చిత్రం చెప్పే విశేషాలు

(22-3-2024/1)

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఎల్‌బీనగర్‌ నుంచి మల్కాపూర్‌ వరకు రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆరు వరుసల దారితోపాటు సర్వీస్‌రోడ్లు నిర్మిస్తున్నారు. ఈఏడాది చివరినాటికి పూర్తిచేసే విధంగా ముందుకు సాగుతున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్టు వద్ద పూర్తయిన రోడ్డు ఇది.

ఫతేదర్వాజాకు చెందిన బాబురావు తన సొంత ఆటోను దుకాణంగా మార్చుకున్నాడు. అద్దె, అడ్వాన్సులు భారమై ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. దాదాపు 15 ఏళ్ల క్రితం నుంచి ఆయన చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. బహదూర్‌పురలో తీసింది ఈ చిత్రం. 

నూతనకల్‌ మండలంలోని వెంకేపల్లి ఎస్సీ కాలనీలోని మూడు వీధులకు గ్రామశివారులో ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా పథకం బావి ఇటీవలే అడుగంటింది. ఇంట్లో మంచానికే పరిమితమైన వృద్ధురాలైన భార్య, దివ్యాంగురాలైన కుమార్తె దాహం తీర్చడానికి కావడితో మంచినీటిని తీసుకొస్తున్న వృద్ధుడి చిత్రమిది.

రాజమహేంద్రవరం శ్యామలనగర్‌లోని పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవంలో భాగంగా శుక్రవారం అమ్మవారు కాళీమాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

కావేరి నీటి సరఫరా లేని బెంగళూరు నగర శివారు ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు కొనసాగుతున్నాయి. శామణ్ణ గార్డెన్‌ పరిధిలో తాగునీటి సరఫరా నిలిచి పోవడంతో ఒక గృహిణి ఇలా ప్లాస్టిక్‌ బిందెలతో ట్యాంకర్‌ నీటిని పట్టుకునేందుకు గురువారం పరుగులు తీస్తూ కనిపించింది. 

కొంత మంది ఆకతాయి చేష్టలతో ఆదిలాబాద్‌ పట్టణంలోని ట్రాఫిక్‌ పోలీసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ద్విచక్ర వాహనాలపై ముగ్గురికిపైగా తిరుగుతున్నారు. అలా వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ పోలీసులకు నెంబరు ప్లేట్‌ కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. 

కోడ్‌ అమల్లోకి రావడంతో అధికారుల ఆదేశాలతో నగరంలోని నేతల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు కూడలి వద్ద ఉన్న తొలితరం దర్శక నిర్మాత ఎల్వీప్రసాద్‌ విగ్రహానికి సైతం ముసుగు తొడిగేశారు. ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, ముసుగు తొలగించాలని పలువురు కోరుతున్నారు

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు నగర అందాలను తమ కెమెరాల్లో బంధించి జ్ఞాపకాలను పదిలం చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన యువతులు హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ఫొటోలు తీస్తూ కనిపించారిలా.. 

తన గుడ్లకు రక్షణ ఉంటుందని భావించిందో ఏమో.. బుల్‌బుల్‌ పిట్ట ఒకటి అరటి గెలలో గూడు కట్టుకొని నివసిస్తోంది. అరటి గెలలోనే గూడు నిర్మించుకొని గుడ్లు పెట్టి పొదుగుతోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం రంజోల్‌లోని అరటి తోటలో కనిపించిన గూడును ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో బక్క మల్లయ్య కుంటలోకి మేతకు వచ్చిన మేకలకు మిట్ట మధ్యాహ్నం దాహం వేసింది. కుంటలో నీరు లేక అక్కడే నిలిపి ఉంచిన పంచాయతీ నీటి ట్యాంకర్‌ నుంచి పడుతున్న ఒక్కో నీటి చుక్కలతో దాహం తీర్చుకున్నాయి. 

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home