చిత్రం చెప్పే విశేషాలు

(13-03-2024/1)

పశ్చిమ జపాన్‌లోని వకయమ ప్రిఫిక్చర్‌లోని లాంచ్‌ ప్యాడ్‌లో జపాన్‌ చేపట్టిన తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం విఫలమైంది.  దాదాపు 60 అడుగుల పొడవైన కైరోస్‌ రాకెట్‌ చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి ఎగిరిన కొన్ని క్షణాల్లోనే పేలి అగ్నిగోళంలా మారిపోయింది.

నస్లేన్‌ కె.గఫూర్‌, మాథ్యూ థామస్‌, మమిత బైజు ప్రధాన పాత్రల్లో గిరీష్‌ ఎ.డి. తెరకెక్కించిన మలయాళ చిత్రమే ‘ప్రేమలు’. తెలుగులో అదే పేరుతో విడుదల చేశారు నిర్మాత ఎస్‌.ఎస్‌.కార్తికేయ. ఇది ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌లో మంగళవారం సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ వైభవాన్ని దిశ దిశలు చాటేలా విద్యుత్తు దీపాల ధగధగగలు కనువిందు గొలుపుతున్నాయి. స్వర్ణ కాంతుల్లో ఆలయ గోపురాలు దేదీప్యమానంగా వెలుగుతూ.. భక్తానందాన్ని కలిగిస్తున్నాయి. 

వేసవి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వర్షాకాలంలో నీటితో కళకళలాడిన చెరువులు అడుగంటుతున్నాయి. దాంతో స్థానికులు చేపల వేటలో నిమగ్నమవుతున్నారు. హైదరాబాద్‌ నగర శివారులోని కుంట్లూరు వద్ద కనిపించిన దృశ్యం ఇది.

సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన ఏపూరి సతీష్‌ తన వ్యవసాయ భూమిలో వరితో పాటు ఓ మడిలో కూరగాయల సాగు చేస్తున్నారు. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు ద్వారా నీటిని పారించే వీలు లేకపోవడంతో.. బకెట్లతో నీరు పోస్తూ పంటను రక్షించుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. 

మంగళవారం రైలు ఇంజిన్‌ జాతీయ రహదారిపై భారీ లారీపై వెళ్తుంటే ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. పరిశ్రమలో తయారైన కొత్త ఇంజిన్‌ను బెంగళూరు నుంచి దిల్లీకి వంద టైర్లతో కూడిన లారీపై తీసుకెళుతున్నారు. మెదక్‌ జిల్లా నుంచి వెళ్తుండగా ప్రయాణికులు ఆసక్తి చూశారు.

ఎండలు మండుతున్నాయి. ప్రయాణికులకు చల్లదనం ఉండాలని ఎర్రగడ్డకు చెందిన ఓ డ్రైవర్‌ ఆటోపై గోనె సంచుల్ని ఏర్పాటు చేశాడు. గంటగంటకు వాటిని నీటితో తడుపుతుంటానని తెలిపాడు.

విశాఖపట్నం జిల్లా ఆంధ్రాకశ్మీర్‌గా పేరొందిన లంబసింగి మార్గంలోని ఘాట్‌రోడ్లో ఓ చోట వ్యూపాయింట్‌ ఉంది. ఈ మలుపులో పర్యటకులంతా ఆగి ఫొటోలు తీసుకుంటుంటారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో మంచు లేక వెలవెలబోతోంది. కొండలన్నీ బోడిగా కనిపిస్తున్నాయి.

పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఈ నెల 17 తెదేపా-జనసేన-భాజపా ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన భూమి పూజలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు మూడు పార్టీల నేతలు పాల్గొన్నారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home