చిత్రం చెప్పే విశేషాలు

(24-03-2024/1)

వాతావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్త్‌ అవర్‌లో భాగంగా శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. సచివాలయంతోపాటు ఐటీ కారిడార్‌లోని పలు భవనాల్లో విద్యుద్దీపాలు ఆపేయడంతో చీకట్లు అలుముకున్నాయి.

సాధారణంగా పక్షులు గడ్డి పోచలు, ఆకులతో గూళ్లు కట్టుకోవడం చూస్తుంటాం. దక్షిణ ఆసియాకు చెందిన స్ట్రీక్‌-థ్రోటెడ్‌ స్వాలో లేదా ఇండియన్‌ క్లిఫ్‌ స్వాలో అనే పక్షి.. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని అందవెల్లి పెద్దవాగు వంతెనకు మట్టితో గూళ్లు కట్టుకొని జీవనం సాగిస్తున్నాయి. 

మాదాపూర్‌ చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో కొనసాగుతున్న తెలంగాణ ఆర్ట్‌ గ్రూప్‌ ప్రదర్శనలో పలు చిత్రాలు, కళాఖండాలు ఆకట్టుకుంటున్నాయి. సజీవ దృశ్యంగా గోచరిస్తున్న చిత్తరువులను చూసి సందర్శకులు మంత్రముగ్ధులయ్యారు. 

మండుతున్న ఎండలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చల్లదనం కోసం వ్యాపారులు మట్టి కుండలను అమ్మకానికి పెట్టగా గిరాకీ పెరుగుతోంది. ట్యాపుతో ఉన్న రకరకాల కుండలను విక్రయిస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేలా మట్టి బాటిళ్లను సైతం అమ్మకాలకు ఉంచారు. 

పోషణ్‌ పక్వాడాలో భాగంగా అక్కినాపురం అంగన్‌వాడీ కేంద్రంలో ఐసీడీఎస్‌ సేవలపై అవగాహన కల్పించారు. పోషక విలువలు, పిల్లలకు బోధించే టీఎల్‌ఎం పరికరాలు, ఆకుకూరలు, పప్పులతో సూపర్‌వైజర్‌ వెంకటమ్మ ఆధ్వర్యంలో చక్కటి ఆకృతి తయారు చేశారు. ఆ బొమ్మలను తల్లులు ఆసక్తిగా తిలకించారు.

కందుకూరు పట్టణంలోని శివారు ప్రాంతాల్లో నివాసం ఉండే వీరు.. భార్యాబిడ్డలను రిక్షాపై ఎక్కించుకుని చుట్టుపక్కల గ్రామాల్లోని చెట్టుపుట్ట చెరువుగట్లపై తిరిగి వంటచెరకును సేకరిస్తుంటారు. దాన్ని విక్రయించి కడుపు నింపుకుంటారు. సుమారు 10కి.మీ. దూరం వెళ్లి వంటచెరకును సేకరిస్తారు.

హోలీ పండగ రోజు జరిగే కామ దహనం కోసం సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండి ప్రాంతంలో ఇలా బైక్‌పై కాముని దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు. ఇది జనాన్ని ఆకట్టుకుంటోంది. బైక్‌తో పాటు కాముని బొమ్మనూ దహనం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌ మండలంలోని చండూర్‌ శివారులో జోగిపేట- నర్సాపూర్‌ ప్రధాన దారిపై ముగ్గురు యువకులు ఒకే ద్విచక్రవాహనంపై వెళుతూ మధ్యలో యూరియా బస్తా పెట్టుకొని చిత్రాలు, వీడియోలు తీసుకున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

వేసవి ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. గ్రామాల్లో వాగులు, వంకల్లో నీటిచమ్మ లేకుండా వట్టిపోయాయి. దీంతో తాగునీటి కోసం మూగజీవాలు రోదిస్తున్నాయి. వరికుంటపాడు రామాలయం వీధిలో ఒక ఇంటి వద్ద పైపులో వస్తున్న నీటితో ఓ శునకం గొంతు తడుపుకొంటూ కనిపించటం ఆకర్షించింది. 

ప్రకృతిలో మోదుగు విరబూసి కనువిందు చేస్తోంది. మోదుగు పూసిందంటే..హోలీ వచ్చేసిందని సంకేతం. గ్రామాలలో మోదుగు వృక్షాలు ఎటు చూసినా విరబూసి ఆహ్లాదం పంచుతున్నాయి. ఏడాదిలో కేవలం నెల రోజులు మాత్రమే పుష్పాలు ఆకర్షణగా నిలుస్తాయి.

చిత్రం చెప్పే విశేషాలు (27-04-2024/1)

చేద్దాం రీడిజైన్‌

అప్సర @ఇంద్రపురి

Eenadu.net Home