చిత్రం చెప్పే విశేషాలు

(24-02-2024/1)

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోలాహలంగా జరిగింది. జాతరలో మూడోరోజు దేవతలంతా గద్దెలపై కొలువు దీరడంతో భక్త కోటి దర్శనాలకు బారులు తీరారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకున్నారు. 

 తెలుగుదేశం, జనసేన పార్టీ ల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మన్యంకొండలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. రథోత్సవానికి మన్యంకొండ ముస్తాబవుతోంది. కొండ కింద కనువిందు చేస్తున్న పచ్చని పొలాల పక్కన రోడ్డుకు ఇరువైపులా దుకాణ సముదాయాలు వెలిశాయి.

వేసవి సమీపించినా మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. చింతపల్లిలో శుక్రవారం 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్‌ అధికారి తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత ఉంటోంది. మంచు కొన్నిచోట్ల దట్టంగా అలుముకుంటోంది.

వేసవికి ముందే పగటి ఎండలు మండుతున్నాయి. వేకువజామున మాత్రం చల్లని గాలులు వీస్తుండగా అప్పుడప్పుడు మంచు పడుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సున్నపురాయి, సిమెంటు పరిశ్రమలు, నల్లరేగడి భూములున్న మేళ్లచెరువు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఈ పరిస్థితులు కన్పిస్తున్నాయి.

శ్రీకాకుళం నగరం బలగలోని కాళభైరవాలయంలో మాఘపౌర్ణమి సందర్భంగా శుక్రవారం బాలత్రిపుర అమ్మవారికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపకులు పొగిరి గణేష్‌స్వామి ఆధ్వర్యంలో సాయంత్రం సిరిజ్యోతి పూజలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. 

హైదరాబాద్‌ నగరంలో ఎండలు మండుతున్నాయి. ప్రజలు వేడిమి నుంచి రక్షణకు ప్రత్యామ్నాయాలు వినియోగిస్తున్నారు. కరోనా మాస్కు మాదిరి ఆన్‌లైన్‌లో ఫేస్‌ మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. ఇద్దరు యువకులు ఫేస్‌మాస్కులు ధరించి బషీర్‌బాగ్‌లో వెళ్తుండగా తీసిన చిత్రమిది.  

జాతరలో అక్కడక్కడ ఆకాశంలో ఎగురుతూ బెలూన్లు కనిపిస్తుంటాయి. ప్రతి బెలూన్‌పై ఒక సంఖ్య ఉంటుంది. ఎవరైనా దారి తప్పినా లేదా వారు ఉన్న ప్రదేశాన్ని ఇతరులకు తెలియజేయాలన్నా ఈ బెలూన్లపై ఉన్న నెంబరు చెబితే సదరు వ్యక్తులు వెంటనే అక్కడికి చేరుకోవచ్చు. 

అనుకోకుండా అదృష్టం వరిస్తే నక్క తోక తొక్కాడని అంటారు. అందుకే మేడారం వచ్చిన భక్తులు కోయదొరల వద్ద ఉండే నక్క తోకను డబ్బులిచ్చి మరీ తొక్కుతున్నారు. ఒకరికి అయితే రూ.100, కుటుంబానికి రూ.200 చొప్పున కోయదొరలు తీసుకుంటున్నారు. నక్క తోక కొనుగోలు చేయాలంటే రూ.1000 చెల్లించాలి. 

ఫ్రాన్స్‌లో మళ్లీ రైతులు కదం తొక్కారు. శుక్రవారం రాజధాని పారిస్‌లో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయానికి ప్రభుత్వం మరింత మద్దతు ఇవ్వాలని, నిబంధనలు సులభతరం చేయాలని గత కొంతకాలంగా ఫ్రాన్స్‌లోని రైతులే కాదు.. ఐరోపాలోని చాలా దేశాల అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు.

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home