చిత్రం చెప్పే విశేషాలు
(03-03-2024/1)
సాధారణంగా వంకాయ 100 నుంచి 200 గ్రాముల వరకు బరువు ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో శనివారం జరిగిన వారపు సంతకు గిరిజన రైతులు తీసుకొచ్చిన వంకాయల్లో కొన్ని భారీ సైజులో ఉండి చూపరులను ఆకట్టుకున్నాయి. ఒక్కో వంకాయ కిలో నుంచి కిలోన్నర వరకు బరువు తూగాయి.
హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని నావిగేషన్ ట్రైనింగ్ స్కూల్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా శనివారం ఆకాశ్‌గంగ స్కై డైవింగ్, ఎయిర్ వారియర్ల ఆధ్వర్యంలో హెలికాప్టర్లు, మూడు రంగుల పారాచూట్‌లతో నింగిలో చేసిన విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి.
సాయం సంధ్య వేళ.. చుట్టూ పచ్చని పంట పొలాలు.. ఆకాశం చల్లబడుతుంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో రెండు మయూరాలు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజురాలో పచ్చని పొలం గట్టుపై మగ నెమలి నాట్యమాడుతుంటే ఆడ నెమలి పరవశంతో చూస్తున్న ఈ చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ కెమెరాలో బంధించింది.
ప్రకాశం జిల్లా ఒంగోలులో సూర్యాస్తమయ సమయం దృశ్యం కనువిందు చేసింది. నగరంలోని శ్రీగిరి కొండపై ఉన్న టవర్‌కు... అలంకరణ దీపం అమర్చినట్లుగా భానుడు ఇలా ఒదిగిపోయాడు.
నెల్లూరు జిల్లా చేజర్ల జడ్పీ ఉన్నత పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయుడు తోటకిషోర్‌కుమార్ జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని అందుకొన్నారు. డ్రీమ్ వర్క్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో నిర్వహించిన జాతీయస్థాయి చిత్రలేఖన పోటీల్లో విజేతగా నిలిచారు.
మర్రిగూడ మండలం యరగండ్లపల్లి నుంచి మాల్‌కు వెళ్లే రహదారి పక్కన ఓ చెట్టుకు ఆకులు పూర్తిగా రాలిపోయి ఎవరో అలంకరించినట్లుగా పూలు విరబూసింది. ఆకర్షణీయంగా అటువైపు వెళ్లే వారికి సుగంధాన్ని వెదజల్లుతూ ఆకట్టుకుంటుంది. దీనిని ‘న్యూస్‌టుడే’ కెమెరాలో బంధించింది.
నిజామాబాద్ శివారు కాలూర్‌లో రాహుల్ అనే యువకుడు తన బైక్‌కు అనుసంధానించి గడ్డిని తరలిస్తుండగా ‘ఈనాడు’ క్లిక్‌మనిపించింది. ఈ ట్రాలీ తయారుచేయించుకోవడానికి రూ.30 వేలు ఖర్చు అయిందని రాహుల్ చెప్పారు.
విశాఖపట్నం జిల్లాలో ఇంకా శీతల వాతావరణం కొనసాగుతోంది. చింతపల్లిలో శనివారం ఉదయం 14.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఎం.సురేష్‌కుమార్ తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని కొండలు, గుట్టలు భవన నిర్మాణాలతో కనుమరుగవుతుంటే.. కొందరు వాటి సహజత్వాన్ని కాపాడుతూనే వాటికి అనుగుణంగా ఇళ్లను నిర్మించుకుంటున్నారు. బషీర్‌బాగ్ ప్రాంతంలోని ఆదర్శనగర్‌లో రాతిపై ఓ ఇంటి నిర్మాణం ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారిని ఆకట్టుకుంటోంది.
‘జాతీయ సంస్కృతి మహోత్సవం’ శనివారం సాయంత్రం హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.