చిత్రం చెప్పే విశేషాలు

(21-02-2024/1)

అనంతపురం గ్రామీణం ఎ.నారాయణపురం పంచాయతీ విద్యారణ్యనగర్‌ వరలక్ష్మి గృహంలో అరుదైన సీతాకోకచిలుక కనిపించింది. ఇరువైపులా వెండి రంగు రెక్కలతో, మధ్య భాగంలో పసుపుపచ్చగా ఉండి దానిపై నల్ల, తెల్ల చుక్కలతో అందంగా ఉంది. దానిని రైతులు డేగ అని పిలుస్తారు. 

సాధారణంగా జాతీయ రహదారికి ఇరువైపులా స్టీలు బారికేడ్‌లు కనిపిస్తుంటాయి. రాష్ట్రంలో మొదటిసారిగా హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ 44వ నంబరు జాతీయ రహదారిపై ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని సదాశివనగర్‌ నుంచి పెర్కిట్‌ వరకు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో ప్రయోగాత్మకంగా వెదురు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

 హైదరాబాద్‌ పోలీసులు ఎక్స్‌లో చేసిన పోస్టు వైరల్‌ అవుతోంది. హెల్మెట్‌ లేకుండా, చరవాణిలో మాట్లాడుతూ బైక్‌ నడుపుతున్న వ్యక్తి ఫొటోను పోస్టు చేసి ‘మీది మొత్తం రూ.వెయ్యి అయ్యింది. యూజర్‌ ఛార్జెస్‌ ఎక్స్‌ట్రా’ అంటూ కామెంట్‌ పెట్టడంతో పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మెదక్‌ పట్టణంలో మంగళవారం ఓ వ్యక్తి ఒక ప్యాసింజర్‌ ఆటోపై ప్రమాదకరంగా నిల్చుని ముందున్న మరో ఆటోను కాలుతో నెడుతుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఏ మాత్రం పట్టు తప్పినా ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే అవుతుందని చర్చించుకున్నారు. 

చింతూరు అటవీ డివిజన్‌ లక్కవరం రేంజ్‌ అటవీ ప్రాంతం హోలి పుష్పాలతో కొత్త అందాలను సంతరించుకుంది. హోలి రోజున ఈ పువ్వులతో ఎర్రటి రంగును తయారు చేసి గ్రామస్థులు, విద్యార్థులు, యువతీ యువకులు ఒకరిపై ఒకరు జల్లుకుంటూ కేరింతలు కొడుతూ ఆనందంగా గడుపుతారు. 

మిలాన్‌-2024లో భాగంగా విశాఖలో మంగళవారం 60 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో నమూనా విన్యాసాలు నిర్వహించారు. మిగ్‌-29కే, పీ8ఐ, తేజస్‌ యుద్ధ విమానాలు, చేతక్‌ హెలికాప్టర్లు ప్రదర్శనతో అలరించాయి. ఆర్కే బీచ్‌ రోడ్డులో వివిధ దేశాల నౌకా దళ బృందాలు తమ జాతీయ పతాకాలతో ప్రదర్శన నిర్వహించాయి. 

ఆంగ్లేయుల పాలనలోనూ తెలుగు భాషకు పట్టం కట్టారని నాటి నాణేలను చూస్తే తెలుస్తుంది. అప్పట్లో ఆంగ్లం అధికార భాషగా ఉండేది. అప్పటి నాణేలపై ‘ఒక అణా, రెండు అణాలు’ అని ఆంగ్లంతో పాటు హిందీ, ఉర్దూ, బెంగాలీ, తెలుగు నాలుగు భాషల్లోనే ముద్రించేవారు. 

జమ్మలమడుగు నుంచి పొన్నతోటకు వెళ్లే దారిలో గూడెంచెరువు గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం పాఠశాలల నుంచి ఇళ్లకు వెళుతున్న బడిపిల్లల ఆటోలో వెళ్తున్న దుస్థితి ఇది. పరిమితికి మించి విద్యార్థులను ఆటోచోదకులు ఎక్కించుకోవడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు.

వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ నోరూరించే మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఆకులు కనిపించనంతగా వచ్చిన పూత చూపరుల మనసును దోచుకుంటోంది. తోటలు, రైతుల పంట పొలాల గట్లపైన ఉన్న మామిడి చెట్లు పూతతో ఆకట్టుకుంటున్నాయి. గజగట్లపల్లిలో కనిపించిన ఈ చెట్టు కనువిందు చేస్తోంది.

దాదాపు 2వేల సిటీబస్సులను మేడారం జాతరకు తరలించడంతో నగరంలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అప్పుడప్పుడు వచ్చిన ఒకటీ అర..బస్సుల్లో పోటీలుపడీ ఎక్కారు. బస్టాపులన్నీ వందలాది ప్రయాణికులతో కిక్కిరిసిపోయి జాతరను తలపించాయి.

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home