చిత్రం చెప్పే విశేషాలు
(10-03-2024/1)
చూడముచ్చటైన ఆకృతులు.. అందమైన పూలమొక్కలు.. ఆకట్టుకునే బెంచీలు.. ఆలోచింపజేసే సందేశాలు.. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి పైవంతెన కింద ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్కులోని చిత్రాలివి. తెలంగాణకు హరితహారంలో భాగంగా సుందరంగా తీర్చిదిద్దిన ఈ ఉద్యానం ప్రారంభానికి సిద్ధమైంది.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించిన ‘పెద్దపట్నం’ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి 11.45 గంటల నుంచి శనివారం ఉదయం 7 గంటల వరకు కార్యక్రమం కొనసాగింది. తోటబావి సమీపంలోని కల్యాణ మండపం వద్ద పెద్దపట్నం వేశారు.
కరీంనగర్ బొమ్మకల్‌లోని మైనారిటీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల దారిలో చెట్టు నిండా పూలు పూస్తూ బాటసారులకు కనువిందు చేస్తోంది. ఇది దక్షిణ అమెరికాకు చెందినదని శాతవాహన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర ఆచార్యులు నరసింహమూర్తి తెలిపారు.
మరో రెండురోజుల్లో ప్రారంభం కానున్న రంజాన్ మాసం కోసం హైదరాబాద్ నగరవ్యాప్తంగా పలు హోటళ్లలో హలీం, హరీస్‌ల తయారీకి బట్టీలను సిద్ధం చేస్తున్నారు. ప్రముఖ హోటళ్ల నిర్వాహకులు సమీపంలోని మైదానాల్లో, ఫంక్షన్‌హాళ్లలో బట్టీలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి విమాన రథోత్సవం వైభవంగా నిర్వహించారు. శివనామస్మరణతో ప్రాంగణం మార్మోగింది.
నిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ విభాగానికి కిడ్నీ రోగులు రెండు, మూడు రోజులకోసారి ఇక్కడికొచ్చి రక్తాన్ని శుద్ధి చేయించుకోవాలి. రోగి పరిస్థితిని బట్టి రెండు నుంచి నాలుగైదు గంటల వరకు బెడ్‌పైనే పడుకోవాల్సి ఉంటుంది. దీంతో కాలక్షేపం కోసం కొందరు రోగులు ఇలా సెల్‌ఫోన్లతో గడుపుతూ ఉంటారు.
క్రమంగా ఎండలు పెరుగుతుండటంతో నీటిని నిల్వ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ఇలా డ్రమ్ములను తీసుకువెళ్తూ యూసుఫ్‌గూడ ప్రాంతంలో కనిపించారు.
వర్షాలు లేకపోవడంతో ఎగువ నుంచి ఇచ్ఛాపురం మండలం బిర్లంగి వద్ద బాహుదా నదికి నీరు రావడం లేదు. ఏడాది కాలంగా నీరు లేకపోవడంతో నదీ గర్భం మైదానంలా మారింది. స్థానిక పశు పోషకులు పిడకలు వేసి ఎండబెట్టుకోవడానికి వినియోగిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రం షిర్డీ సాయికృపానగర్‌లో ఓ ఇంటి బయట నాటిన మునగచెట్టు చూపరులను ఆకట్టుకుంటోంది. చెట్టు చూడటానికి చిన్నగా ఉన్నా..కాయలు విరగకాశాయి. దాదాపుగా వందకుపైగా ఉండటం విశేషం.
ఎన్నూరులోని కుశస్థలి నదిలో చేపలు పట్టి 8 గ్రామాలకు చెందిన జాలర్లు ఉపాధి పొందుతున్నారు. రెండు రోజులుగా నదిలోని నీరు పసుపు రంగులో కనిపిస్తున్నాయి. పరివాహక ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు నదిలో కలుస్తుండటంతో నీరు రంగు మారిందని జాలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.