మామిడి చెట్లన్నీ పూతతో నిండిపోయాయి. చేనేత చీమలు.. చెట్ల మీద లేత ఆకులకు దగ్గరగా గూడు నిర్మించుకోవడం వీటి ప్రత్యేకత. మామిడి చెట్లపై చేరే కీటకాలను వేటాడి తమ పిల్ల చీమలకు ఆహారంగా పెడతాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట్లోని మామిడి తోటలోనిదీ చిత్రం.

ముల్లంగి దుంప మహా అయితే పావు కిలో వరకూ ఊరుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట వారపు సంతలో మాత్రం 2 కిలోల ముల్లంగి కనిపించింది. క్యారెట్‌ పరిమాణంలో ఉండాల్సినది కాస్తా.. ఆనపకాయ కంటే పెద్దగా ఉండటంతో స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు. 

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home