చిత్రం చెప్పే విశేషాలు

(28-03-2024/1)

గోదావరి నదిపై గల రోడ్‌కం రైలు వంతెనపై బుధవారం కనిపించిన సూర్యాస్తమయం దృశ్యం కనువిందు చేసింది. వంతెనకు ఇరువైపులా ఉన్న విద్యుత్తు దీపాల మధ్యలో కనిపించిన ఈ దృశ్యాన్ని తిలకించిన పలువురు నగరవాసులు తమ చరవాణుల్లో బంధించి ఆనందం వ్యక్తం చేశారు.

ప్రముఖ టీవీ యాంకర్‌ శ్రీముఖి బుధవారం నిజామాబాద్‌ నగరంలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులతో ముచ్చటించారు. అనంతరం అభిమానులతో సెల్ఫీలు దిగారు.

చెన్నై బెసంట్‌నగర్‌ సముద్రతీరానికి వచ్చిన అరుదైన తాబేలును జాలర్లు సురక్షితంగా సముద్రంలో వదిలారు. అంతరించిపోతున్న అరుదైన హాక్సిబిల్‌ తాబేలు అని, చెన్నైలో మొదటిసారిగా కనిపించిందని తాబేళ్ల పరిరక్షణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

200.. ముంబయి తరఫున ఐపీఎల్‌లో రోహిత్‌ ఆడిన మ్యాచ్‌లు. ఆ జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడింది అతనే. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు రోహిత్‌కు.. సచిన్‌ 200 నంబరుతో కూడిన ప్రత్యేక జెర్సీ, టోపీ బహుకరించాడు.  

చెరువుల్లో, బావుల్లో నీళ్లు లేక పైర్లు సైతం ఎండి, చేలల్లో నీటిచుక్క జాడలేక మర్కటాలు ఊర్లపై పడుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం మోతె మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందున్న నీళ్ల సంపు వద్ద కోతులు దాహం తీర్చుకున్న తీరును ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. 

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ గోల్ఫ్‌ స్టిక్‌ చేతబట్టాడు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్‌ క్లబ్‌లో బుధవారం గోల్ఫ్‌ ఆడాడు. ఈ సందర్భంగా చాముండేశ్వరనాథ్, వెంకటపతి రాజు, రాహుల్‌ సంఘ్వీతో కలిసి సచిన్‌ ఇలా కనిపించాడు. 

ఎండలు తీవ్రరూపం దాల్చడంతో కృష్ణానదిలోని చిన్న చిన్న నీటి మడుగుల్లో నీరు తగ్గి చేపలు ఇలా చనిపోతున్నాయి. బుధవారం బీచుపల్లిలోని కృష్ణానదిలోని గుర్రంగడ్డ, నిజాంకొండ తదితర ప్రాంతాలలోని నీటి మడుగుల్లో చేపలు మృత్యువాత పడి కనిపించాయి. 

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ రైతుపేట డౌన్‌లో నివసిస్తున్న ఉపాధ్యాయుడు కుమారస్వామి ఇంటి ఆవరణలో ఓ సొర పాదు 5 అడుగుల కాయ కాసింది. తన ఇంటి పెరట్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలను సాగు చేస్తున్నారు. 

బెంగళూరులో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాత మైసూరు బ్యాంకు కూడలిలో ఖాళీ బిందెలు ప్రదర్శిస్తూ ధర్నా చేస్తున్నఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడిచి పెట్టారు. 

ఎండలు ముదురుతున్నాయి. భానుడి సెగ నుంచి జీవాలు కాపాడుకునేందుకు గొర్రెల కాపరులు నానా తంటాలు పడుతున్నారు. సీసీకుంట మండలం బండర్‌పల్లి వాగులో మిట్ట మధ్యాహ్నం వేళ గొర్రెలను నీటిలో ముంచుతూ ఒడ్డుకు పంపిస్తున్న దృశ్యాన్ని ‘ఈనాడు’ క్లిక్‌ మనిపించింది.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home