చిత్రం చెప్పే విశేషాలు

(07-03-2024/1)

పగటిపూట భానుడు తన ప్రతాపం చూపిస్తుండగా.. ఉదయం వేళ పొగమంచు ఉంటుంది. నూతనకల్‌లో బుధవారం దట్టమైన మంచు ఆవరించి ఉంది. హిమ బిందువులతో కూడిన రెక్కల బరువుతో ఓ తూనీగ ఆహార అన్వేషణకు బయలుదేరింది. ఓ మొక్కపై వాలి సాలీడును దొరకబట్టి తన ఆకలి తీర్చుకుంటూ ‘న్యూస్‌టుడే’ కంట పడింది. 

మహారాష్ట్రలోని థానెలో బుధవారం ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రిమియర్‌ లీగ్‌ టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ టోర్నీ ఆరంభ వేడుకల సందర్భంగా నాటు నాటు పాటకు దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌.. నటులు రామ్‌ చరణ్‌, అక్షయ్‌ కుమార్‌, సూర్య నృత్యం చేశారు.

మహా శివరాత్రిని పురస్కరించుకొని ఒంగోలు సంతపేట సాయిబాబా ఆలయ ప్రాంగణంలోని శివాలయాన్ని సుందరంగా అలంకరించారు. పదకొండు లక్షల రుద్రాక్షలతో శివలింగాన్ని తీర్చిదిద్దారు. పందిరిలా అలంకరణ చేశారు.

చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని బుధవారం సినీనటి జాన్వీకపూర్, మహేశ్వరి కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వారికి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపల జాన్వీకపూర్‌ను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు.

ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం దేగామ వద్ద చెరువులో వరుస క్రమంలో ఉన్న పెద్ద వృక్షాలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. మోడు కూడా అందంగా కనిపిస్తూ అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులను ఆకట్టుకుంటున్నాయి.

విశాఖపట్నంలోని పైడిపాల వామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని బుధవారం ఉదయం తొలి సూర్య కిరణాలు తాకాయి. సుమారు 25 అడుగుల లోపల గర్భాలయంలో ఉన్న లింగంపై సూర్యకిరణాలు పడటం చూసిన భక్తులు పులకించారు.

కౌడిపల్లి మండలం భుజిరంపేట శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలోని చెట్టుపై బుధవారం నాగుపాము పడగవిప్పి కనిపించడంతో అక్కడ పని చేస్తున్న కూలీలు, ఆ దారిలో ప్రయాణిస్తున్న వారు ఆసక్తిగా తిలకించారు. 

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పూల గడియారాన్ని ఏర్పాటుచేశారు. ప్రవేశ మార్గంలో ఆకట్టుకునేలా రకరకాల పూల మొక్కల మధ్య తీర్చిదిద్దిన ఈ గడియారాన్ని బుధవారం ప్రారంభించారు.

హైదరాబాద్‌ నగర శివారులోని బాటసింగారం పండ్ల మార్కెట్‌కు పండగ కళ వచ్చింది. మహా శివరాత్రి సమీపిస్తుండటంతో వివిధ రకాల ఫలాలు ముంచెత్తుతున్నాయి. చాలామంది ఉపవాసాలు ఉంటూ.. ఎక్కువగా వీటినే ఆరగిస్తుంటారు. దీంతో పండ్లకు గిరాకీ పెరిగింది. మార్కెట్‌లో ఎటు చూసినా అవే కనిపిస్తున్నాయి.

ఎండలు మండుతున్నాయి. మంచినీటి ఎద్దడికి తెరలేస్తోంది. బాటసింగారం సమీపంలోని కొత్తగూడెం వద్ద రాళ్లు కొట్టి జీవించే కుటుంబాల చిన్నారులు నల్లా వాల్వ్‌ నుంచి లీకయ్యే నీటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా కనిపించిన దృశ్యం.

హైదరాబాద్‌ నగరంలో మహా శివరాత్రి సందడి మొదలైంది. ఉత్సవాలు, పూజల కోసం ఎల్బీనగర్‌ రహదారిలో శివపార్వతుల విగ్రహాలు సిద్ధంచేసి విక్రయిస్తున్నారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home