చిత్రం చెప్పే విశేషాలు
(04-03-2024/1)
సాగర్‌రింగ్ రోడ్డు కాకతీయ కాలనీలోని కాకతీయ పాఠశాల వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు, నాటికలతో అలరించారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని నల్లచెరువు ఇది. సమీప ప్రాంతాల నుంచి కాలుష్య జలాలు కలిసి ఇలా నురగలుగా మారి ప్రవహిస్తోంది. చెరువు సుందరీకరణ సైతం అటకెక్కడంతో ఇలా మారిపోయింది.
విజయవాడ నగరంలో ఆట స్థలాలు లేక వారాంతం, సెలవు దినాల్లో యువకులు ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా నది మధ్యలో అక్రమార్కులు ఇసుక తవ్వేయడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. నదిలో స్నానాలు చేయడానికి దిగిన పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదు.
హైదరాబాద్ నగరంలో తొలిసారిగా నిర్వహించిన సోప్‌బాక్స్ రేస్‌కు విశేష స్పందన లభించింది. రామానాయుడు స్టూడియోలో ప్రదర్శించిన నాన్‌మోటరైజ్డ్ వాహనాలు ఆకట్టుకున్నాయి. సుమారు 1500కు పైగా సందర్శకులు హాజరయ్యారు. చిన్న పరిమాణంలో వాహనాలను రూపొందించి సృజనాత్మకతను చాటారు.
ఖైరతాబాద్‌లో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘జాతీయ సంస్కృతి మహోత్సవం’ రెండో రోజు సందడిగా సాగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కథక్ జానపద, వయోలిన్, భరతనాట్యం ప్రదర్శనలు అలరించాయి.
నల్గొండ జిల్లా నారాయణపురంలో ఓ రైతు ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని వరితో పాటు ఓ మడిలో వంకాయ, టమాట సాగు చేస్తున్నాడు. కూరగాయల తోటలో కలుపు మొక్కలు పెరిగాయి. ఎడ్లతో గుంటుక తీయాల్సి ఉండగా.. ఖర్చు కలిసి వస్తుందని తన కుమారుడితో కలిసి ఇలా కలుపు తీస్తూ ‘న్యూస్‌టుడే’ కంటపడ్డాడు.
విశాఖపట్నం జిల్లా మన్యంలో మంచు కురుస్తున్న విధంగా కనిపిస్తున్న ఈ దృశ్యం జీవీఎంసీ కార్యాలయం సమీపంలోనిది. ఆదివారం ఉదయం చెత్తకు నిప్పంటించడంతో ఇలా రహదారిపై దట్టంగా పొగ కమ్మేసింది. దీంతో ఇటుగా వచ్చిన వాహనదారులు, పాదచారుల కళ్లు మండి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
రాంగోపాల్‌పేట డివిజన్ ప్యారడైజ్ వద్దనున్న వెస్లీ పాఠశాలలో కనిపించిన దృశ్యమిది. ఓ భారీ వృక్షం ఊడలు గోడలను చీల్చుకుంటూ పెరిగింది. ఇలాగే వదిలే›స్తే ప్రహరీ కూలిపోయే ప్రమాదం ఉంది.
అప్పుడే ఎండలు మండుతున్నాయ్. బయటకు వెళ్తే ఒంటికి రక్షణ లేకుండా వెళ్లలేని పరిస్థితి. చార్మినార్ వద్ద యువతులు కనిపించారిలా..