చిత్రం చెప్పే విశేషాలు
(15-03-2024/1)
విద్యార్థుల వికాసానికి గణితశాస్త్రమే ప్రామాణికమని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ నర్సయ్య అన్నారు. సిరికొండలోని పాఠశాలలో గురువారం అంతర్జాతీయ గణిత, పై దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మనిషి పుట్టుక నుంచి మరణం వరకు జీవితం గణితంతో ముడిపడి ఉందన్నారు.
విశాఖలోని రుషికొండ బీచ్ సమీప తీరంలో మత్స్యకారుల వలకు అరుదైన చేపలు చిక్కాయి. ఈ జీవుల శాస్త్రీయ నామం టరోసిస్ వలీటన్స్.. వీటిని రెడ్ లైన్ ఫిష్‌లుగా పిలుస్తారు. వీటి రెక్కల భాగంలో ఉన్న విషపూరిత ముళ్లు గుచ్చుకుంటే ప్రమాదకరం.
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల నుంచి తెచ్చిన తాటి ముంజలను అశోక్‌నగర్ రోడ్డులో కాలువ బ్రిడ్జిపై రైతులు అమ్ముతూ కనిపించారు.
బోడుప్పల్ భాగ్యనగరం నందనవనంలో వేసవి ఎండను తట్టుకోలేక జింకలు చెట్ల కింద చేరి సేద తీరాయి.
ఆరోగ్యం బాగు చేసుకుందామని కింగ్ కోఠి ఆసుపత్రి లోపలికి వెళ్లాలంటే మురుగు దాటేందుకు రాళ్లపై ఫీట్లు చేయాలి. ముఖ్యంగా చిన్నారులతో వచ్చే మహిళల అవస్థలు వర్ణణాతీతం. ఇంత దుర్భరంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శంకరపట్నం మండలంలోని పలు గ్రామాలలో రైతులు వరి ఐసోలేషన్ కోసం పొలాల చుట్టూ పరదాల ఏర్పాటులో నిమగ్నమవుతున్నారు. సీడ్‌వరి సాగు చేసిన పొలాల పక్కన ఇతర వరి సాగు చేస్తే దిగుబడి కోసం రైతులు పరదాలు ఏర్పాటు చేయాల్సిందే. కాచాపూర్ గ్రామ శివారులో కనిపించిన దృశ్యమిది.
బద్వేలు పట్టణంలోని గట్టుపల్లె సోమశిల జలాశయం పునరావాస కాలనీలో పైపులైను ఏర్పాటు చేసినా కుళాయిలు వేయలేదని, కొన్నిచోట్ల కుళాయిలు బిగించినా నీరు రావడంలేదని పైపులైన్ లీకేజీ నీటిని పట్టుకుంటూ దాహం తీర్చుకుంటున్నామని కాలనీవాసులు వాపోతున్నారు.
ఆజాద్‌నగర్ (అనంతపురం) నగరంలోని నెహ్రూ మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి కష్టాలు ఎక్కువయ్యాయి.మధ్యాహ్న భోజనం తిన్న తరవాత సమీప కోర్టు, పోలీస్ స్టేషన్లలోకి వెళ్లి దాహార్తి తీర్చుకుంటున్నారు.
ఐమాక్స్ ముందున్న లేక్‌వ్యూ పార్కులోని సరస్సులో గుర్రపుడెక్క బాగా పెరిగిపోయింది. దగ్గరగా ఉంటే ముక్కుపుటాలు అదురుతున్నాయి. దూరం నుంచి చూస్తే పచ్చని గడ్డి పరుచుకున్న మైదానంలా కనిపిస్తోంది.
ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం ముగియడంతో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు సందడి చేశారు. స్నేహితులతో కలిసి ఫొటోలు దిగారు. మళ్లీ కలుద్దాం అంటూ భారమైన హృదయాలతో కదిలారు. మరోవైపు ప్రభుత్వ గురుకులాలు, ప్రైవేటు వసతిగృహాల్లో ఉండే విద్యార్థులు.. సొంతూళ్లకు పయనమయ్యారు.