చిత్రం చెప్పే విశేషాలు
(01-03-2024/1)
మల్లికార్జునుడు కొలువైన శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఛైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు,వేద పండితులు యాగశాల ప్రవేశం చేశారు. శివ సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం, చండీశ్వర పూజ చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
నాలుగేళ్లకోసారి వచ్చే లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 29 రోజులుంటాయి. ఈ అరుదైన రోజు హైదరాబాద్‌లోని నిలోఫర్‌లో కొందరు చిన్నారులు జన్మించారు. వివిధ ప్రాంతాలకు చెందిన వీరంతా ఇక జన్మదిన వేడుకలను నాలుగేళ్లకోసారి జరుపుకోవాలన్న మాట.
తాడేపల్లిగూడెం జాతీయ రహదారి పక్కనున్న పొలంలో నాలుగుతలల తాటిచెట్టు కనువిందు చేస్తోంది. ఒకే కాండానికి మరిన్ని కొమ్మలున్నా అవి విరిగిపోయాయని చివరకు ఈ నాలుగుతలలే మిగిలాయని స్థానికులు చెబుతున్నారు. ఈ మార్గంలో వెళ్లేవారంతా దీనిని అసక్తిగా చూస్తున్నారు.
గుంటూరు నగరం బ్రాడీపేటలో ఇలా ర్యాబిట్ పౌచ్ తగిలించిన హెల్మెట్‌తో సందడి చేశారు. ఆన్‌లైన్‌లో వివిధ రకాల డిజైన్‌లలో పౌచ్‌లు అందుబాటులో ఉన్నాయని, ఇవి రక్షణ కల్పించడంతో పాటు ఆకర్షణీయంగా ఉంటాయని యువకుడు తెలిపారు.
నర్సీపట్నం వెళ్లే మార్గంలో ఇందేశమ్మవాక సమీపంలో ఘాట్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న వారిని ఇసుక తిన్నెల అందాలు ఆకర్షిస్తున్నాయి. పలువురు ఘాట్ రోడ్డులో ఆగి స్వీయ చిత్రాలు తీసుకుంటున్నారు.
విశాఖపట్నం జిల్లా జోలాపుట్టు గ్రామంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల భవనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. భవనం గోడలపై మహాత్మా గాంధీ, నెహ్రూ, రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్, భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బొమ్మలను చిత్రీకరించారు.
వనపర్తి జిల్లాలో ఓ రైతు భిన్నంగా వరి సాగు చేసి మంచి దిగుబడి సాధిస్తున్నారు. జిల్లాలోని వీపనగండ్లకు చెందిన బాపూజీ గౌడ్‌కు 10 ఎకరాల పొలం ఉంది. మూడేళ్ల కిందట మామిడి మొక్కలు నాటారు .ప్రస్తుతం మామిడి చెట్లకు పూత, కాయలు ఉన్నాయి.
హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉద్యానాలు పచ్చందాలు సంతరించుకొని ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. చుట్టూ భారీ వృక్షాల నడుమ ఫౌంటెయిన్ల మధ్య విద్యార్థులు సందడి చేస్తూ కనిపించారు.
గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌లో పుష్పాలకు గిరాకీ లేకపోవడంతో వ్యాపారులు వాటిని కుప్పలు పారబోశారు. వీధుల్లో తిరుగుతూ పూలను విక్రయించే కొందరు పడేసిన వాటిలో బాగున్నవి ఇలా ఏరుకుంటూ కనిపించారు.
నిజామాబాద్‌లోని గంజ్ కూరగాయల మార్కెట్‌లో విక్రయిస్తున్న చిట్టి టమాటాలకు గట్టి ధర పలుకుతున్నాయి. మార్కెట్‌లోకి అరుదుగా వచ్చే ఈ టమాటాల కోస కొనుగోలుదారులు పోటీపడుతున్నారు. ఇందులో రుచి, పోషకాలు ఎక్కువగా ఉంటాయని విక్రయదారుడు తెలిపారు. కిలో రూ.60 చొప్పున అమ్ముతున్నట్లు చెప్పారు.