చిత్రం చెప్పే విశేషాలు
(20-03-2024/1)
రాజమహేంద్రవరం శ్యామలనగర్ లోని పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.
హరియాణాలోని సోనీపత్‌లో జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది మంగళవారం జాతీయ జెండా ఆకారంలో నిల్చొని గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించారు. ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
హనుమకొండ బస్టాండు సమీపంలోని ఎండిపోయిన ఓ వృక్షాన్ని గూడుగా మార్చుకున్నాయి పిచ్చుకలు. ఆ పిచ్చుకలతో అక్కడి ఎండిన వృక్షం సరికొత్త అందాలను సంతరించుకుంది. ఆ ఆవాసం నుంచి ఆహారానికి వెళ్లి సాయంత్రం తిరిగొచ్చాక.. అవి చెట్టుకొమ్మలకు ఆకులుగా మారి కనువిందు చేస్తుంటాయి.
అసలే వేసవి కాలం.. వేడి నుంచి ఉపశమనం కోసం ఎన్నెన్నో వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. వెస్ట్‌మారేడుపల్లి రహదారిపై విక్రయిస్తున్న చిన్న ఛార్జింగ్ ఫ్యాన్లు ఇవి.
అఫ్జల్ గంజ్ బ్రిడ్జిపై నలుగురు యువకులు చేతిలో సామాన్లతో ప్రమాదకరంగా ఇలా ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసులు నిబంధనలపై ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొందరి తీరు మారడం లేదు. ఓ ద్విచక్రవాహనదారుడు బాలుడిని ఇలా వెనక్కి తిరిగి కూర్చొబెట్టి తీసుకెళ్తూ రద్దీగా ఉండే ట్యాంక్‌బండ్ రోడ్డుపై కనిపించాడు.
అస్తవ్యస్తంగా చేపడుతున్న మరమ్మతు పనులు ప్రమాదకరంగా మారుతున్నాయి. నారాయణగూడ చౌరస్తాలో రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్‌హోళ్లను సరిచేసిన సిబ్బంది వాటిపైన మట్టితో అరకొరగా కప్పి వదిలేశారు.
ఆదిలాబాద్ జిల్లా ధన్నూర్ గ్రామ సమీపంలో ఓ పొలంలో రైతు పండించిన జొన్నపంట రెండు రంగుల్లో కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలోని జొన్న పంట సగం వరకు ఆకుపచ్చ, దాని కంకి లేత పసుపు వర్ణంలో కనిపిస్తుండగా, పక్కన ఉన్న జొన్నపంట ఎరుపు వర్ణంలో కనిపిస్తూ ఆకర్షిస్తోంది.
పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజిన్లు పెట్టుకొని కిలోమీటర్ల కొద్దీ పైపులు వేసి మిర్చి, మొక్కజొన్నకు తడులు అందిస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి కాలువలకు సకాలంలో నీరు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది.