చిత్రం చెప్పే విశేషాలు

(14-03-2024/1)

రైలు బోగీలను పట్టాలపై చూస్తుంటాం. బుధవారం నేరడిగొండ మండలం బోథ్‌ ఎక్స్‌రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై లారీపై బోగీని తరలిస్తున్నారు. మరమ్మతుల్లో భాగంగా హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్‌ తరలిస్తున్నట్లు వాహన చోదకుడు తెలిపారు. 

చేగుంట మండలం వల్లభాపూర్‌ స్టేజీ వద్ద ప్రయాణ ప్రాంగణం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన గ్రామస్థులు గుడిసె వేసి, కూర్చునేందుకు సిమెంట్‌ బల్లలను ఏర్పాటు చేశారు. బస్సుల కోసం వచ్చే విద్యార్థులు, ప్రజలు గుడిసెలో కూర్చుంటున్నారు. 

వాహనం నడుపుతూ బుజ్జాయిని ఇలా బ్యాగులో బజ్జోపెట్టడం బాగానే ఉందిగానీ ఓరకంగా ప్రమాదకరమే. ఖైరతాబాద్‌ రోడ్డులో ఎర్రమంజిల్‌ సిగ్నల్‌ వద్ద కనిపించారు.

వరంగల్‌ జిల్లా నర్సంపేటలో మల్లంపల్లికి వెళ్లే రహదారి పక్కనున్న ఓ చెట్టు ఆకులన్నీ రాలిపోయాయి. హరితహారంలో భాగంగా మూడేళ్ల క్రితం రహదారికి ఇరువైపులా తబుబియ రోసియా రకం మొక్కలు నాటారు. పూలతో కొత్త సోయగం సంతరించుకున్న చెట్టు అటువైపు వెళ్లేవారిని ఆకట్టుకుంటోంది. 

పరేడ్‌ గ్రౌండ్‌ మెట్రోస్టేషన్‌ పార్కింగ్‌లో ఈమధ్య వందల్లో వాహనాలుంటున్నాయి. ఎండలు ముదురుతుండటంతో సికింద్రాబాద్‌ పరిసర పాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వాహనాలపై వెళ్లలేక.. ట్రాఫిక్‌తో ఇబ్బంది పడలేక ఇక్కడ నిలిపి మెట్రోలో హాయిగా ఏసీలో వెళ్తున్నారు. 

 కొన్నేళ్లుగా కనిపించకుండా పోయిన ‘బ్లూ డ్రాగన్‌’, జలచరాలు మళ్లీ సముద్రం ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. పూరీ, అస్తరంగ, గోపాల్‌పూర్, తీరాలకు చేరుతున్నాయి. ఇవి విషపూరితమైనవని, ముట్టుకోరాదని సాగర అధ్యయన శాస్త్ర నిపుణుడు ఆచార్య ప్రతాప్‌ మహంతి బుధవారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. 

ఐటీ కారిడార్‌ నుంచి ఔటర్‌కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా ఇప్పటికే గచ్చిబౌలి కూడలిలో వంతెన ఉండగా ఇటీవల శిల్పా లేఅవుట్‌ మార్గంలో మరో వంతెన అందుబాటులోకి వచ్చింది.   బాహ్యవలయ రహదారి నుంచి నేరుగా కొత్తగూడకు వెళ్లేలా మూడో వంతెన పనులు ఇప్పటికే మొదలయ్యాయి.

చెత్తను తరలించే వాహనానికి పక్కన ఉండే అద్దం పగిలిపోవడంతో వెనక నుంచి వచ్చే వాహనాలను చూడటానికి ఇబ్బందిగా ఉందని డ్రైవర్‌ ఓ ఆలోచనకు రూపమిచ్చాడు. ఇంట్లో ముఖం చూసుకునే అద్దాన్ని ఇలా అమర్చాడు. జియాగూడ వద్ద కనిపించిన చిత్రమిది.

బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని జె.పంగులూరు ఎస్సీ కాలనీలో మృతిచెందిన 14 మంది పేర్లను అధికారులు ఓటరు జాబితా నుంచి తొలగించకపోవడంతో జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ నేత పులిపాటి హేబేలు బుధవారం శ్మశానంలో ప్రచారం చేసి, సమాధుల వద్ద కరపత్రాలు ఉంచి నిరసన తెలిపారు.

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home