చిత్రం చెప్పే విశేషాలు
(25-03-2024/1)
హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు సందర్శకులు తరలివచ్చారు. వరుస సెలవులు.. అందులోనూ ఆదివారం కావడంతో కిటకిటలాడింది. రైలెక్కి జూను సందర్శించారు. కేరింతలతో హోరెత్తించారు. చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు. టీవీలు, సినిమాల్లో కనిపించే జంతువులను ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయారు.
పున్నమి కాంతులు వెదజల్లుతుంటే ఆ వెలుగుల్లో కైలాసగిరుల్లో కొలువుదీరిన శివ, పార్వతులు మరింత తేజోవిరాజితంగా భక్తకోటికి దర్శనమిచ్చారు. చంద్రుని వెలుగుల కాంతి రేఖలతో వీరి సుందర రూపాన్ని శ్రీకాళహస్తిలో ఆదివారం రాత్రి.. భక్తకోటి దర్శించి తరించింది.
ఎండలు మండుతున్నాయి. కాస్త బయట తిరిగొస్తే వెంటనే చల్లని నీరు తాగాలనిపిస్తుంది. ప్రజల అవసరాలకు తగ్గట్లు తక్కువ ధరలకే మట్టితో వివిధ రకాల పాత్రలు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ నుంచి తెచ్చిన వివిధ మట్టి పాత్రలు నగర వాసులను ఆకట్టుకుంటున్నాయి.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో వన్యప్రాణులు వేసవి తాపాన్ని తట్టుకోవడానికి అధికారులు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. జూ సంరక్షణలో ఉన్న ఏనుగులు.. వాటికోసం ప్రత్యేకంగా నిర్మించిన నీటి తొట్టెల్లోకి చేరిపోయి తొండాలతో నీటిని చల్లుకుంటూ జలకాలాటలతో సేద తీరుతున్నాయి.
రష్యా రాజధాని నగరం మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఆదివారం పూరీతీరంలో సైకత శిల్పం తీర్చిదిద్దారు. ఉగ్రదాడిని ఖండిస్తూ, భారత్ శాంతినే కోరుతోందన్న సందేశమిచ్చారు.
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన నర్సింలు-నిర్మల దంపతుల కొడుకు సాయికుమార్ పెళ్లి ఏప్రిల్ 4వ తేదీన ఉంది. ప్రధాని మోదీ అంటే ఇష్టంతో తన కొడుకు పెళ్లి పత్రికలపై మోదీ బొమ్మ కింద ‘నా పెళ్లికి మీరిచ్చే బహుమతి.. నరేంద్ర మోదీజీకి మీరు వేసే ఓటు’ అని ముద్రించారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న చెట్టును చూస్తే ఎండిన ఆకులే ఉన్నాయి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆకులను మించి విరగ కాసిన కాయలు ఇవి. ఏటూరునాగారంలోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలోని నెమలినార చెట్టుకు కాసే కాయలు దూరం నుంచి చూస్తే ఇలా కనిపిస్తాయి.
ఈ హెల్మెట్‌ను చూడండి. పైన ఓ కెమెరా ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఓ వ్యక్తి బైక్‌పై దీన్ని ధరించి వెళ్తున్నాడు. అతని ప్రయాణం మొత్తం అందులో రికార్డవుతుంది. ఏదైనా ప్రమాదం జరిగినా ఎవరిది తప్పో ఇట్టే తెలిసిపోతుంది.
తాంసి మండల కేంద్రంలోని ఓ మోదుగు చెట్టు విరబూసి కనువిందు చేస్తుంది. హోలీ నేపథ్యంలో ఈ పూలను పల్లెల్లో సేకరించారు. వీటిని దంచి, ఉడకబెట్టి నీళ్లలో కలిపి చల్లుకుంటూ పలువురు ఆనందంగా గడిపారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వైపు హుస్సేన్‌సాగర్‌లో ఆదివారం సాయంత్రం మ్యూజిక్ ఫౌంటేయిన్లు కనువిందు చేశాయి. సంగీతానికి లయబద్ధంగా నృత్యాలు చేస్తున్నట్లు నీరు సన్నని ధారలా ఎగసిపడుతుండగా సందర్శకులు కేరింతలు కొట్టారు.