చిత్రం చెప్పే విశేషాలు

(23-03-2024/1)

మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో రంగురంగుల చిత్రాలు, శిల్పాలు కొలువుదీరాయి. తెలంగాణ ఆర్ట్ గ్రూప్ షో పేరిట ప్రదర్శనకు ఉంచిన కళాకృతులు చూపరులను ఆకట్టుకున్నాయి. 

గాయని సునీత తన మధురమైన గాత్రంతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. పాత, కొత్త పాటలు ఆలపించి అందరినీ మైమరిపించారు. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ఎస్.వి.ఎం.గ్రాండ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమం వీనులవిందుగా సాగింది.

సంతకవిటి మండలం శ్రీహరినాయుడుపేట గ్రామం సమీపంలోని మడ్డువలస కాలువలో స్థానికులకు అరుదైన చేప దొరికింది. నల్లచారలు, రెక్కలు ఉండటంతో చూసేందుకు ఆసక్తి చూపారు. దీనిని సక్కర్‌ మౌత్‌ క్యాట్‌ ఫిష్‌ లేదా కామన్‌ ప్లెకో అని, స్థానికంగా దెయ్యం చేప అని కూడా అంటారని ఫిషరీస్‌ అధికారి తెలిపారు.

బజార్‌హత్నూర్‌ మండలం డేడ్రాకు వెళ్లే తోవలో దాదాపు 30 మంది వరకు గిరిజనులు తాత్కాలికంగా కొన్ని గుడిసెలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. స్థానికంగా ఉన్న చెలమ నీరు సరిగా లేక సమీపంలోని భగీరథ పైపు నుంచి బొట్టుబొట్టుగా పడుతున్న నీటిని ఒడిసి పట్టుకొని తమ అవసరాలు తీర్చుకొంటున్నారు.

నీరు అడుగంటడం..చేపలు కనిపించడంతో.. మిర్యాలగూడ పట్టణంలోని చిన్న చెరువు వద్ద పలు రకాల పక్షులు సందడి చేస్తున్నాయి.. చేపలను వేటాడుతూ పక్షులు చెరువులో తిరుగుతుండటంతో..ఆ దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది.  

మొరంగడ్డ చిన్న పరిమాణంలోనే పండుతుంది. మార్కెట్లో 5 నుంచి 8 అంగుళాల సైజు ఉంటాయి. కానీ ఈ దుంప ఏకంగా రెండడుగుల పొడవు, రెండున్నర కిలోల బరువుతో అబ్బురపరిచింది. ఇది వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం తురుకల సోమారం గ్రామానికి చెందిన కోల వెంకటేశ్వర్లు ఇంటి పెరట్లో పెరిగింది.

గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే బడి పిల్లలకు రాకపోకల సమయంలో భద్రత కొరవడింది. చాలా ఆటోల్లో పరిమితికి మించి పిల్లలను తీసుకువెళ్తున్నారు. జమ్మలమడుగు నుంచి ముద్దనూరుకు వెళ్లే దారిలో బడి పిల్లలు ఆటోలో వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణించారు.

జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలోని నల్లకుంట నరసింహ బస్తీ రైల్వే బ్రిడ్జి మార్గంలో వ్యర్థాలను తొలగించారు. అనంతరం కుండీల్లో మొక్కలను ఏర్పాటుచేసి అక్కడి గోడలను ఇలా ఆకట్టుకునే చిత్రాలతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు.

ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎంసీఏ ప్రతినిధులు బెంగళూరు టౌన్‌హాల్‌ వద్ద ప్రదర్శన నిర్వహించారు. వాననీటిని ఒడిసి పట్టుకోవడం, ఇంకుడు గుంతల ఏర్పాటు, నీటి పునర్వినియోగం, తక్కువ నీటితో చేసే సేద్యానికి ప్రాధాన్యమివ్వాలంటూ నినాదాలు చేశారు.

 నీటి వృథాను అరికట్టాలని, ప్రతి చుక్కను ఒడిసి పట్టుకోవాలని సైకత కళాకారుడు మనోజ్‌కుమార్‌ తన ప్రదర్శనతో వివరించారు. శుక్రవారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నగరంలో సైకత చిత్రం ప్రదర్శించారు. నీటిని వృథాచేస్తే ప్రకృతికి తీవ్ర నష్టం చేసిన వాళ్లమవుతామని ఆయన పేర్కొన్నారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home