చిత్రం చెప్పే విశేషాలు
(02-03-2024/1)
ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో శనివారం సాయిబాబా మందిరం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరంలో అభిషేకాలు, అర్చనలు, కాగడ హారతి వంటి పూజలు చేసి సాయిబాబా విగ్రహాన్ని పలు రకాల పూలతో అలంకరించారు. వివిధ గ్రామాలకు చెందిన భక్తులు మందిరానికి వచ్చి బాబాను దర్షికున్నారు.
ఉచిత విద్యుత్తుకు సంబంధించి గృహజ్యోతి పథకం అమలు మొదలైంది. ఈ సందర్భంగా మింట్ కాంపౌండ్ ప్రాంతంలోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆవరణలో బల్బు నమూనాతో ఏర్పాటు చేసిన కటౌట్ ఆకట్టుకుంటోంది.
నిలోఫర్ ఆసుపత్రి పాతభవనం నిర్మించి పాతికేళ్లు దాటడంతో దానికి ఇబ్బందులు కలగకుండా ఇనుముతో నిర్మాణాన్ని చేపట్టారు. కార్పొరేట్ ఆసుపత్రిలా ముందుభాగాన్ని తీర్చిదిద్ది.. నూతనంగా మరో అంతస్తు నిర్మించారు. రోగులకు అనుకూలంగా ఉండేందుకు పాదచారుల వంతెన ఏర్పాటుచేశారు.
బెంగళూరులో పేలుళ్ల నేపథ్యంలో నగరంలో పోలీసులు అప్రమత్తమైనా.. రద్దీపరంగా కీలకమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ఎంజీబీఎస్ బస్‌స్టేషన్లలో మాత్రం భద్రత వెలవెలబోతూ కనిపించింది.
భారత- మలేసియా దేశాల మధ్య ‘సముద్ర లక్ష్మణ’ పేరిట విశాఖపట్నం తీరంలో ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలు ప్రారంభమైనట్టు నేవీ వర్గాలు తెలిపాయి. గత నెల 28 నుంచి ఈనెల 2వ తేదీ వరకు హార్బర్ విన్యాసాలు జరుగుతున్నాయి.
మార్చి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. ఇది గమనించిన మొక్కల ప్రేమికులు ఓ ఉపాయం ఆలోచించారు. పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఇంటిముందు పెంచిన మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు మొక్కలపై వస్త్రాన్ని కప్పి నీళ్లు జల్లుతున్నారు.
గాంధీనగర్ పారిశ్రామిక వాడలోని ప్రధాన రహదారి పక్కన ఓ కంపెనీ ముందున్న మర్రి చెట్టు కొమ్మలను పూర్తిగా నరికేసీనతీరు పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి చెట్ల నరికివేతను నియంత్రించాలని వారు కోరుతున్నారు.
ఇదేంటి ట్రాక్టర్ ట్రాలీని చీరతో సింగారించారనుకోకండి. ఇసుక గాలికి ఎగిరి వాహనదారులపై పడకుండా ఇలా కట్టారంతే. జాతీయ రహదారిపై ఎర్రవల్లి వైపు ఇసుకలోడుతో వెళ్తున్న ట్రాక్టర్లలో ఒక దానికి ఇలా కన్పించింది. గత ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరగా పలువురు చర్చించుకోవడం విన్పించింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న అతిపెద్ద చెరువుల్లో ధర్మవరం చెరువు ఒకటి. రెండు వేల ఎకరాల విస్తీర్ణంతో ఈ చెరువును రాయల కాలంలో ఏర్పాటు చేశారు. ఈ ఏడు వర్షాలు కురవక, కృష్టా జలాలు రాకపోవటంతో చెరువు ఎండి మేటలు వేసి నత్తలు ఎక్కడికక్కడ గుట్టలుగా కనిపిస్తున్నాయి.
వరంగల్ జిల్లా నెక్కొండ నుంచి నర్సంపేటకు వెళ్లే మార్గంలో అమీన్‌పేట సమీపంలో గతంలో నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగాయి. వసంత రుతువు సమీపిస్తుండడంతో ఓ చెట్టు ఆకులన్నీ రాలిపోగా.. చెట్టు నిండా కాసిన పసుపు వర్ణం కాయలు పత్రాలను తలపిస్తూ కనువిందు చేస్తున్నాయి.
పర్యావరణానికి గొడ్డలిపెట్టుగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలతో మహారాష్ట్రలోని అమరావతి ప్రాంత రామ్‌మేఘ ఇంజినీరింగ్ కళాశాల పరిశోధకులు సీసీ రోడ్లు నిర్మించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువకాలం మన్నిక ఉండేలా రూపొందిన ఈ పరిశోధనకు భారత ప్రభుత్వం నుంచి పేటెంటు హక్కు లభించింది.