చిత్రం చెప్పే విశేషాలు

(26-02-2024/1)

అంతర్జాతీయ బహుళపక్ష నౌకాదళాల విన్యాసాల్లో (మిలాన్‌-2024) భాగంగా నిర్వహిస్తున్న ‘సీ-ఫేజ్‌’ విన్యాసాలు ఆకర్షణీయంగా కొనసాగుతున్నాయి. బంగాళాఖాతం జలాల్లో కొనసాగుతున్న విన్యాసాల్లో భారత నౌకలు తమ సత్తా చాటుతున్నాయి.  

కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభతో అనంతపురం నుంచి ప్రచార కార్యక్రమం ప్రారంభించనుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనాయకుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను రుద్రరాజు, మయప్పన్‌, జంగాగౌతం ఆదివారం పరిశీలించారు. 

అన్నదాతలు దొంగల నుంచి రక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కల్లాల్లో ఆరబోసిన పంట ఇటీవల పలుచోట్ల చోరీకి గురైన సందర్భాలున్నాయి. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండల కేంద్రానికి చెందిన రైతు రెడ్డి రాజమోళి మిర్చి దిగుబడులకు కాపలాగా సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నారు.

అనకాపల్లి పట్టణంలోని పూడిమడక రహదారిలో ఆదివారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రహదారిపై వచ్చిన కుక్కపిల్లను వేగంగా వస్తున్న బైక్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చిన తల్లి రహదారిపై విగతజీవిగా మారిన పిల్లను చూసి రోదించింది. 

అమ్మో ఖడ్గమృగం దూసుకొస్తోంది అని అనుకుంటున్నారా.. శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఓ భారీ హోర్డింగ్‌పైనున్న బొమ్మ ఇది. దూరం నుంచి చూస్తే చెట్ల మధ్య నిలబడి ఉన్నట్లుగా కనిపిస్తూ.. కనువిందు చేస్తోంది.

భారీగా సైజుల్లో ఉండే కొమ్ముకోనాం చేపలు సముద్ర జలాల్లో తీరానికి చాలా దూరంగా వెళ్తే తప్ప చిక్కవు. వీటి ముందుభాగంలో ఉండే ఇనుప చువ్వలాంటి భాగంతో పట్టుకోవడానికి ప్రయత్నించే మత్స్యకారులపై దాడి చేస్తుంటాయి. భారీగా చిక్కిన ఈ చేపలను కేజీ రూ. 400 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు.

ఉద్యానగరిలో ఊదా వర్ణం పూలు ‘టబేబ్యుయా రోసియా’ రకం పూల సీజన్‌ పూర్తి కావస్తున్న సమయంలో ఫ్లేమ్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌ (తురాయి) పుష్పాలు నగరవాసులను కనువిందు చేస్తున్నాయి. ఈ చెట్ల ఆకులన్నీ రాలిపోవడంతో ఎర్రని పుష్పాలు చూసేందుకు ఆకట్టుకుంటున్నాయి. 

ట్రాఫిక్‌ చలానాలు తప్పించుకోవడానికి కొందరు వాహనదారులు నంబరు ప్లేట్లు కనిపించకుండా చేస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసుల కెమెరాలకు చిక్కకుండా వాటిని వంకరగా చేయడం.. అడ్డుగా మాస్కులు, ఇతర వస్తువులు పెట్టడం చేస్తున్నారు. బయోడైవర్సిటీ సైబరాబాద్‌ కమిషనరేట్‌ మార్గంలో కనిపించిన వాహనాలివి.

ఓవైపు ఆకాశహర్మ్యాలు.. మరోవైపు చకచకా వెలుస్తున్న భవనాలు.. వెరసి ఐటీకారిడార్‌ మరో నగరాన్ని తలపిస్తోంది. ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వస్తుండడం.. రాత్రివేళ నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో విద్యుద్దీపాల కాంతుల్లో రాయదుర్గం నాలెడ్జ్‌సిటీ పరిసరాలు ఇలా వెలిగిపోతున్నాయి. 

షబ్‌-ఎ-బరాత్‌ సందర్భంగా ఆదివారం రాత్రి పలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చారిత్రక మక్కామసీదు సహా పలు ప్రార్థనాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. రాత్రంతా ఆధ్యాత్మిక చింతనలో గడిపారు. మతపెద్దలు షబ్‌-ఎ-బరాత్‌ ప్రాధాన్యాన్ని వివరించారు. 

దోమల వల్ల మనుషులే కాదు.. పశువులకూ ఇబ్బందులు తప్పడం లేదు. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని నెల్విడి అనుబంధ గ్రామమైన లక్ష్మీపురంలో రైతు దస్తగిరికి 6 గేదెలు, 3 దూడలు ఉన్నాయి. అవి వ్యాధి బారిన పడకుండా వాటికి దోమ తెర ఏర్పాటు చేశారు. 

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home